Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!

గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు బరువు పెరగడం సహజమే! డెలివరీ తర్వాతా కొంత కాలం పాటు ఇది కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు భయపడిపోవడం, తిరిగి త్వరగా పూర్వపు స్థితికి రావాలని ఆరాటపడడం చూస్తుంటాం.

Published : 29 Apr 2024 11:43 IST

(Photos: Instagram)

గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు బరువు పెరగడం సహజమే! డెలివరీ తర్వాతా కొంత కాలం పాటు ఇది కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు భయపడిపోవడం, తిరిగి త్వరగా పూర్వపు స్థితికి రావాలని ఆరాటపడడం చూస్తుంటాం. ఒకానొక దశలో తానూ ప్రసవానంతర బరువు విషయంలో భయపడ్డానంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అయితే త్వరలోనే ఈ విషయంలో రియలైజై.. తనను తాను అంగీకరించానంటోన్న ఈ ముద్దుగుమ్మ ప్రసవానంతరం తనకెదురైన పలు అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది.

నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చినా.. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సోనమ్. 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ.. 2022లో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చింది. తల్లయ్యాక కెరీర్‌ కంటే అమ్మతనానికే ప్రాధాన్యమిచ్చిన ఈ కపూర్‌ బ్యూటీ.. గతేడాది విడుదలైన ‘బ్లైండ్‌’ చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

ఆ మార్పుల్ని స్వీకరించాను!

అయితే అటు అమ్మగా, ఇటు కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకూ ప్రాధాన్యమిస్తుంటుంది సోనమ్‌. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాల్నీ పంచుకుంటుంటుంది. ఇందులో భాగంగానే తన ప్రసవానంతర బరువు గురించి ఇప్పటికే పలుమార్లు బయటపెట్టిన ఈ సొగసరి.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌ షోలో భాగంగా మరోసారి తన అనుభవాల్ని పంచుకుంది.

‘గర్భిణిగా ఉన్నప్పుడు 32 కిలోలు పెరిగా. దీంతో ముందు కాస్త భయపడ్డా. కానీ ఆ తర్వాత రియలైజ్‌ అయ్యా. తల్లయ్యాక పూర్తి సమయం బిడ్డకే కేటాయించాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, వ్యాయామాలు చేయాలన్న ఆలోచనలేవీ మనసులోకి రావు. ప్రసవానంతరం బరువు తగ్గడమనేది త్వరితగతిన పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఇందుకు కాస్త సమయం పడుతుంది. నాకైతే సుమారు ఏడాదిన్నర సమయం పట్టింది. అలాగే గర్భం ధరించినప్పట్నుంచి బిడ్డకు జన్మనిచ్చేదాకా.. మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవే కాదు.. మనతో మనం, భర్తతో గడిపే సమయం కూడా ఉండదు. శారీరక మార్పుల్నీ అంగీకరించే స్థితిలో ఉండరు చాలామంది. కానీ ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించినప్పుడే సానుకూల దృక్పథంతో ముందుకు సాగగలుగుతాం. నేనెలా ఉన్నా, ఎలా కనిపించినా ఫీలవ్వలేదు. అందుకే అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించగలిగా.. మరోవైపు స్వీయ ప్రేమనూ పెంచుకోగలిగా..’ అందీ అందాల అమ్మ.

అందుకు 16 నెలలు పట్టింది!

గతంలోనూ ప్రసవానంతర బరువు గురించి పలుమార్లు స్పందించిన సోనమ్‌.. వేగంగా బరువు తగ్గాలని తన శరీరాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది.
‘అమ్మనయ్యాక తిరిగి పూర్వపు స్థితికి రావడానికి నాకు 16 నెలల సమయం పట్టింది. చాలామంది ప్రసవానంతర బరువు విషయంలో కంగారు పడిపోతుంటారు. త్వరగా తగ్గాలి.. పూర్వపు స్థితికి చేరుకోవాలని కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంటారు. వ్యాయామాలతో శరీరాన్ని కష్టపెడుతుంటారు. కానీ నేనలా చేయలేదు. క్రాష్‌ డైట్లు, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉన్నా. నా ఆరోగ్యం, అమ్మతనం పైనే పూర్తి దృష్టి పెట్టా. వీలైనన్ని రోజులు నా కొడుక్కి పాలిచ్చా. పోషకాహారం, విశ్రాంతి, శక్తిని కూడగట్టుకోవడం.. ఈ మూడింటిపై దృష్టి పెడుతూనే నెమ్మదిగా లక్ష్యాన్ని చేరుకున్నా..’ అంటూ నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్