వీటితో గార్డెనింగ్ సులభంగా..

ఇంటిని అందంగా అలంకరించడంలో మహిళలది అందె వేసిన చేయి. ఈ క్రమంలోనే గార్డెనింగ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ రోజుల్లో స్థలాభావం వల్ల వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచడానికి సరైన అవకాశం లభించడం లేదు.

Published : 27 Nov 2023 21:19 IST

ఇంటిని అందంగా అలంకరించడంలో మహిళలది అందె వేసిన చేయి. ఈ క్రమంలోనే గార్డెనింగ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ రోజుల్లో స్థలాభావం వల్ల వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచడానికి సరైన అవకాశం లభించడం లేదు. ఈ క్రమంలో చాలామంది ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రతి అంశంలో టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో గార్డెనింగ్‌ని సులభతరం చేసేలా కొన్ని టూల్స్‌/గ్యాడ్జెట్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

నీటి మోతాదు తెలుసుకునేందుకు..

మొక్కలను పెంచాలంటే క్రమం తప్పకుండా సరిపడినన్ని నీళ్లు పోయాలి. కానీ, చాలామంది కొన్ని సార్లు అధికంగా, మరికొన్ని సార్లు తక్కువగా నీళ్లు పోస్తుంటారు. ఈ రెండూ మొక్కలకు నష్టం చేకూర్చేవే. ఇలా జరగకుండా స్మార్ట్‌ ఉత్పత్తులు చక్కగా ఉపయోగపడతాయి. వాటర్‌ సెన్సార్‌(Water Censor) టూల్‌ అలాంటిదే! ఈ పరికరాన్ని ఉపయోగించి మొక్కకు సంబంధించిన తేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సెన్సార్‌పై ఉన్న మీటర్‌ ద్వారా మట్టి తేమ శాతం తెలుసుకొని అవసరమైతే తగినన్ని నీళ్లు పోసుకోవచ్చు.. మరికొన్ని రకాల సెన్సార్స్‌లో మొక్క ఎదుగుదలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇంట్లోనే వాతావరణ కేంద్రం..

వ్యవసాయ క్షేత్రంలో పంటలు బాగా పండాలంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మొక్కల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇండోర్‌ ప్లాంట్స్‌కు కూడా సరైన వాతావరణం ఉందో? లేదో? తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి ‘ఇండోర్‌ వెదర్‌ స్టేషన్‌’ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఉష్ణోగ్రత, తేమ, గదిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలను ట్రాక్‌ చేస్తుంది. దాని ద్వారా మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేలా అవసరమైన మార్పులు చేసుకునే వీలు కలుగుతుంది.

వాటరింగ్ స్పైక్స్‌..

కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ఊళ్లకు, వెకేషన్లకు వెళ్తుంటాం.. ఇలాంటప్పుడు ఇండోర్‌ ప్లాంట్స్ నీళ్లు లేక ఎండిపోతుంటాయి. అయితే వాటరింగ్‌ స్పైక్స్‌(Watering Spikes) ఇందుకు చక్కటి పరిష్కార మార్గం అంటున్నారు నిపుణులు. ఈ స్పైక్‌ను వాటర్‌ బాటిల్‌కు అనుసంధానించాలి. ఈ పరికరాన్ని కుండీలో పెట్టాలి. వాటర్‌ బాటిల్‌లోని నీళ్లు కొద్ది కొద్దిగా మట్టిలో పడుతుంటాయి. తద్వారా మట్టి ఎప్పుడూ తేమగా ఉండి.. మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఫలితంగా అది ఎండిపోయే ఆస్కారం ఉండదు. వాటరింగ్‌ స్పైక్స్‌ తరహాలోనే ప్రస్తుతం వివిధ రకాల వాటరింగ్‌ గ్లోబ్స్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్‌ కుండీ..

పైన చెప్పుకున్న సమస్యలన్నింటికీ ఒకే పరిష్కార మార్గం ఉంటే భలే ఉంటుంది కదూ.. అదే స్మార్ట్‌ కుండీ. స్మార్ట్‌ కుండీని ఫోన్‌లోని యాప్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ కుండీల్లో ఆటోమేటిక్‌గా మొక్కలకు నీళ్లు అందించే వ్యవస్థ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సార్లు తేమ, వెలుతురు, ఉష్ణోగ్రత.. వంటి వివరాలను యాప్‌ ద్వారా అందిస్తాయి. తద్వారా ఇండోర్‌ మొక్కలను సులభంగా సంరక్షించుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే అన్ని సౌలభ్యాలు ఉండడం వల్ల వీటి ధర కాస్త అధికంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్