మూడు కోట్ల విలువైన కారుతో భర్తను సర్‌ప్రైజ్‌ చేసింది..!

భార్యాభర్తలిద్దరూ తాము వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలనుకోవడం సహజం. మరీ ముఖ్యంగా మహిళలు తాము గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డ పుట్టాక.. భర్త వెన్నంటే ఉండాలని కోరుకుంటారు. పిల్లల బాధ్యతల్ని తమతో సమానంగా పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకు కృతజ్ఞతగా తమ భర్తలకు ప్రత్యేక బహుమతులిచ్చి....

Updated : 06 Dec 2022 13:55 IST

(Photos: Instagram)

భార్యాభర్తలిద్దరూ తాము వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలనుకోవడం సహజం. మరీ ముఖ్యంగా మహిళలు తాము గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డ పుట్టాక.. భర్త వెన్నంటే ఉండాలని కోరుకుంటారు. పిల్లల బాధ్యతల్ని తమతో సమానంగా పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకు కృతజ్ఞతగా తమ భర్తలకు ప్రత్యేక బహుమతులిచ్చి సర్‌ప్రైజ్‌ చేసే వారూ లేకపోలేదు. మలేషియాకు చెందిన ఓ భార్య కూడా తన భర్తకు ఇదే విధంగా ఓ ఖరీదైన కానుక ఇచ్చి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. తద్వారా భర్తపై తనకున్న ప్రేమను చాటుకోవడమే కాదు.. కాబోయే తండ్రిగా తన బాధ్యతల్ని మరోసారి గుర్తు చేసింది. ఇలా తన ఇష్టసఖి విలువైన కానుకతో ఒకింత భావోద్వేగానికి లోనైన ఆ భర్త ఆమెను గుండెలకు హత్తుకొని ముద్దుల్లో ముంచెత్తాడు.. ప్రస్తుతం ఈ యువ దంపతుల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఎవరా లవ్లీ కపుల్‌? వీళ్ల బహుమతి కథేంటో తెలుసుకుందాం రండి..

వంద రోజులు భర్తదే డ్యూటీ!

అనిస్ ఆయునీ ఉస్మాన్‌, వెల్డన్ జుల్‌కెఫ్లీ.. మలేషియాకు చెందిన వీరిద్దరికీ గతేడాది వివాహమైంది. ప్రస్తుతం అనిస్ ‘VITA milk’ అనే సౌందర్య ఉత్పత్తుల సంస్థను నడుపుతోంది. ఇది మలేషియాలో చాలా పాపులర్‌ బ్రాండ్‌! ఇక ఈ జంటకు తాజాగా పండంటి బాబు పుట్టాడు. అయితే అనిస్ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. డెలివరీ అయ్యాక ఆమె వంద రోజుల పాటు పూర్తిగా విశ్రాంతికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాపాయి ఆలనా పాలనను రాత్రింబవళ్లు తండ్రే నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే బాబును చూసుకునే బాధ్యత తండ్రిగా వెల్డన్పై పడుతుందన్నమాట! ఇలా ప్రసవం తర్వాత మహిళలకు పూర్తి విశ్రాంతి లభిస్తే.. వారు ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారని అక్కడి వారి నమ్మకం. ఇలా అనిస్ విశ్రాంతి తీసుకునే సమయంలో బాబు అవసరాలు, డైపర్లు మార్చడం.. వంటివి తండ్రిగా వెల్డన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండడంతో పాటు నిద్ర లేని రాత్రులు కూడా గడపాల్సి రావచ్చు.

భార్య బహుమతి.. మూడు కోట్ల కారు!

అయితే ప్రసవం తర్వాత తన భర్త తన కోసం, తన పాపాయి కోసం ఇంత త్యాగం చేయబోతున్నాడని గ్రహించి.. అతనికి ముందుగానే కృతజ్ఞతాభావంతో ఓ విలువైన బహుమతిచ్చింది అనిస్. ఇటీవలే ప్రసవానికి చేరువగా ఉన్న సమయంలో.. ‘నీకో బహుమతి ఇవ్వాలనుకుంటున్నా..’ అని చెప్పిందామె. ఈ క్రమంలోనే ఓరోజు అతడి కళ్లకు గంతలు కట్టి కారు షోరూమ్‌కి తీసుకెళ్లింది. తాను బహుమతిగా ఇవ్వాలనుకున్న కారు ముందు అతడిని ఉంచి.. గంతలు విప్పింది. ఇంకేముంది.. తన ముందు ‘Lamborghini Huracan Evo’ అనే ఓ లగ్జరీ కారుంది. దాని విలువ రూ. 3 కోట్ల పైమాటే! అది చూసిన అతడికి నోట మాట రాలేదు. తన భార్య తనకిచ్చిన బహుమతిని చూడగానే ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమెను గుండెలకు హత్తుకొని ముద్దుల్లో ముంచెత్తాడు. దీంతో ఆమె కళ్ల వెంటా ఆనంద బాష్పాలు రాలాయి. ఇలా కృతజ్ఞతా భావంతో తన సతీమణి తనకు అందించిన బహుమతికి మురిసిపోయి తానూ ఆమెకు థ్యాంక్స్‌ చెప్పాడు. ఇదంతా చూసి అక్కడున్న వారు వీరి ప్రేమకు ముచ్చటపడిపోయారనుకోండి..!

ఆయన త్యాగం ముందు ఇదెంత?!

ఇక దీని గురించి అనిస్ స్పందిస్తూ.. ‘నాకు సి-సెక్షన్‌ డెలివరీ అయింది. బాబు పుట్టాడు. సిజేరియన్‌ నుంచి కోలుకోవడం అంత సులభం కాదు. ఈ సమయంలో భర్త ప్రతిక్షణం తనతోనే ఉండాలనుకుంటారు భార్యలు. నేను కూడా అదే కోరుకున్నా. మా సంప్రదాయం ప్రకారం వంద రోజుల పాటు పాపాయి బాధ్యతల్ని నా భర్తే చూసుకోవాల్సి ఉంటుంది. నన్నూ కంటికి రెప్పలా కాచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయన తన విలువైన సమయాన్ని, ఇతర పనుల్నీ త్యాగం చేయాల్సి రావచ్చు. మాకోసం ఇంత చేస్తోన్న తనకు ముందే ఓ మంచి బహుమతి ఇవ్వాలనుకున్నా. ఇచ్చాను.. తను చాలా సంతోషంగా ఫీలయ్యాడు.. ఓ భార్యగా నాకీ సంతృప్తి చాలు!’ అంటోందీ లవ్లీ వైఫ్‌. భార్యాభర్తల ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అవడంతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

సంప్రదాయమేమోగానీ.. వీళ్ల అనురాగాన్ని చూసి ప్రతి ఒక్కరూ ముచ్చటపడుతున్నారు. ఇంత అందమైన, గుణవంతురాలైన భార్య ఉన్న వెల్డన్‌ చాలా అదృష్టవంతుడని, ‘గాడ్‌ బ్లెస్‌ యూ బోత్‌’.. అంటూ ఈ యువ జంటను ఆశీర్వదిస్తున్నారు. మరి, ఈ ముచ్చటైన జంట వీడియోను మీరూ చూసేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్