పిల్లలకు ఆటిజం ఉంటే..!

కొంతమంది ఏ సమస్య వచ్చినా వెంటనే గూగుల్‌లో శోధించి ఉన్నవీ లేనివి తమకు ఆపాదించుకుంటారు. అనవసరమైన భయాందోళనలకు గురవుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు.

Published : 01 Apr 2024 21:15 IST

కొంతమంది ఏ సమస్య వచ్చినా వెంటనే గూగుల్‌లో శోధించి ఉన్నవీ లేనివి తమకు ఆపాదించుకుంటారు. అనవసరమైన భయాందోళనలకు గురవుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో ఆటిజం సమస్య ఉన్న పిల్లల విషయంలో సైతం తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ‘ప్రపంచ ఆటిజం దినోత్సవం’ సందర్భంగా పిల్లలకు ఆటిజం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా...

పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, ఐ కాంటాక్ట్‌ సరిగా లేకపోవడం, వారి వంక చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం.. వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాల వల్ల మన దేశంలో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఇద్దరు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

వాటిని నమ్మడం ఆపేయండి...

ఇంటర్నెట్‌ వ్యాప్తి పెరిగిన తర్వాత ఏ సమస్య వచ్చినా గూగుల్‌ చేస్తున్నారు. అందులో చెప్పిన విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని రకాల సమస్యల విషయంలో ఇది సరైన మార్గం కాదంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్‌లో ఎంతో సమాచారం ఉంటుంది. ఇందులో సంబంధం లేని సమాచారం కూడా ఉంటుంది. దీనివల్ల మరికొన్ని అనుమానాలు పుట్టుకొస్తుంటాయి. ఇది పిల్లల ఆరోగ్యంపై పడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి, ఇంటర్నెట్‌లో ఉండే సమాచారాన్ని నమ్మకుండా మీకు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత నిపుణుల అభిప్రాయం తీసుకోవడం ఉత్తమం.

వారితో పోల్చకండి...

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలాగా ఉండమని తమ పిల్లలకు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. అయితే ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్న వారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అపురూప విజయాలు సాధించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి, ఇలాంటి వారిని ఉదాహరణగా తీసుకుని పిల్లల్లోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి దానికి తగ్గ తోడ్పాటు అందించాలి. అంతేకానీ ఇతరులతో పోల్చకూడదు.

సొంత చికిత్సలు వద్దు..!

ఈ రోజుల్లో ఏదైనా తెలియకపోతే యూట్యూబ్‌ చూసి నేర్చుకోవడం సాధారణంగా మారిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఆటిజం సమస్య గురించి యూట్యూబ్‌లో వెతికి ఇంట్లోనే వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆటిజం లక్షణాలు అందరిలో ఒకేరకంగా ఉండకపోవచ్చు. దీనికి స్పష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ, బిహేవియరల్ థెరపీ.. వంటివి ఇస్తుంటారు. కాబట్టి, సంబంధిత నిపుణులను సంప్రదించి వారు చెప్పే జాగ్రత్తలు పాటించడం మంచిది.

బలవంతం చేయద్దు...

ఆటిజం ఉన్నవారిలో కొంతమంది తమ కంటే తక్కువ వయసున్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకపోతే కంగారుపడుతుంటారు. కొంతమంది బలవంతం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ఏడేళ్ల అమ్మాయి ఇంకా నర్సరీ రైమ్స్‌ చూస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. ఇవి వారి కంటే చిన్న పిల్లలు చూడాల్సినవని.. వారి వయసులో చూడాల్సిన ప్రోగ్రామ్స్‌ను బలవంతంగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల వారు వాటిని చూడకపోగా మరింత కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వారికి నచ్చని విషయాల్లో బలవంతం చేయకపోవడమే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్