అప్పుడు మరింత అందం కోసం.. ఆ సర్జరీ చేయించుకోమన్నారు!

వెండితెరపై నాయికలు నాజూగ్గా, తీరైన శరీరాకృతిలో కనిపించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో పలు కాస్మెటిక్‌ సర్జరీలు కూడా చేయించుకుంటారు. అయితే తాను మాత్రం తనలా ఉండడానికే ఇష్టపడతానంటోంది బాలీవుడ్‌ నటి సమీరా రెడ్డి.

Published : 12 Jun 2024 13:22 IST

(Photos: Instagram)

వెండితెరపై నాయికలు నాజూగ్గా, తీరైన శరీరాకృతిలో కనిపించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో పలు కాస్మెటిక్‌ సర్జరీలు కూడా చేయించుకుంటారు. అయితే తాను మాత్రం తనలా ఉండడానికే ఇష్టపడతానంటోంది బాలీవుడ్‌ నటి సమీరా రెడ్డి. కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కొందరు తననూ ఈ తరహా సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని, కానీ తాను మాత్రం ఇందుకు ఒప్పుకోలేదంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది. ప్రస్తుతం నటనకు దూరమైనా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. నిత్యం బాడీ పాజిటివిటీని చాటేలా పోస్ట్‌లు పెడుతూ ఈతరం మహిళల్లో స్ఫూర్తి నింపుతుంటుంది సమీర. ఇక, ఇప్పుడు మరోసారి తన పోస్ట్ ద్వారా స్వీయ ప్రేమ ప్రాముఖ్యాన్ని చాటింది.

విభిన్న చిత్రాల్లో స్టార్‌ హీరోలతో కలిసి నటించి మెప్పించిన సమీర.. 2013 తర్వాత వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బాలీవుడ్‌ మామ్‌.. బాడీ పాజిటివిటీ, పేరెంటింగ్‌ వంటి అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. అంతేకాదు.. సందర్భమొచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత, కెరీర్‌లో చోటుచేసుకున్న పలు విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడానికీ వెనకాడదు. అలాంటి ఓ విషయాన్నే ఇటీవల ఓ సందర్భంలో గుర్తు చేసుకుందీ అందాల అమ్మ.

‘ఆ సర్జరీ నువ్వెందుకు చేయించుకోవు?’ అన్నారు!

‘వెండితెరపై నాయికల అందానికి ఎంత ప్రాధాన్యముంటుందో తెలిసిందే! అందుకే కొంతమంది ప్లాస్టిక్‌ సర్జరీ, బొటాక్స్‌.. వంటి సౌందర్య చికిత్సలతో తమ అందాన్ని మరింతగా పెంచుకోవాలనుకుంటారు. అది వారి ఇష్టం! వాళ్లను జడ్జ్‌ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నాకూ ఓ సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైంది. నా కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే సినీ రంగానికి చెందిన కొందరు నన్ను బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోమని నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సమీరా.. ప్రతి ఒక్కరూ ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నారు.. నువ్వెందుకు చేయించుకోవు?’ అని అడిగిన వారూ ఎంతోమంది! అయినా నేను తలొగ్గలేదు. చేయించుకోనని తెగేసి చెప్పా. నా శరీరంలో ఎలాంటి సమస్య లేనప్పుడు నేనెందుకు ఇలాంటి కృత్రిమ సర్జరీలు చేయించుకోవాలి? అనుకున్నా. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతా..’ అంటోంది సమీర.

వయసును సరి చేశా!

ఇలా మాటల రూపంలోనే కాదు.. సోషల్‌ మీడియా పోస్టులతోనూ అనునిత్యం బాడీ పాజిటివిటీని చాటుతుంటుందీ బాలీవుడ్‌ మామ్‌. తన వయసును చెప్పుకోవడానికీ ఎప్పుడూ మొహమాటపడని ఈ ముద్దుగుమ్మ.. ఓసారి అంతర్జాలంలో తప్పుగా ప్రచురించిన తన వయసును తానే సరిచేశానని చెబుతోంది.

‘28 ఏళ్ల వయసులో ఉలి చెక్కిన శిల్పంలా నాజూగ్గా ఉండేదాన్ని. ఇప్పుడు నా వయసు 45 ఏళ్లు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో పలు మార్పులొచ్చినా.. ఇప్పటికీ సంతోషంగా, సౌకర్యంగా ఉన్నా. అంతెందుకు.. నాకు 40 ఏళ్లున్నప్పుడు అంతర్జాలంలో నా వయసు 38గా ప్రచురితమైంది. దాన్నీ సరిచేశా. నా వయసును తక్కువ చేసి చూపించుకోవడమంటే నాకు అస్సలు నచ్చదు. సోషల్‌ మీడియాలో పెట్టే ఫొటోలు, వీడియోల్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా నేరుగా పోస్ట్‌ చేస్తుంటా. చర్మతత్వం, చర్మ ఛాయ, బరువు.. విషయాల్లో నేనెలా ఉన్నా నన్ను నన్నుగా చూపించుకోవడానికే ఇష్టపడతా! నిజానికి ఇవన్నీ నా ప్రత్యేకతలన్నది నా భావన. నెరిసిన జుట్టు, బెల్లీ ఫ్యాట్‌, స్ట్రెచ్‌ మార్క్స్‌.. ఇవన్నీ మనం దాచుకోకుండా బయటపెట్టినప్పుడే ఇతరులకూ ‘తాము ఒంటరి కాదు.. తమలాంటి వారు మరొకరున్నారు’ అన్న భావన కలుగుతుంది. నలుగురిలో స్ఫూర్తి నింపడానికి ఇంతకంటే ఇంకేం కావాలి?!’ అంటోందీ అందాల తార.

బాడీ పాజిటివిటీ విషయంలో ఇలా తనకెదురైన సవాళ్లు, అనుభవాల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూనే.. మరోవైపు ‘లిమిట్‌లెస్‌’ పేరుతో ఓ పాడ్‌కాస్ట్‌ షోనూ నిర్వహిస్తోంది సమీర. ఇందులో భాగంగానే అందం, వయసు, లైఫ్‌స్టైల్‌.. తదితర అంశాల్లో సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటోన్న సవాళ్లపై పలువురు నిపుణులతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇలా మహిళల్లో పాజిటివిటీని నింపడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతోందీ మామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్