అప్పుడు అంబానీ కాల్ చేస్తే ‘నేను ఎలిజబెత్‌ టేలర్‌’ అంటూ ఫోన్‌ పెట్టేశా..!

‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు..’ ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తరతమ భేదాల్లేకుండా ఔత్సాహికుల ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారామె. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ అధిపతిగా....

Published : 04 Apr 2023 12:34 IST

(Photos: Instagram)

‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు..’ ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తరతమ భేదాల్లేకుండా ఔత్సాహికుల ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారామె. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ అధిపతిగా క్రీడాకారుల వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నీతా.. మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ని కూడా రూపొందించారు. ఇక ఇప్పుడు దేశవిదేశాల్లో ఉన్న వివిధ కళలకు, కళాకారులకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారామె. ఈ లక్ష్యంతోనే తన కలల ప్రాజెక్ట్‌ ‘నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక  కేంద్రాన్ని (MNACC)’ తాజాగా ప్రారంభించారామె. ఇలా ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా, సెలబ్రిటీగా ఎంతోమందికి సుపరిచితమైన ఈ బిజినెస్‌ లేడీ.. భార్యగా, కోడలిగా, అమ్మగా, నృత్య కళాకారిణిగా, సమాజ సేవకురాలిగా.. ఇలా తన వ్యక్తిగత జీవితంలోని ప్రతి కోణంలోనూ సక్సెసయ్యారు. ‘NMACC ప్రారంభం ఓ అద్భుతమైన ప్రయాణం’ అంటోన్న నీతా.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆయా సందర్భాల్లో పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం..!

డ్యాన్స్‌ చూసి కోడలిగా చేసుకుంటామన్నారు!

మాది గుజరాత్‌కు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం. నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. చిన్న వయసులోనే ఇందులో శిక్షణ పొందాను. దీన్నే కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. ఓసారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధీరూబాయ్‌ అంబానీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అందులో నేను డ్యాన్స్‌ ప్రదర్శన చేశా. అది చూసి ఆయన నన్ను వాళ్లింటి కోడలిగా చేసుకోవాలనుకున్నారట! ఈ క్రమంలోనే కొన్నాళ్లకు ఆయన్నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. మొదట నమ్మకుండా పదే పదే ఫోన్‌ కట్‌ చేసేదాన్ని. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి.. ‘నేను ధీరూబాయ్‌ అంబానీని మాట్లాడుతున్నాను..’ అనగానే ‘నేను ఎలిజబెత్‌ టేలర్‌’ అంటూ ఫోన్‌ పెట్టేశాను. కానీ ఆ తర్వాత కాల్‌ నాన్న ఎత్తారు. అసలు సంగతి తెలుసుకొని నన్ను మందలించారు. ఆయన ఆఫీస్‌లో నన్ను కలవమన్నారని నాన్న చెప్పడంతో కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. కానీ మామగారు మాత్రం చాలా సంతోషించారు. నన్ను, మా కుటుంబ సభ్యుల్ని వాళ్లింటికి డిన్నర్‌కి పిలిచారు. అప్పుడే ముకేశ్‌ను తొలిసారి కలుసుకున్నా. తొలి చూపులోనే ఒకరికొకరం నచ్చేశాం. ఆపై ఏడాది పాటు ప్రేమించుకున్న మేము.. 1985లో పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కాం.

పిల్లలు పుట్టరన్నారు!

ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం ఓ ప్రత్యేక అధ్యాయం. నేను స్కూల్లో ఉన్నప్పుడు ‘నేనే తల్లినైతే..?’ అనే అంశంపై ఓ పెద్ద వ్యాసం రాశాను. అమ్మ గొప్పతనమేంటో అప్పుడు నాకు మరింత లోతుగా అర్థమైంది. అయితే ముకేశ్‌తో పెళ్లి తర్వాత ఈ దశలోకి అడుగుపెట్టడానికి నాకు సుమారు 8 ఏళ్లు పట్టింది. తొలుత డాక్టర్‌ను సంప్రదిస్తే.. ‘మీరు ఎప్పటికీ తల్లి కాలేరు..’ అని చెప్పారు. ఆ క్షణం నా గుండె బద్దలైనంత పనైంది. కానీ ఆ సమయంలో ఐవీఎఫ్‌ నాకు వరంగా మారింది. తొలుచూరుగా ఈషా-ఆకాశ్‌ కవలలు పుట్టారు. అదీ రెండు నెలలు ముందుగానే! అయితే ఆపై నాలుగేళ్లకు అనంత్‌కు జన్మనిచ్చా. నా ముగ్గురు పిల్లల్ని చిన్నతనం నుంచి ఎంతో సింపుల్‌గా పెంచా. డబ్బు విలువ నేర్పా. వాళ్లని స్కూల్‌కి, కాలేజీకి పంపడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఉపయోగించేదాన్ని. నేనో స్ట్రిక్ట్‌ మదర్‌ని కూడా!

డ్యాన్స్‌.. నా స్ట్రెస్‌బస్టర్!

డ్యాన్స్‌ నా ఆరోప్రాణం. స్కూల్‌, కాలేజీ ఫంక్షన్లలో భరతనాట్య ప్రదర్శనలిచ్చేదాన్ని. అంతెందుకు.. ఇప్పటికీ మా ఇంట్లో ఏ వేడుకైనా నా డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ ఉండాల్సిందే! డ్యాన్స్‌ నాకు ధ్యానంతో సమానం. ఒత్తిళ్లను నా నుంచి దూరం చేసి ప్రశాంతతను అందిస్తుంది.. నన్ను పునరుత్తేజితం చేస్తుంది. అందుకే ఈషాకూ భరతనాట్యం నేర్పించాలనుకున్నా. కానీ పలు కారణాల వల్ల అది కుదరలేదు. డ్యాన్స్‌తో పాటు ఈత కొట్టడం, నా పిల్లలతో సమయం గడపడానికి ఆసక్తి చూపుతా. ఇక ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ తీసుకున్నప్పట్నుంచీ క్రికెట్ పైనా మక్కువ పెరిగింది.

నేనూ అదే తినేదాన్ని..!

మనం ఏం చేసినా పిల్లలు దాన్ని చూసి అనుసరిస్తారు. నేనూ ఈ సూత్రాన్ని బాగా నమ్ముతా. అందుకే నా కొడుకు అనంత్‌ బరువు తగ్గే క్రమంలోనూ ఇదే సూత్రాన్ని పాటించా. వివిధ ఆరోగ్య సమస్యల రీత్యా తను బరువు తగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల విషయాల్లో నిపుణుల సలహాలు పాటించేదాన్ని. తను ఏది తింటే నేనూ అదే తినేదాన్ని. తను వ్యాయామాలు చేస్తున్నప్పుడల్లా నేనూ తనతో చేరి అవే వర్కవుట్లు సాధన చేసేదాన్ని. తను వాకింగ్‌/జాగింగ్‌కు వెళ్లినా కూడా వెళ్లేదాన్ని. ఇలా మొత్తానికి అనంత్ బరువు తగ్గి తిరిగి ఆరోగ్యంగా మారాడు. అంతకంటే ఇంకేం కావాలి..! మరోవైపు.. నేనూ ఫిట్‌గా తయారయ్యా..!

తరగని అందానికి..!

నన్ను కలిసిన వారిలో చాలామంది అడిగే ప్రశ్న.. ‘మీ బ్యూటీ సీక్రెట్‌ ఏంటి?’ అని! చాలా సింపుల్‌.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే నా సౌందర్య రహస్యం. రోజూ డీటాక్స్ వాటర్‌, బీట్‌రూట్‌ రసం, పాలకూర రసం, రెండుసార్లు కొబ్బరి నీళ్లు తాగుతా. ఇవి నా శరీరంలోని విషపదార్థాల్ని తొలగించి.. చర్మానికి మెరుపునిస్తాయి. అలాగే మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌, పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటా. వీటిలోని ఫైబర్‌ నా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

అందుకే ఆ స్కూల్!

పెళ్లి తర్వాత పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించా. ఈ క్రమంలోనే చాలామంది పిల్లలు నాణ్యమైన విద్య కోసం విదేశాలకు వెళ్లడం గుర్తించా. ఆ స్కూలేదో ఇక్కడే ఏర్పాటుచేస్తే బాగుండనిపించింది. వెంటనే ముకేశ్‌తో చర్చించి మామగారి పేరు మీద ‘ధీరూబాయ్‌ అంబానీ స్కూల్‌’ని ప్రారంభించాం. పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు కల్పించడమే దీని ముఖ్యోద్దేశం. ఇక మరోవైపు ఆరోగ్యం, విద్య, క్రీడలు, విపత్తు నిర్వహణ, కళలు, సంస్కృతి, పట్టణ పునరుద్ధరణ.. వంటి అంశాల్లో సేవలందించడమే ముఖ్యోద్దేశంగా గత 13 ఏళ్లుగా మా ‘రిలయన్స్‌ ఫౌండేషన్‌’ పనిచేస్తోంది. ఇక మహిళల అభ్యున్నతి కోసం రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘హర్‌ సర్కిల్‌’ వెబ్‌సైట్‌, యాప్‌.. విజయవంతమయ్యాయి. ఫిట్‌నెస్‌, పౌష్టికాహారం, సంతాన సాఫల్యత, ప్రెగ్నెన్సీ, ఆర్థిక సంబంధిత అంశాలు.. తదితర విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం లక్షలాది మంది మహిళలు ఈ వేదికను ఉపయోగిస్తున్నారు.


కళలకు పట్టం!

మన కలల ప్రాజెక్ట్‌ కళ్ల ముందు సాక్షాత్కారమైతే ఆ అనుభూతే వేరు! నీతా అంబానీ కూడా తన కలల ప్రాజెక్ట్‌ను ఇటీవలే ప్రారంభించారు. విభిన్న రంగాల్లో ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించడంలో ముందుండే ఆమె.. దేశవిదేశాల్లో ఉన్న కళాకారుల్ని ప్రోత్సహించడానికి, మన దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని చాటే ముఖ్యోద్దేశంతో జియో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ‘నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రాన్ని’ (NMACC)’ తాజాగా ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ‘దేశంలోనే తొలి బహుళ కళల కేంద్రం’గా పేరుగాంచిన ఈ వేదికపై సినిమా, సంగీతం, రంగస్థలం, సాహిత్యం, జానపదం, ఆధ్యాత్మికం.. వంటి అంశాల్లో ఆయా కళాకారులు వారి కళలను ప్రదర్శించచ్చు. ఇదే సమయంలో మన దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రపంచ వ్యాప్తంగా చాటే ముఖ్యోద్దేశంతోనే ఈ వేదికను ప్రారంభించానంటున్నారు నీతా.

‘ఈ సాంస్కృతిక కేంద్రానికి ప్రాణం పోయడానికి ఓ మహా యజ్ఞమే చేశా. ఇదో అద్భుతమైన ప్రయాణం. దేశవిదేశాల్లోని కళాకారుల్లో ఉన్న కళలు, నైపుణ్యాల్ని విశ్వవ్యాప్తం చేయడానికి, దేశ సంప్రదాయాల్ని ప్రతిబింబించడానికి ఇదో మహత్తర వేదిక..’ అంటున్నారామె. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు పాల్గొని సందడి చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్