Sameera Reddy: లైంగిక విద్య.. తప్పు కాదు!

ఎదుటివారి నిర్ణయాలతో పనిలేకుండా తన మనసు చెప్పిందే వింటుంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించే ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియా వేదికగా నలుగురిలో స్ఫూర్తి నింపే పోస్టులు పెడుతుంటుంది. అంతేకాదు.. సమాజంలో అపోహలుగా, కళంకాలుగా భావించే....

Updated : 08 Feb 2023 17:04 IST

(Photos: Instagram)

ఎదుటివారి నిర్ణయాలతో పనిలేకుండా తన మనసు చెప్పిందే వింటుంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించే ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియా వేదికగా నలుగురిలో స్ఫూర్తి నింపే పోస్టులు పెడుతుంటుంది. అంతేకాదు.. సమాజంలో అపోహలుగా, కళంకాలుగా భావించే పలు విషయాల పైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని పంచుకోవడం ఈ చక్కనమ్మకు అలవాటే! ఈ క్రమంలోనే చాలామంది మాట్లాడడానికి సంకోచించే లైంగిక విద్య పైనా ఇటీవలే ఓ సందర్భంలో పెదవి విప్పింది సమీర. బయటి నుంచి తప్పుడు సమాచారం తెలుసుకొని పిల్లలు పెడదోవ పట్టకముందే తల్లిదండ్రులు చొరవ తీసుకొని దీని గురించి వారికి సున్నితంగా వివరించాలంటోందీ అందాల అమ్మ. ఇదనే కాదు.. వృత్తిగత జీవితంలో తనకెదురైన సవాళ్లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాల్ని సైతం ఆయా సందర్భాల్లో పంచుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటుందీ బాలీవుడ్‌ అందం. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!

అమ్మయ్యాకే ఆ మార్పు!

అమ్మయ్యాక వ్యక్తిగతంగా, శారీరకంగా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని అంగీకరిస్తేనే అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. వ్యక్తిగతంగా ఈ విషయం నేను కాస్త ఆలస్యంగా గ్రహించా. మొదటిసారి కాన్పు తర్వాత పెరిగిన బరువుతో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యేదాన్ని. కానీ ఈ సమయంలో ఇలాంటి మార్పులు సహజమేనని గ్రహించడానికి కొంత సమయం పట్టింది. ఈ క్రమంలో సమాజం నుంచి పలు విమర్శల్నీ ఎదుర్కొన్నా. అయితే వీటిని పట్టించుకోవడం కంటే తల్లిగా పిల్లల పెంపకంపై దృష్టి సారించడం మంచిదనిపించింది. తల్లయ్యాక నా ప్రాధాన్యాలు మారిపోయాయి. ప్రతి విషయంలో అత్యుత్తమమైన వ్యక్తిగా నన్ను నేను నిరూపించుకోవడంతో పాటు నా పిల్లలకూ ఉదాహరణగా నిలవాలని కోరుకుంటున్నా. అలాగే నా గురించీ నేను శ్రద్ధ తీసుకుంటున్నా. ఇలా వ్యక్తిగతంగా, కుటుంబం, పిల్లల బాధ్యత.. వంటి విషయాల్లో అమ్మతనం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.

లైంగిక విద్య.. తప్పు కాదు!

పిల్లల పెంపకం అంటే వారు అడిగింది కొనివ్వడం, వారికి ఉన్నత విద్యను అందించడమే కాదు.. కొన్ని ఉత్తమ విలువల్నీ వారికి బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! అయితే కొన్ని విషయాల్ని వారికి వివరించే క్రమంలో ఈ సమాజం అడ్డుపడుతుంటుంది.. దాన్ని చేయకూడని పనిగా భావిస్తుంటుంది. లైంగిక విద్య కూడా అందులో ఒకటి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలోనూ దీని గురించి బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తున్నారు.. సిగ్గుపడుతున్నారు. ఇలాంటి ప్రతిబంధకాల మధ్య కూడా కొంతమంది మహిళలు లైంగిక విద్య గురించి అందరిలో అవగాహన పెంచడానికి ముందుకు రావడం హర్షణీయం. అయితే ‘ఇంత చిన్న వయసులో పిల్లలకు దీని గురించి తెలియాల్సిన అవసరం లేదు..’ అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. నేను దీంతో ఏకీభవించను.

ఎందుకంటే.. అత్యంత రహస్యంగా ఉంచే ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తద్వారా బయటి నుంచి తప్పుడు సమాచారం తెలుసుకొని వారు పెడదోవ పట్టడం కంటే.. మనమే వారికి ఈ సున్నితమైన విషయం గురించి వివరించాలి. ఈ క్రమంలో తప్పొప్పుల్ని విడమరిచి చెబుతూ దానిపై సంపూర్ణ అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. వారే ఏది తప్పు, ఏది ఒప్పు అనేది అర్థం చేసుకోగలుగుతారు. అంతెందుకు.. నా చిన్నప్పుడు మా తల్లిదండ్రులూ ఈ విషయం గురించి నాతో మాట్లాడడానికి మొహమాటపడేవారు. కానీ ఈ విషయంలో మా అక్క నాకు ఎన్నో అంశాల గురించి వివరించింది.. నా సందేహాల్ని తీర్చింది.

అదే మా దాంపత్య రహస్యం!

భార్యాభర్తల్లో ఒకరు కామ్‌గా, మరొకరు దూకుడుగా ఉన్నప్పుడు వాళ్ల మధ్య అనుబంధం ఇనుమడిస్తుందంటారు. ఇందుకు నేను-నా భర్త అక్షయ్‌ ప్రత్యక్ష ఉదాహరణ! ఎందుకంటే అక్షయ్‌ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడు.. నేను క్రేజీగా ఉంటాను. ఎప్పుడూ ఏదో ఒక జోక్‌ చేస్తూ నవ్వించడం నాకు అలవాటు. మొదట్లో మా మధ్య గొడవైతే నేనే ముందు సారీ చెప్పేదాన్ని. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ విషయంలో అక్షయ్‌ దూకుడు పెంచేశాడు. నాకంటే ముందే సారీ చెప్పేస్తున్నాడు. రోజులు గడిచే కొద్దీ మన ప్రాధాన్యాలు, ప్రాథమ్యాలు మారినట్లే.. వైవాహిక బంధంలోనూ క్రమంగా మార్పులొస్తాయి.. ఈ క్రమంలో మరింత పరిణతితో ఆలోచించాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడు మేం భార్యాభర్తలమే కాదు.. తల్లిదండ్రులం కూడా! ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే.. పిల్లల అవసరాల్ని అంత బాగా తెలుసుకోగలుగుతాం. పదేళ్ల మా వైవాహిక బంధం రహస్యమదే! ఇప్పటికీ మా మధ్య ఏవైనా భిన్నాభిప్రాయాలొచ్చినా, మనసు బాగోలేకపోయినా.. కాసేపు వారిని ఏకాంతంగా వదిలేస్తాం.. దానివల్ల సమస్య పెద్దది కాకుండా జాగ్రత్తపడచ్చనేది మా ఆలోచన!

షీ ఈజ్‌ సో స్వీట్!

సాధారణంగా అత్తాకోడళ్లకు ఒకరంటే మరొకరికి పడదంటుంటారు. ఈ క్రమంలోనే చాలామంది.. ‘మీరు, మీ అత్తగారు ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతారు?’ అని అడుగుతుంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. అందరిలాగే మా ఇద్దరి మధ్యా అప్పుడప్పుడూ పొరపచ్ఛాలు దొర్లుతుంటాయి.. అయితే వాటిని పెద్దవి చేసుకోవడం కంటే దూరం చేసుకోవడానికే మేం ప్రాధాన్యమిస్తాం. మా మధ్య తలెత్తిన సమస్య, భేదాభిప్రాయాల గురించి కలిసి చర్చించుకుంటాం.. తప్పొప్పుల్ని గ్రహిస్తాం.. తిరిగి కలిసిపోతాం.. ప్రేమను పంచుకుంటాం. ఇవే మమ్మల్ని అత్తాకోడళ్లలా కాకుండా తల్లీకూతుళ్లలా కలిపి ఉంచుతున్నాయి. షీ ఈజ్‌ సో స్వీట్‌.. తనకు కోడలినైనందుకు గర్వపడుతున్నా.

అందులో కల్పించుకోవడమెందుకు?!

చాలామంది ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం, కల్పించుకోవడం, నిర్మొహమాటంగా వారి నిర్ణయాలు చెప్పడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల అవతలి వాళ్ల స్పందన ఎలా ఉంటుంది? వాళ్లు బాధపడతారేమోనన్న కనీస ఆలోచన కూడా చేయరు. హీరోయిన్‌గా ఒక సమయంలో అవతలి వాళ్లు తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకు నేనూ బాధపడ్డా. కెమెరా ముందు అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోమని నాకు సలహా ఇచ్చిన వారూ ఉన్నారు. అయితే నాకు అది నచ్చలేదు.. ఆ సమయంలో నా మనసు చెప్పింది విన్నా కాబట్టే సంతోషంగా, పాజిటివ్‌గా ముందుకెళ్లగలిగా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకు నచ్చింది చేసినప్పుడే మన ఉనికిని చాటుకోగలుగుతాం. ఎవరి జీవితం వాళ్లది.. వాళ్లకు సరైందేదో, కానిదేదో వాళ్లకు తెలుసు.. అలాంటప్పుడు వాళ్లను జడ్జ్‌ చేయడానికి మనమెవరం?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్