Parineeti Chopra : జంక్‌ఫుడ్‌ తిన్నా.. 15 కిలోలు పెరిగా!

సినిమాల్లో పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం మన అందాల తారలకు కొత్త కాదు. అయితే తగ్గాక పెరగడమైనా, పెరిగాక తగ్గడమైనా.. ఈ రెండూ శ్రమతో కూడుకున్నవే అని చెప్పాలి.

Published : 05 Dec 2023 18:59 IST

(Photos: Instagram)

సినిమాల్లో పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం మన అందాల తారలకు కొత్త కాదు. అయితే తగ్గాక పెరగడమైనా, పెరిగాక తగ్గడమైనా.. ఈ రెండూ శ్రమతో కూడుకున్నవే అని చెప్పాలి. బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ పరిణీతి చోప్రా కూడా ప్రస్తుతం బరువు తగ్గే పనిలోనే ఉంది. ఇంతకీ తాను ఏ సినిమా కోసం, ఎన్ని కిలోలు పెరిగిందనేగా.. మీ సందేహం? ‘చమ్కీలా’ కోసం ఏకంగా 15 కిలోలు పెరిగిందీ ముద్దుగుమ్మ. అసలు ఇన్ని కిలోలు ఎలా పెరిగింది? ప్రస్తుతం బరువు తగ్గడానికి ఎలాంటి కసరత్తులు చేస్తోంది? తదితర విషయాలన్నీ తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది పరి. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

తన వ్యక్తిగత జీవితమైనా, కెరీర్‌కు సంబంధించిన విశేషాలైనా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది పరిణీతి. ఈ క్రమంలోనే తాను జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోను తాజాగా పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. ‘చమ్కీలా’ సినిమా కోసం తాను పెరిగిన 15 కిలోల బరువును ఇలా తగ్గుతున్నానంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

ఆ రెండే.. నా లోకం!

జిమ్‌లో లాంజెస్‌, బ్యాక్‌ప్రెస్‌ వంటి వర్కవుట్లు చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిన పరిణీతి.. ‘గతేడాది ఆరు నెలల పాటు రెహమాన్‌ సర్‌ స్టూడియోలోనే గడిపాను.. స్టూడియోలో పాటలు సాధన చేయడం, ఇంటికెళ్లాక కడుపు నిండా జంక్‌ ఫుడ్‌ లాగించడం.. ఇదే నా రొటీన్‌గా మారింది. ఇదంతా చమ్కీలా సినిమా కోసం 15 కిలోలు పెరగడానికే! సంగీతం, ఆహారం.. ఆ ఆరు నెలలూ ఈ రెండే నా లోకంగా గడిచిపోయాయి. సినిమా పూర్తైంది.. ఇప్పుడు సీన్‌ రివర్సైంది. స్టూడియోను మిస్సవుతున్నా. పెరిగిన 15 కిలోలు తగ్గడానికి జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నా.. ఏదేమైనా బరువు పెరగడం, తగ్గడం.. రెండూ కష్టమే! పూర్వపు స్థితికి రావాలంటే మరిన్ని కిలోలు తగ్గాలి..’ అంటూ రాసుకొచ్చింది. ఇలా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది స్పందిస్తూ పరి అంకితభావాన్ని, పట్టుదలను ప్రశంసిస్తున్నారు. ‘చమ్కీలా’ సినిమాలో పరి.. పంజాబీ దివంగత జానపద గాయని అమర్‌జ్యోత్‌ కౌర్‌ సింగ్‌ పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే పరిణీతి పెళ్లి తర్వాత విడుదల కాబోయే తొలి చిత్రం కావడంతో.. ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.


ఇవే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌!

అయితే పరిణీతి బరువు తగ్గడం ఇది తొలిసారేమీ కాదు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు సుమారు 86 కిలోలున్న ఈ చక్కనమ్మ.. 28 కిలోలు తగ్గి మరీ వెండితెరపై తెరంగేట్రం చేసింది. అలా అప్పట్నుంచి 58 కిలోల బరువును కొనసాగిస్తూ వస్తోందామె. అయితే తన బరువు ఇలా అదుపులో ఉండడానికి తాను పాటించే ఆహార నియమాలు, చేసే వ్యాయామాలే కారణమంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

⚛ ‘నాకు పిజ్జాలంటే ప్రాణం. కానీ బరువు తగ్గే క్రమంలో వాటిని పూర్తిగా పక్కన పెట్టేశా. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమిస్తున్నా.

⚛ ఉదయం అల్పాహారంగా.. బ్రౌన్‌ బ్రెడ్‌-వెన్న, రెండు ఉడికించిన కోడిగుడ్ల తెల్లసొనలు, ఒక గ్లాసు పాలు లేదా ఏదైనా పండ్ల రసం తీసుకుంటా.

⚛ సలాడ్‌తో నా లంచ్‌ మొదలవుతుంది. మధ్యాహ్న భోజనంలో భాగంగా వైట్‌ రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌కే ప్రాధాన్యమిస్తా. బ్రౌన్‌ రైస్‌, రోటీ, పప్పు, ఆకుకూరలు లంచ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే!

⚛ ఇక రాత్రి భోజనంలో రోటీతో పాటు ఏదైనా పప్పు కూర, బీన్స్‌, ఫైబర్‌ అధికంగా ఉండే కాయగూరలు తీసుకుంటా. పీచు తీసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది. డిన్నర్‌కు, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్‌ ఉండేలా చూసుకుంటా.

⚛ నేను తీసుకునే ఆహారంలో నూనె తక్కువగా ఉండేలా జాగ్రత్తపడతా. అలాగే నూనె పదార్థాల్ని వీలైనంత వరకు దూరం పెడతా.

⚛ నా బరువును అదుపులో ఉంచుకునే క్రమంలో వ్యాయామాలకూ ప్రాధాన్యమిస్తుంటా. ఈ క్రమంలో కార్డియో, జాగింగ్‌, యోగా, ధ్యానం, బరువులెత్తడం.. వంటివి రొటీన్‌గా మార్చుకున్నా. అలాగే ఈత, గుర్రపు స్వారీ.. వంటివీ నా వర్కవుట్‌ రొటీన్‌లో ఓ భాగమే!’ అంది పరి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్