అలాంటప్పుడు.. ఉద్యోగం మారాల్సిందేనా?

ఆఫీస్‌ అంటే మన నైపుణ్యాలను పెంచుకుంటూ, కొలీగ్స్‌ని కలుపుకొనిపోతూ.. అంతిమంగా మన పనితనం కంపెనీకి ఉపయోగపడేలా ఉండాలి. అయితే అలాంటి వాతావరణం ఒక్కోసారి విషపూరితమవుతుంది. దాని ప్రభావం మన పైనే కాదు.. కొన్నిసార్లు మన కెరీర్‌నీ దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Published : 29 May 2024 21:29 IST

ఆఫీస్‌ అంటే మన నైపుణ్యాలను పెంచుకుంటూ, కొలీగ్స్‌ని కలుపుకొనిపోతూ.. అంతిమంగా మన పనితనం కంపెనీకి ఉపయోగపడేలా ఉండాలి. అయితే అలాంటి వాతావరణం ఒక్కోసారి విషపూరితమవుతుంది. దాని ప్రభావం మన పైనే కాదు.. కొన్నిసార్లు మన కెరీర్‌నీ దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే నచ్చని చోట, ఉన్నతి లేని చోట పనిచేయడం కంటే.. ప్రత్యామ్నాయం వెతుక్కొని కెరీర్‌లో అభివృద్ధిని సాధించడం ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా మంచిదంటున్నారు. మరి, ఇంతకీ పని వాతావరణాన్ని నెగెటివ్‌గా ప్రభావితం చేసే కొన్ని అంశాలేంటో తెలుసుకుందాం రండి..

మిమ్మల్ని దూరం పెడుతున్నారా?

ఒక బృందం ఒక ప్రాజెక్ట్‌ మీద పని చేస్తోందంటే దానికి సంబంధించిన ప్రతి విషయం, ప్రతి అప్‌డేట్‌ ఆ గ్రూప్‌లో ఉన్న అందరికీ తెలిస్తేనే కలిసికట్టుగా ముందుకెళ్లగలం.. అనుకున్న సమయానికి చక్కటి అవుట్‌పుట్‌ని కంపెనీకి సమర్పించచ్చు. అయితే బాగా పనిచేసే వాళ్లపై ఇతర కొలీగ్స్‌కి ఉండే అసూయ, సహోద్యోగుల మధ్య కమ్యూనికేషన్‌ లోపం, గ్రూపిజం.. వంటి అంశాలు పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి చోట మీరు పని చేస్తున్నా, చక్కటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా మిమ్మల్ని వేరు చేసి చూడడం, పనికి సంబంధించి మీకు ఎలాంటి అప్‌డేట్‌ చెప్పకపోవడం.. వంటి అంశాలు మీ వ్యక్తిగత పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇది క్రమంగా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే అంతిమంగా మీ కెరీర్‌ ఉన్నతికి గండి పడ్డట్లే! కాబట్టి ఇలాంటి వాతావరణంలో పని చేస్తున్నప్పుడు మీ వెనక జరిగే గ్రూపిజం, ఆఫీస్‌ రాజకీయాల గురించి, మీ పనితీరు గురించి ముందుగా పైఅధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అయినా లాభం లేదనుకుంటే అందులోనే వేరే విభాగానికి మారడం లేదంటే వేరే ఉద్యోగం వెతుక్కోవడం వల్ల కెరీర్‌లో ముందుకెళ్లచ్చు.

ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే!

‘నచ్చిన ఉద్యోగం వచ్చింది. ఇక నా పనితనమేంటో చూపిస్తా..’ అంటూ ఎంతో ఉత్సాహంగా తాము కోరుకున్న జాబ్‌లో జాయినవుతుంటారు చాలామంది. అయితే అక్కడికెళ్లి కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేస్తే గానీ తెలియదు ఆ కంపెనీ పని వాతావరణం గురించి! ఈ క్రమంలో ఎంత పని చేసినా సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, కొన్ని కంపెనీల్లోనైతే పనిచేసే వారికంటే చేయని వారికే అధిక ప్రాధాన్యమిస్తూ వారికే పైఅధికారుల నుంచి ప్రోత్సాహం లభించడం.. వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే ఇలాంటి వాతావరణం ప్రత్యక్షంగా మనం చేసే పని పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంటుంది. ‘ఛ.. ఛ.. ఎంత పని చేసినా బూడిదలో పోసిన పన్నీరే!’ అన్న భావన కలిగేలా చేస్తుంది. నిజానికి ఆ ఫీలింగ్‌ వచ్చిందంటే అలాంటి చోట పని చేయలేమని అర్థం. అందుకే అక్కడే రోజులు గడిపేయడం కాకుండా సత్వరమే వేరే ఉద్యోగంలోకి మారిపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆ సమయాన్ని వేరే కంపెనీలో కెరీర్‌లో ఉన్నతి సాధించడానికి వినియోగించుకోవచ్చు.

పని భారమంతా మీదేనా?

చేసే ఉద్యోగమేదైనా సరే.. మనకు అప్పగించిన పనికే పరిమితం కాకుండా.. ఫలానా పనిని నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసంతో, యాక్టివ్‌గా ఆ పనిని స్వీకరించాలి. ఈ క్రమంలో మీలోని సృజనాత్మకతను చాటుకుంటే మరీ మంచిది. అయితే ఈ చురుకుదనం ఒక్కోసారి మన తలపై భారంగా మారే అవకాశాలూ లేకపోలేదు. ఎలాగూ ఈ అమ్మాయి యాక్టివ్‌గా పని చేస్తుంది కదా అని కొంతమంది అధికారులు సహోద్యోగుల పనిని కూడా వారి నెత్తినేస్తుంటారు. దీనివల్ల మోయలేని భారం మీపై పడడంతో పాటు అంతిమంగా ఇది మీపై ఒత్తిడిని తీసుకొస్తుంది. తద్వారా మీరు చేసే పనిలో నాణ్యత లోపిస్తుంది. అందుకే ఇలా పని విషయంలో మీ తలకు మించిన భారం అనిపిస్తే ‘నో’ చెప్పడానికి వెనకాడకూడదని చెబుతున్నారు నిపుణులు. అయితే కొలీగ్‌ రానప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పనో, ఏవైనా అరుదైన సందర్భాల్లో అదనపు పనిని తీసుకోవడంలో తప్పులేదు. అంతేకానీ.. అదే నిత్యకృత్యం అయితే నిర్మొహమాటంగా నేను చేయనని చెప్పడం.. ఎంత చెప్పినా వినకుండా మీపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ఇవే కాదు.. సహోద్యోగులపై చేసే చెడు ప్రచారాలు, పనిచేసే చోట లైంగిక వేధింపులు, సెలవు తీసుకున్నా పనిచేయాల్సి రావడం, పైఅధికారుల ప్రోత్సాహం కరువవడం.. వంటివి కూడా అటు పని వాతావరణాన్ని, ఇటు ఉద్యోగుల కెరీర్ ఉన్నతిని దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి విషపూరిత వాతావరణానికి టాటా చెప్పి.. కొంచెం లేటైనా సరే సౌకర్యవంతంగా, అభివృద్ధి ఉన్న చోటికి రెక్కలు కట్టుకొని వాలిపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్