Nepal Plane Crash: పది సెకన్లలో తీరాల్సిన కల.. కాలి బూడిదైంది!

చీఫ్‌ పైలట్‌ కావాలనేది ఆమె 16 ఏళ్ల కల.. పైలట్‌గా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆ కలను నెరవేర్చుకోవడానికి ఇంకా కేవలం పది సెకన్ల సమయమే మిగిలి ఉంది. సాధారణంగా ఇలాంటి సమయంలో మనసులో కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఇలా తన కలను నిజం చేసుకునే ఆనందంలో ఉన్నారు అంజు ఖతివాడా. అంతలోనే విధి వక్రించి తన కలతో పాటు....

Published : 16 Jan 2023 19:20 IST

చీఫ్‌ పైలట్‌ కావాలనేది ఆమె 16 ఏళ్ల కల.. పైలట్‌గా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆ కలను నెరవేర్చుకోవడానికి ఇంకా కేవలం పది సెకన్ల సమయమే మిగిలి ఉంది. సాధారణంగా ఇలాంటి సమయంలో మనసులో కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఇలా తన కలను నిజం చేసుకునే ఆనందంలో ఉన్నారు అంజు ఖతివాడా. అంతలోనే విధి వక్రించి తన కలతో పాటు తానూ కాలి బూడిదయ్యారు. తన ఒక్కగానొక్క కొడుకును అనాథను చేసి వెళ్లిపోయారామె. 16 ఏళ్ల క్రితం అంజు తన భర్తను కూడా సరిగ్గా ఇలాంటి ప్రమాదంలోనే పోగొట్టుకోవడం యాదృచ్ఛికం. తాజాగా జరిగిన నేపాల్‌ విమాన దుర్ఘటనలో కో-పైలట్‌గా వ్యవహరించిన అంజు విషాద గాథ ఇది!

అంజు ఖతివాడాది నేపాల్‌లోని బిరాట్‌నగర్‌. అక్కడి యతి ఎయిర్‌లైన్స్‌లో కో-పైలట్‌ అయిన దీపక్‌ పోఖ్రెల్‌ను వివాహం చేసుకున్నారామె. వృత్తి పట్ల అంకితభావం చూపే తన భర్తను చూసి అనుక్షణం స్ఫూర్తి పొందేవారు అంజు. అయితే ఆయన మరణంతో తానూ ఇదే రంగంలోకి వస్తానని అప్పుడు అనుకోలేదామె.

భర్త మరణంతో..!

దురదృష్టవశాత్తూ అంజు భర్త దీపక్‌ 2006లో యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమాన ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఆయన ఆ విమానానికి కో-పైలట్‌గా వ్యవహరించారు. అయితే భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అంజు.. బాధను దిగమింగుకొని.. తానూ భర్త అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. విమానాన్ని నడుపుతూ విధుల్లోనే భర్త ప్రాణాలు కోల్పోయినా.. ఏమాత్రం అధైర్యపడక తాను సైతం అదే రంగంలోకి అడుగుపెట్టారామె. ఈ క్రమంలో ఆయన మరణానంతరం వచ్చిన బీమా డబ్బుతో పైలట్‌ శిక్షణ తీసుకున్నారు అంజు. అలా భర్త చనిపోయిన నాలుగేళ్ల తర్వాత యతి ఎయిర్‌లైన్స్‌లో కో-పైలట్‌గా చేరారామె. విధి నిర్వహణలో ఎంతో ధైర్యంగా వ్యవహరించే ఆమె.. నేపాల్‌ రాజధాని ఖాట్మండూ నుంచి పోఖరా మార్గంలో తరచూ విమానాలు నడిపేవారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొనే ఆమె.. ఎన్నో విమానాల్ని సురక్షితంగా దించిన ఘనతను సొంతం చేసుకున్నారు.

పైలట్‌ కల నెరవేరకుండానే..!

విధి నిర్వహణలో ఎన్నో కలలు కంటాం.. మరెన్నో లక్ష్యాల్ని ఏర్పరచుకుంటాం. 16 ఏళ్ల క్రితం కో-పైలట్‌గానే కన్నుమూసిన తన భర్త పైలట్‌ కావాలన్న ఆశయాన్ని తాను నెరవేర్చాలని కలలు కన్నారు అంజు. ఖాట్మండూ నుంచి బయల్దేరిన విమానం మరో పది సెకన్లలో పోఖరాలో దిగగానే.. నిర్ణీత పని గంటలు పూర్తి చేసి కో-పైలట్‌ నుంచి పైలట్‌గా లైసెన్స్‌ అందుకునేవారు అంజు. కానీ ఆ పది సెకన్లలోనే అంతా తారుమారైంది. చూస్తుండగానే విమానం అదుపు తప్పి కుప్పకూలింది. తన కల నెరవేరకముందే కనుమరుగైపోయారు అంజు. భార్యాభర్తలిద్దరూ యతి విమానయాన సంస్థకు చెందిన విమాన ప్రమాదంలోనే, అదీ కో-పైలట్లుగా ఉన్నప్పుడే చనిపోవడం విషాదకరం! ఇలా అంజు తన ఒక్కగానొక్క కొడుకును అనాథగా మిగిల్చి వెళ్లిపోవడం అందరినీ కలచివేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్