మీరు ఈ లేఖ చదివే నాటికి నేను ఈ భూమ్మీద ఉండను!

క్యాన్సర్‌.. జీవనశైలి మార్పుల వల్లే ఇది వస్తుందనుకుంటాం.. దీన్నుంచి బయటపడడం కష్టమంటూ అనుక్షణం చస్తూ బతికే వారూ చాలామందే! అలాంటి వారు డేనియెలా కథ చదివితే మనసు మార్చుకోవాల్సిందే! పాజిటివిటీ వైపు అడుగులేయాల్సిందే!

Published : 27 Feb 2024 14:21 IST

(Photos: LinkedIn)

క్యాన్సర్‌.. జీవనశైలి మార్పుల వల్లే ఇది వస్తుందనుకుంటాం.. దీన్నుంచి బయటపడడం కష్టమంటూ అనుక్షణం చస్తూ బతికే వారూ చాలామందే! అలాంటి వారు డేనియెలా కథ చదివితే మనసు మార్చుకోవాల్సిందే! పాజిటివిటీ వైపు అడుగులేయాల్సిందే! తనకు సోకింది నయం కాని క్యాన్సర్‌ అని తెలిసినా, కొన్నాళ్లకే తన ఆయుష్షు తీరిపోతుందని డాక్టర్లు చేతులెత్తేసినా దిగులు పడలేదామె. బతికున్న ఈ కొన్నాళ్లైనా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది.. ఆస్వాదించింది. ఇలా తన క్యాన్సర్‌ అనుభవాల్ని, జీవితంలోని ఆనంద క్షణాల్ని రంగరించి ఓ సుదీర్ఘ సందేశం రాసి కన్నుమూసిందామె. ఇటీవలే డేనియెలా మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు లింక్డిన్‌లో పోస్ట్‌ చేసిన ఈ సందేశం ఎంతోమందిని కదిలిస్తోంది.

డేనియెలాది ఇంగ్లండ్‌లోని లీడ్స్‌ నగరం. కళలపై మక్కువతో ‘న్యూ క్యాజిల్‌ యూనివర్సిటీ’లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. వివిధ కార్పొరేట్‌ సంస్థల హెచ్‌ఆర్‌ విభాగాల్లో పని చేసింది. ‘ఛార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్‌మెంట్ (CIPD)’ అనే ప్రతిష్టాత్మక సంస్థలో సభ్యత్వం కూడా సంపాదించిందామె. ఇలా హాయిగా సాగిపోతోన్న ఆమె జీవితాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. క్యాన్సర్‌ రూపంలో ఆమె జీవితాన్నే కబళించాలనుకుంది.

మరణ శయ్యపై ఉన్నా..!

ఏ రొమ్ము క్యాన్సరో, అండాశయ క్యాన్సరో అయితే.. చికిత్సతో ఎలాగోలా గట్టెక్కేదేమో డేనియెలా. కానీ తనకు సోకింది అత్యంత అరుదైన ‘Cholangio Carcinoma’. బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌/పైత్య వాహిక క్యాన్సర్‌గా పిలిచే ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం లేదు.. దీనికి తగిన చికిత్స కూడా లేదు. ఇలా క్యాన్సర్‌ బారిన పడిన ఆమె క్రమంగా మరణానికి చేరువైంది. అయినా అధైర్యపడక.. తన జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించింది. మరణశయ్యపై ఉన్న సమయంలోనూ తన అనుభవాలన్నీ గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాసిందామె. తన మరణానంతరం ఈ లేఖను అందరికీ చేరువ చేయాలంటూ తన కుటుంబ సభ్యుల్ని కోరింది. అనుకున్నట్లుగానే డేనియెలా మరణించాక.. ఆమె రాసిన ఈ లేఖను తాజాగా ఆమె కుటుంబ సభ్యులు లింక్డిన్‌లో పంచుకున్నారు. దీంతో ఆమె కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకీ లేఖలో ఏముందంటే..?!

క్యాన్సర్‌ బారిన పడి అనుక్షణం కుమిలిపోతున్న వారిలో స్ఫూర్తి నింపడానికే ఈ చిరు ప్రయత్నం అంటూ తన లేఖను మొదలుపెట్టింది డేనియెలా.

‘మీరు ఈ లేఖ చదివే నాటికి నేను ఈ భూమ్మీదే ఉండను.. క్యాన్సర్‌తో నా జీవితం ముగిసిపోతుంది. నా బదులు నా కుటుంబం నేను రాసిన ఈ సందేశాన్ని మీతో పంచుకుంటుంది.
సాధారణంగా క్యాన్సర్‌ అంటే.. మన జీవనశైలి మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లతోనే వస్తుందనుకుంటాం.. కానీ అన్ని క్యాన్సర్లకు ఇవి కారణం కావు. కొన్ని జన్యుపరంగా సోకచ్చు.. మరికొన్ని అనుకోకుండా మన జీవితాన్ని శాసించచ్చు. నా విషయంలోనూ ఇదే జరిగింది. నేను చిన్నతనం నుంచి ఎంతో ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండేదాన్ని. అలాంటిది నా పైత్య వాహికలో క్యాన్సర్‌ ఆనవాళ్లు కనిపించాయి. క్రమంగా నా జీవితం నా చేజారిపోయింది. ‘Cholangio Carcinoma’గా పిలిచే ఈ క్యాన్సర్‌ అత్యంత అరుదైనది. ఇది రావడానికి కచ్చితమైన కారణాలేవీ లేవు.. దీన్నుంచి బయటపడే మార్గాలు కూడా లేవు. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ క్యాన్సర్‌ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి, నలుగురిలో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచడానికి ఓ చిన్నపాటి అధ్యయనమే చేశా. ఈ క్రమంలో నాకు తెలిసిన విషయాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశా..’

ఇలా జీవితాన్ని ఆస్వాదించా!

‘క్యాన్సర్‌ సోకి అంపశయ్యపై ఉన్న నేను.. క్షణక్షణం చస్తూ బతికే కంటే.. నా జీవితంలో మిగిలిన ఈ కొన్ని రోజుల్ని పూర్తిగా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. ప్రతి క్షణం సంతోషంగా గడపాలనుకున్నా. నాకు నచ్చిన పనులే చేయాలనుకున్నా. ఇలా నేనేవైతే చేయాలనుకున్నానో అవన్నీ చేసేశా. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, నాకు కాబోయే భర్త, నా సొంతిల్లు.. ఇలా ప్రతి విషయాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నా పెట్‌ డాగ్‌ లియో తరిగిపోయే నా జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపేది. ఇలా నేను గడిపిన ఈ జీవితం నాకెంతో నచ్చింది. ఈ క్రమంలో నా జీవితాన్ని సుఖమయం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నా ఇష్టసఖుడు టామ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. తను కురిపించిన ప్రేమ, అనుక్షణం ప్రోత్సహించిన తీరు.. ‘ఆ భగవంతుడు నాకు ఇంకొన్నాళ్లు ఆయుష్షు ప్రసాదిస్తే బాగుండనిపించేది’! ఇక ఆఖరుగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి.. జీవితం ఎలా ఉన్నా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి. మీలోని ధైర్యాన్ని, మనోబలాన్ని, స్మార్ట్‌నెస్‌ని నమ్ముకోండి.. పాజిటివిటీ దానంతటదే దరిచేరుతుంది.. ఈ సందేశం మిమ్మల్ని చేరేసరికి నేను ఈ భూమ్మీదే ఉండకపోవచ్చు.. కానీ నా మాటలు, అనుభవాలు మాత్రం ఎప్పుడూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి..’ అంటూ తన లేఖను ముగించింది డేనియెలా.

క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. ఎంతోమందిని కంటతడి పెట్టిస్తోంది. చాలామంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కఠిన సమయంలోనూ అందరి గురించి ఆలోచించిన డేనియెలా మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఆమె స్ఫూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువే మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్