Adipurush: వెండితెర ‘సీతమ్మ’లు.. ఈ అందాల తారలు!
అందం-అణకువ, దయ-ధైర్యం, వివేకం-ఆత్మాభిమానం, ప్రేమ-త్యాగం.. ఇలా సకల సద్గుణాల కలబోతే సీతమ్మ తల్లి. భర్త బాధ్యతల్లో, కర్తవ్య దీక్షలో పాలుపంచుకున్న మహా సాధ్వి. సంతోషంగా వనవాసానికేగి.. కష్టాలనూ ఇష్టంగా స్వీకరించిన....
అందం-అణకువ, దయ-ధైర్యం, వివేకం-ఆత్మాభిమానం, ప్రేమ-త్యాగం.. ఇలా సకల సద్గుణాల కలబోతే సీతమ్మ తల్లి. భర్త బాధ్యతల్లో, కర్తవ్య దీక్షలో పాలుపంచుకున్న మహా సాధ్వి. సంతోషంగా వనవాసానికేగి.. కష్టాలనూ ఇష్టంగా స్వీకరించిన మహా పతివ్రత. రామాయణంలోని ఏ ఘట్టం తీసుకున్నా ఆమెలోని గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం! వెండితెరపై ఇలాంటి ఆదర్శమూర్తి సీతమ్మ పాత్రలో ఒదిగిపోయారు ఎంతోమంది నాయికలు. నాటి ‘సంపూర్ణ రామాయణం’ మొదలుకొని నేటి ‘ఆదిపురుష్’ దాకా.. సీతమ్మ తల్లి వ్యక్తిత్వాన్ని తమ నటనతో వెండితెరపై ఆవిష్కరించారు.
నిండుదనం తెచ్చారు!
మరి, ఇలాంటి అద్భుతమైన, ఆదర్శవంతమైన పాత్రకు ప్రాణం పోయాలంటే కేవలం సీతలా కనిపిస్తే చాలదు.. ఆ మహాతల్లి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు, పాత్రకు నిండుదనం తెచ్చేందుకు మానసికంగానూ సన్నద్ధం కావాలి. అలాంటి ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారీ అందాల తారలు. ఎన్టీఆర్ ‘సంపూర్ణ రామాయణం’లో సీతగా నటించిన అలనాటి నటీమణి పద్మిణి దగ్గర్నుంచి ఇప్పటి ‘ఆదిపురుష్’లో జానకి పాత్రలో మెరిసిన కృతీ సనన్ దాకా.. అడుగడుగునా ఆ పాత్రకు వన్నె తెచ్చారీ నటీమణులు. అంజలీదేవి (లవకుశ), గీతాంజలి (సీతారామ కల్యాణం), జయప్రద (సీతా కల్యాణం, సీతా స్వయంవరం), సరోజా దేవి (శ్రీరామాంజనేయ యుద్ధం), చంద్రకళ (సంపూర్ణ రామాయణం), సంగీత (శ్రీరామ పట్టాభిషేకం), నయనతార (శ్రీరామరాజ్యం), స్మితా మాధవ్ (బాల రామాయణం).. ఇలా ఎంతోమంది తమ నటనతో ఈ పాత్రలో ఒదిగిపోయారు.. వెండితెర సీతలుగా పేరు తెచ్చుకున్నారు.
బుల్లితెర పైనా..!
ఇలా వెండితెర పైనే కాదు.. బుల్లితెర పైనా సీత పాత్రలో నటించి.. అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశారు మరికొందరు తారలు. వీరిలో రామానంద్ సాగర్ ‘రామాయణ్’ సీరియల్‌లో నటించిన దీపికా చిఖాలియా తన అసలు పేరు కంటే సీతగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. ఇక 2008లో ప్రసారమైన ‘రామాయణ్’లో దెబీనా బొనర్జీ, 2015-16లో ప్రసారమైన ‘సియా కే రామ్ (జానకి రాముడు)’లో మదిరాక్షి ముండేల్.. వంటి ఈతరం నటీమణులూ సీత పాత్రల్లో నటించి మెప్పించారు. ‘ఆదిపురుష్’ విడుదల సందర్భంగా.. తొలి వెండితెర సీత పద్మిణి దగ్గర్నుంచి.. ఇప్పటి కృతి సనన్ వరకు.. వెండితెరపై ఈ పాత్రకు ప్రాణం పోసిన నటీమణులపై మీరూ ఓ లుక్కేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.