Priyanka Chopra: అతడు చనిపోతే 20 రోజులు నల్లటి దుస్తులే ధరించా!

విదేశాల్లో స్థిరపడ్డా, హాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్నా.. భారతీయ మూలాలు మాత్రం మరవలేదు దేశీ బ్యూటీ ప్రియాంక చోప్రా. పండగల్ని, ప్రత్యేక సందర్భాల్ని ఇండియన్‌ స్టైల్‌లో జరుపుకొంటూ ఆ మధుర క్షణాల్ని భారతీయ అభిమానులతో....

Published : 24 May 2023 15:33 IST

(Photos: Instagram)

విదేశాల్లో స్థిరపడ్డా, హాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్నా.. భారతీయ మూలాలు మాత్రం మరవలేదు దేశీ బ్యూటీ ప్రియాంక చోప్రా. పండగల్ని, ప్రత్యేక సందర్భాల్ని ఇండియన్‌ స్టైల్‌లో జరుపుకొంటూ ఆ మధుర క్షణాల్ని భారతీయ అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటుందీ అందాల తార. ఇలా ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల పరంగానే కాదు.. ఆహార నియమాల్లోనూ భారతీయతను మరవలేదంటోందీ గ్లోబల్‌ బ్యూటీ. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘గ్రేజియా’ వివిధ దేశాలకు సంబంధించి రూపొందించిన కవర్ పేజీలపై తాజాగా దర్శనమిచ్చింది పీసీ. ఈ నేపథ్యంలో తన ఆహారపుటలవాట్లు, తొలిప్రేమ ముచ్చట్లు, కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు.. వంటి సంగతులెన్నో పంచుకుంది. అవేంటో తెలుసుకుందాం రండి..

అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను వివాహమాడాక న్యూయార్క్‌లో స్థిరపడింది ప్రియాంక. అయినా సంప్రదాయబద్ధంగా అన్ని పండగలూ సెలబ్రేట్‌ చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. ఇక కెరీర్‌లో ఉన్నత స్థాయిలో దూసుకుపోతోన్న ఈ ముద్దుగుమ్మ దర్శనమివ్వని అంతర్జాతీయ పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. అలా ఇటీవలే ‘గ్రేజియా’ వివిధ దేశాలకు సంబంధించి రూపొందించిన కవర్ పేజీలపై విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చింది పీసీ. ఈ క్రమంలో తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాల్ని పంచుకుందామె.

అతడంటే పిచ్చి!

ప్రతి ఒక్కరికీ తొలిప్రేమ అనుభవాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. తొలిసారి టీవీలో అమెరికన్‌ ర్యాపర్ తుపాక్‌ షాకుర్‌ని చూడగానే నా మతి పోయింది. అతని ట్యాలెంట్‌కి ఫిదా అయిపోయా. అది ప్రేమో, ఆకర్షణో కూడా అర్థం చేసుకోలేని ఆ వయసులోనే అతడిపై ఇష్టం పెంచుకున్నా. అవకాశమొస్తే.. మోకాలిపై కూర్చొని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడగాలనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ ఆ కోరిక తీరలేదు. 1996లో అకస్మాత్తుగా అతడు చనిపోయాడన్న విషయం తెలుసుకొని చాలా బాధపడ్డా. 20 రోజుల పాటు నలుపు రంగు దుస్తులే ధరించి.. వితంతువుగా ఫీలయ్యా. నిజానికి మనస్ఫూర్తిగా మనం ఇష్టపడ్డవారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం కదా!

పచ్చడి లేనిదే ముద్ద దిగదు!

విదేశాల్లో స్థిరపడ్డా భారతీయ ఆహారపుటలవాట్లను మాత్రం నేను మర్చిపోలేదు. ఇప్పటికీ ప్రతి పూటా పచ్చడి లేనిదే ముద్ద దిగదు. కాయగూరలు, మాంసం, దుంపలు, మామిడి, కొన్ని రకాల పండ్లతోనూ పచ్చళ్లు తయారుచేయిస్తుంటా. ఇది చాలా స్పైసీగా, రుచిగా ఉంటుంది. అందుకే పిజ్జా, శాండ్‌విచ్‌.. ఏది తిన్నా ఏదో ఒక పచ్చడిలో నంజుకొని తినడం నాకు అలవాటు. ఆఖరికి చైనీస్‌ వంటకాలతోనూ పచ్చడి రుచిని ఆస్వాదిస్తుంటా. ఎంతైనా ఇండో-చైనీస్‌ కాంబినేషన్‌ అదుర్స్‌! చాలామందికి నా ఈ ఆహారపుటలవాటు వింతగా అనిపించచ్చు.. కానీ ఇదే నాకిష్టం!

నిక్‌.. ప్రిన్స్‌ ఛార్మింగ్!

రాసిపెట్టుంటే ఎలాగైనా కలుస్తారంటారు. 2017లో నిక్‌ నాకు అలాగే కలిశాడు. నిజానికి మా ఇద్దరికీ పరిచయమై, స్నేహం ఏర్పడి అప్పటికి ఏడాది దాటింది. అయితే అనుకోకుండా 2017లో జరిగిన మెట్‌ గాలా వేడుకలో ఇద్దరం కలుసుకున్నాం. ఒకేసారి రెడ్‌కార్పెట్ పైకి వచ్చాం. అప్పుడు నేను నా డ్రస్‌ సరిచేసుకుంటూనే పక్కనే నిల్చున్న నిక్‌ని చూశా. రాజకుమారుడిలా కనిపించాడు. సరదాగా మాట్లాడుకుంటూనే కలిసి ఫొటోలకు పోజులిచ్చాం. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ రెడ్‌కార్పెట్ మొమెంట్‌ ఇదే! ఇక ఫొటోసెషన్‌ ముగిశాక.. ‘మూవీ ప్రిమియర్‌కు సంబంధించి నా దగ్గర కొన్ని టికెట్లున్నాయి. నీకిష్టమైతే మాతో రావచ్చు..’ అన్నాడు. నేను, నా ఫ్రెండ్‌ ఇద్దరం కలిసి వాళ్లు ముగ్గురు స్నేహితులతో ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’ సినిమాకు వెళ్లాం. అలా ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి గంటల కొద్దీ సమయం గడిపాం. మరుసటి రోజు కూడా కలిసి బయటికి వెళ్లాం. ఇలా తనతో కలిసి ఒంటరిగా సమయం గడపడం, బయటికి వెళ్లడం.. మర్చిపోలేని అనుభూతి. మా స్నేహం ప్రేమగా మారడానికి ఇదీ ఓ సందర్భమే!

సినిమాలు వదిలేద్దామనుకున్నా!

ప్రస్తుతం నా కెరీర్‌లో నేను సంతృప్తిగా, సంతోషంగా ఉన్నా. అయితే ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.. మరెన్నో తిరస్కరణలకు గురవ్వాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో వరుస సినిమాల్లో నన్ను హీరోయిన్‌గా తీసుకోవడానికి నిరాకరించేవారు. ఒక్కోసారి సెట్‌కు వెళ్లి మరీ వెనుదిరగాల్సి వచ్చేది.. చుట్టూ వాతావరణం నిరుత్సాహపూరితంగా ఉండేది. చాలామంది నాలో ఉన్న ప్రతిభను పరీక్షించకముందే నా నుంచి అవకాశాలు దూరం చేసేవారు. ఇలాంటి ప్రతికూలతల మధ్య ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నా. విసిగివేసారిపోయిన నాకు ఒక్కోసారి సినిమాలు వదిలేద్దామన్న ఆలోచనలు కూడా వచ్చేవి. అప్పుడు నా ఆత్మవిశ్వాసం, పట్టుదల, మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. నేను ఎలాంటి పాత్రల్లోనైతే నటించాలని కోరుకునేదాన్నో అలాంటి అవకాశాలే ఇప్పుడు నా వద్దకొస్తున్నాయి. ఒక నటిగా ఇంతకంటే ఇంకేం కావాలి. ఇప్పటికీ తల్లిదండ్రులుగా అటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఇటు కెరీర్‌లోనూ రాణిస్తున్నానంటే మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ఇందుకు కారణం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్