Online Offers: ఫూల్‌.. అవ్వొద్దు!

ఈరోజు భయపెట్టో, ఆటపట్టించో సరదాగా ‘ఫూల్‌’ అనేస్తుంటారు. వీటివల్ల మనకు పోయేదేమీ లేదు. కానీ కొన్ని సీరియస్‌ అంశాల్లో మన ఆడవాళ్లనే ప్రధాన లక్ష్యాలుగా చేసుకుంటున్నారు కొందరు. వాటి విషయంలో మాత్రం ఫూల్‌ అవ్వకుండా జాగ్రత్త పడదామా!

Updated : 01 Apr 2023 05:16 IST

ఈరోజు భయపెట్టో, ఆటపట్టించో సరదాగా ‘ఫూల్‌’ అనేస్తుంటారు. వీటివల్ల మనకు పోయేదేమీ లేదు. కానీ కొన్ని సీరియస్‌ అంశాల్లో మన ఆడవాళ్లనే ప్రధాన లక్ష్యాలుగా చేసుకుంటున్నారు కొందరు. వాటి విషయంలో మాత్రం ఫూల్‌ అవ్వకుండా జాగ్రత్త పడదామా!

‘50% రాయితీ!’ రజనిని ఆకర్షించింది. దుస్తులూ బాగున్నాయి. ఇంకే టకటకా నాలుగింటిని కార్ట్‌లోకి కొట్టి డబ్బులు కట్టేసింది. ఎంత ఎదురుచూసినా దుస్తులు మాత్రం రాలేదు. తీరా ఆ వెబ్‌సైట్‌ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. సోషల్‌ మీడియాలో ఏదో లింకు నుంచి వెళ్లి కొనింది మరి!

ఆన్‌లైన్‌ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. నిత్యం కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దీంతో మోసపోవడం సహజమే! తొలిసారి ఆన్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నా, కొత్త వెబ్‌సైట్‌ని ప్రయత్నిస్తున్నా క్యాష్‌ ఆన్‌ డెలివరీని ఎంచుకోవడం మేలు. ఇంకా కొనేముందు గూగుల్‌ లేదా సోషల్‌ మీడియాలో దాని గురించి వెతకడం, రివ్యూలు ఉన్నాయో లేదో చెక్‌ చేసి చదవడం వంటివి చేశాకే ప్రయత్నిస్తే మోసపోయే సమస్య ఉండదు.


వాట్సాప్‌ మెసేజ్‌. బాగా పేరున్న సంస్థ.. పండగ ఆఫర్‌ లింకు. ఏమాత్రం ఆలోచించకుండా ఓపెన్‌ చేసింది లిఖిత. సర్వే చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, బంగారం, డబ్బులు గెలుచుకోండి. కొన్ని నిమిషాల్లో ముగుస్తుంది అనేసరికి త్వరత్వరగా సమాధానాలు చెప్పింది. చెప్పినట్టుగానే చివరకు స్క్రాచ్‌ కార్డు వచ్చింది. నొక్కితే డబ్బులొచ్చినట్లుంది. అకౌంట్‌లోకి చేరడానికి వివరాలడిగితే ఇచ్చింది. రూఢీ చేసుకోవడానికి ఓటీపీ అంటే దాన్నీ అందించింది. తీరా డబ్బులు రాకపోగా అన్నీ పోయాయి. ఇదేమని సంస్థ కాల్‌సెంటర్‌కి ఫోన్‌ చేస్తే అది స్పామ్‌ అన్నారు.

బాగా తెలిసిన, ప్రముఖ సంస్థల పేరిట ఇలాంటి మోసాలెన్నో! ఒక్కోసారి బ్యాంకు పేరిటా వస్తుంటాయి. లింకు ఇచ్చారు కదాని తెరిచినా, వివరాలు ఇచ్చినా డబ్బులు పోగొట్టుకున్నట్టే. కాబట్టి, నిజమేనా అని తెలుసుకోవడానికి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్‌ చేసుకోవడమో, వాళ్ల కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి కనుక్కోవడమో చేయండి. ఆ లింకులను జాగ్రత్తగా పరిశీలించినా ఏదో తేడా ఉందని తెలిసిపోతుంది. తొందరపడక ఆలోచించాలంతే!


ఎన్నారై పెళ్లి సంబంధం కుదిరింది. తనకు అత్యవసరమంటే చేసుకోబోయే వాడేగా అని దాచుకున్నదంతా ఇచ్చేసింది సృజన. తర్వాత ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీనే లేదు.

పెళ్లి కాని అమ్మాయిలు, ఒంటరి మహిళల లక్ష్యంగానూ మోసాలెక్కువే. సోషల్‌ మీడియా, పెళ్లి పేరుతో మానసికంగా దగ్గరవుతారు. వీలైనంత డబ్బు తీసుకుంటారు. అన్నిసార్లూ వీళ్ల లక్ష్యం డబ్బే అవదు. ఫొటోలు సేకరించి బెదిరించడం లేదా అశ్లీల వెబ్‌సైట్లలో అమ్మడం వంటివీ చేస్తుంటారు.


ఫ్రెండ్‌ సిస్టమ్‌లోంచి అప్పుడే  ఫోన్‌ బిల్‌ కట్టింది శ్వేత! కొద్దిసేపటికే కాల్‌ ‘ఫోన్‌ బిల్‌ చెల్లించలేద’ని. తనేమో కట్టానని. చెక్‌ చేస్తానని కార్డు నెంబరు, ఇతర వివరాలు అడిగితే చెప్పింది. చివరగా ఓ ఓటీపీ వస్తుందంటే దాన్నీ ఇచ్చింది. తర్వాత చెక్‌ చేసుకుంటే.. ఖాతాలో డబ్బులన్నీ ఖాళీ!

సైబర్‌ నేరగాళ్లు ఎప్పుడెక్కడ పొంచి ఉంటారో చెప్పలేం. కాబట్టి, ఇతరుల కంప్యూటర్లను వాడకపోవడమే మేలు. ఫోన్‌ కాల్‌.. ఆర్‌ఆర్‌బీ, బ్యాంకు, పోలీస్‌ స్టేషన్‌, ఐటీ డిపార్ట్‌మెంట్‌, ప్రభుత్వ కార్యాలయాలు.. ఎక్కడ్నుంచి అని చెప్పినా సరే.. కార్డు వివరాలను ఇవ్వొద్దు. ముఖ్యంగా ఓటీపీని చెప్పొద్దు.


ఆన్‌లైన్‌ పరంగా ఏ నిర్ణయమైనా ఆచితూచి అడుగు వేయండి. సైబర్‌ రక్షణ గురించి తెలుసుకోండి. లేదంటే నలుగురిలో చిన్నబోయేది మనమే! కాబట్టి.. జాగ్రత్త మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్