Rakul Wedding: గోవాలో ఏడడుగులు.. పెళ్లితో ఒక్కటైన రకుల్-జాకీ!

ప్రేమను పెళ్లితో శాశ్వతం చేసుకొనే రోజు కోసమే ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తుంటారు ప్రేమికులు. ఇన్నాళ్లూ ఆ శుభ ఘడియ కోసమే ఎదురుచూసిన బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీ భగ్నానీ తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు.

Published : 23 Feb 2024 13:21 IST

(Photos: Instagram)

ప్రేమను పెళ్లితో శాశ్వతం చేసుకొనే రోజు కోసమే ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తుంటారు ప్రేమికులు. ఇన్నాళ్లూ ఆ శుభ ఘడియ కోసమే ఎదురుచూసిన బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీ భగ్నానీ తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 21న గోవాలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఫొటోలే కాదు.. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ కొన్ని రోజుల నుంచి పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! లాక్‌డౌన్‌ సమయంలో చిగురించిన వీరి ప్రేమ క్రమంగా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. వీళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో పెళ్లికి రడీ అయిపోయిందీ జంట. అయితే ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగుతుందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నా మౌనం వహిస్తూ వచ్చారు రకుల్‌-జాకీ. మొత్తమ్మీద తాజాగా పెళ్లితో ఒక్కటైపోయిందీ జంట!

గోవాలో ఏడడుగులు!

బీచుల్ని బాగా ఇష్టపడే రకుల్‌కు గోవా అంటే చచ్చేంత ఇష్టం. అందుకే తన ఇష్టసఖుడు జాకీతో అక్కడే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుందామె. అనుకున్నట్టుగానే గోవాలోని రిసార్ట్స్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. పర్యావరణ ప్రేమికులైన వీరిద్దరూ తమ పెళ్లినీ పర్యావరణహితంగానే జరుపుకొన్నారు. ఇందులో భాగంగా.. పేపర్‌ వృథా లేకుండా డిజిటల్‌ ఆహ్వాన పత్రికలతో అతిథుల్ని ఆహ్వానించారు. అంతేకాదు.. వాతావరణానికి హాని కలగకుండా ఉండేందుకు పెళ్లిలో టపాసులు కాల్చకూడదన్న నియమం కూడా పెట్టిందట ఈ జంట. ఇలా తమ ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌తో మరోసారి అందరి మనసులు దోచుకున్నారీ లవ్‌బర్డ్స్.

‘ధోల్‌ నైట్‌’లో సందడే సందడి!

రకుల్‌-జాకీ ముందస్తు పెళ్లి వేడుకల్లో భాగంగా.. ‘ధోల్‌ నైట్‌’ పేరుతో తొలి వేడుకను నిర్వహించారు. ముంబయిలోని జాకీ నివాసంలో జరిగిన పార్టీలో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. గ్రీన్‌ కలర్‌ షిమ్మరీ షరారా ధరించి, డైమండ్ చోకర్‌ నెక్లెస్‌లో రకుల్ దర్శనమివ్వగా.. జాకీ బ్లాక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ను ఎంచుకున్నాడు. ఈ పెళ్లి వేడుక సందర్భంగా జాకీ ఇంటిని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ధోల్‌ నైట్‌ అనేది పంజాబీ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ముందస్తు పెళ్లి వేడుకల్లో ఓ ప్రత్యేకమైన ఘట్టం. ఇందులో ధోల్‌ అంటే డోలు.. దీన్ని వాయిస్తూ ఇరు కుటుంబ సభ్యులూ సంగీతానికి తగినట్లుగా స్టెప్పులేస్తూ సందడి చేస్తారు. మరోవైపు పంజాబీ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడమూ ఈ వేడుకల్లో చూడచ్చు. ఇలా వధూవరులు, వారి కుటుంబ సభ్యులు ఆడిపాడే ఈ వేడుక సంగీత్‌ను తలపిస్తుంది. ఆపై కాబోయే వధూవరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు విందారగించడంతో ఈ వేడుక ముగుస్తుంది. ఇలా ఈ పార్టీలో రకుల్‌-జాకీ జంట పాటలు, డ్యాన్సులతో తెగ సందడి చేసింది. ఇదేవిధంగా పెళ్లిలోనూ ఈ జంట తమదైన శైలిలో సందడి చేస్తూ అదరగొట్టేశారు. ఈ కొత్త జంటకు పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్వీట్ కపుల్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్