అక్కడ ఒక్క నిద్ర చేస్తే.. ఆ పుణ్యం అనంతం!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచారామ క్షేత్రాలు హరిహర నామస్మరణతో హోరెత్తిపోతాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు ముందే భక్తులు పవిత్రస్నానాలు చేయడం మొదలుపెడతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే తులసీ లగ్నం, భీష్మ ఏకాదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి....

Updated : 18 Feb 2023 14:50 IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచారామ క్షేత్రాలు హరిహర నామస్మరణతో హోరెత్తిపోతాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు ముందే భక్తులు పవిత్రస్నానాలు చేయడం మొదలుపెడతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే తులసీ లగ్నం, భీష్మ ఏకాదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి, ప్రతి సోమవారం ఈ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతాయి. ఈ పంచారామాలు ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కొలువుదీరాయి.

అమరారామం

గుంటూరు జిల్లా అమరావతి పట్టణంలో ఉన్న ఈ ఆలయంలో శివుడు అమరేశ్వర స్వామిగా, అమరలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా ఇంద్రుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. కార్తీకమాసం, మహాశివరాత్రి రోజుల్లో ఇక్కడ ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

ద్రాక్షారామం

పంచారామాల్లో ఇది ముఖ్యమైనది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి శివుడు భీమేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. సాక్షాత్తూ సూర్యభగవానుడే భీమేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. అలాగే రాముడు శివుణ్ని కొలిచిన పవిత్ర ప్రదేశం ఇదే అని చరిత్ర చెబుతోంది. ఇక్కడికి చేరుకోవడానికి రాజమండ్రి లేదా సామర్లకోట వరకు రైలు సదుపాయం ఉంది. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఆలయానికి చేరుకోవచ్చు.

సోమారామం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు ఉమాసోమేశ్వరస్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఇక్కడి సోమేశ్వరలింగం అమావాస్య రోజున గోధుమ, నలుపు వర్ణాలలోనూ, పౌర్ణమి రోజున తెలుపు రంగులోను దర్శనమిస్తుందని స్థానికులు చెబుతారు. ఆలయంలో కింద పరమశివుడి లింగం, దాని పైఅంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉండడం కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. భీమవరం వరకు రైలు లేదా బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

క్షీరారామం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వెలసిన ఈ క్షేత్రంలో శివుడు రామలింగేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని మహావిష్ణువు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలంలో నూరు పక్షాలు, గయలో ఎనభై గడియలు, కేదారేశ్వరంలో వందేళ్లు, వారణాసిలో ఒక సంవత్సరం, రామేశ్వరంలో వెయ్యేళ్లు, హరిద్వార్‌లో ఎనిమిదేళ్లు భక్తితో నివసిస్తే పొందే ఫలం ఇక్కడ కేవలం ఒక నిద్ర చేస్తే పొందచ్చట. రెండున్నర అడుగుల ఎత్తులో, పాలవర్ణంలో మెరిసే క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శివరాత్రి సమయంలోనూ, కార్తీకమాసంలోనూ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడకు చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాల సౌలభ్యం ఉంది.

కుమారారామం

సామర్లకోట రైల్వేస్టేషన్‌కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోను, కాకినాడ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం కొలువై ఉంది. ఇక్కడి శివుణ్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల దీనికా పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి శివుడు బాలాత్రిపుర సుందరి సమేతుడై, కుమార భీమేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు. ఈ ఆలయానికి శివరాత్రితో పాటు కార్తీకమాసంలో సైతం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్