ఆచారాలు కావివి.. మహిళలపై అరాచకాలు!

మహిళలపై ఇప్పటికీ ఎన్నో రకాల అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఇలాంటివన్నీ చట్ట సమ్మతంగానే కొనసాగడం విచారకరం....

Updated : 04 Oct 2023 16:53 IST

మహిళలపై ఇప్పటికీ ఎన్నో రకాల అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఇలాంటివన్నీ చట్ట సమ్మతంగానే కొనసాగడం విచారకరం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అమల్లో ఉన్న బహు భార్యత్వం, కన్యత్వ పరీక్షలు.. మొదలైనవన్నీ మహిళల స్వేచ్ఛను హరించడమే కాదు.. వారి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు నిపుణులు.

బహుభార్యత్వం.. పాతివ్రత్యం!

పెళ్లంటే భార్యాభర్తల మధ్య ఉండే శాశ్వతమైన అనుబంధం. ఈ బంధంలో ఎవరి జీవితంలోకి మరో వ్యక్తి వచ్చినా.. భాగస్వామి తట్టుకోలేరు. కానీ వివాహేతర సంబంధాలు కొనసాగించడం, పిల్లలు పుట్టలేదని మరో మహిళను వివాహమాడడం.. ఇలాంటివెన్నో మన చుట్టూ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కొన్ని దేశాల్లో మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. కొన్ని దేశాల్లోనైతే బహు భార్యత్వం చట్ట సమ్మతంగా కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా అల్జీరియా, యూఏఈ, కామెరూన్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌.. వంటి దేశాల్లో పురుషులు గరిష్టంగా నలుగురు మహిళల్ని వివాహం చేసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు మహిళలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భర్తనే దైవంగా భావించాలని, పతివ్రతా ధర్మాన్ని పాటించాలన్న కట్టుబాటూ కొనసాగుతోంది. అయితే ఈ ‘పాలిగమీ’ పద్ధతిలో పురుషులు మిగిలిన భార్యల అనుమతి తీసుకోవాలని, భార్యలందరినీ సమానంగా చూడాలన్న నియమాలు పెట్టినప్పటికీ.. మహిళలు మానసికంగా కుంగిపోతున్నట్లు, ఆత్మవిశ్వాసం-ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. అంతేకాదు.. వివాహంలో సంతృప్తి కరువై, భర్త ప్రేమకూ దూరమవుతున్నట్లు, ఈ ప్రభావం తమ పిల్లల భవిష్యత్తు పైనా పడుతున్నట్లు అక్కడి మహిళలు వాపోతున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఈ బహు భార్యత్వం క్రమంగా తగ్గుతుండడం అక్కడి మహిళలకు ఊరట కలిగించే విషయమని చెప్పచ్చు.

కన్యత్వ పరీక్ష.. ఓ వేడుకలా!

కన్యత్వ పరీక్ష.. మహిళ పెళ్లికి ముందే ఇతరులతో శారీరక సంబంధం కలిగి ఉందో, లేదో తెలుసుకోవడానికి పెట్టే పరీక్ష ఇది. మన దేశంలోని కొన్ని తెగల్లో, ఇతర దేశాల్లోనూ దీన్నో వేడుకలా జరుపుకొంటున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో పెళ్లికి ముందే అమ్మాయికి వైద్యుల దగ్గర పరీక్ష చేయించడం, కన్య అని సర్టిఫికెట్‌ ఇస్తేనే పెళ్లి చేసుకోవడం కొన్ని చోట్ల ఆనవాయితీగా కొనసాగుతోంది.. మరికొన్ని చోట్ల తొలి రాత్రి వధువుకు ఈ పరీక్ష పెడుతున్నారు. ఇందులో భాగంగా.. మొదటి రాత్రి వధువు తన భర్తతో కలిసినప్పుడు కన్నె పొర చిరిగిపోయి బ్లీడింగ్‌ జరగాలి. దీన్ని గుర్తించడానికి వారి మంచంపై తెల్లటి బెడ్‌షీట్‌ పరుస్తారు. దానిపై రక్తపు మరకలు పడితే ఆమె కన్య అని, లేదంటే పతితగా ఆమెపై ముద్ర వేస్తారు. ఇక కన్య కాదని తెలిస్తే అత్తింటి వారి నుంచి నవ వధువు తీవ్ర వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరహా అనాచారాన్ని రాజస్థాన్‌లోని హన్సీ తెగలో ‘కుకడీ ప్రాథా వేడుక’గా నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాదు.. దేశంలోని ఇతర తెగల్లో ‘పానీ కీ ధీజ్‌ (వ్యక్తి వంద అడుగులు వేసే దాకా వధువు నీటిలో మునిగి ఊపిరి బిగబట్టి ఉండడం)’, ‘అగ్ని పరీక్ష (నిర్దేశిత సమయం పాటు వధువు చేతిలో నిప్పుల కుంపటి ఉంచడం)’.. వంటి పద్ధతుల్ని వేడుకలుగా నిర్వహిస్తూ మహిళలకు కన్యత్వ పరీక్షలు చేస్తున్నారు.

వీటితో పాటు మరికొన్ని చోట్ల రెండు చేతి వేళ్లను ఉపయోగించి కన్యత్వ పరీక్ష జరుపుతున్నారు. ‘టూ ఫింగర్ టెస్ట్‌’గా పిలిచే ఈ పరీక్షను గతంలో అత్యాచార బాధితులను పరీక్షించడానికి వినియోగించేవారు. కానీ ఆ తర్వాత దీన్ని అశాస్త్రీయమైనదిగా భావించిన అత్యున్నత న్యాయస్థానం ఈ పరీక్షను రద్దు చేసింది. అయినా వధువుకు కన్యత్వ పరీక్ష చేయడానికి దేశంలోని కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ అశాస్త్రీయమైన మూఢనమ్మకాన్ని పాటించడం గమనార్హం! ఒకవేళ కన్య కాదని తేలితే.. ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేయడం, జరిమానా విధించడం.. వంటివి ఇప్పటికీ కొన్ని తెగల్లో కనిపించడం విచారకరం.

ఇక అఫ్గానిస్తాన్‌ వంటి దేశాల్లో కన్యత్వ పరీక్షల్లో ఫెయిలైన మహిళల్ని జైల్లో పెట్టడానికీ వెనకాడట్లేదట! దక్షిణాఫ్రికాలో కన్యత్వ సర్టిఫికెట్లు ఇవ్వడం, కన్యలని నిర్ధరణ అయితే ఆయా వేడుకల్లో వారికి అవార్డులివ్వడం వంటివి శోచనీయం. ఇక జింబాబ్వే మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్లు దాటిన అమ్మాయిలకు మత పెద్దలు కన్యత్వ పరీక్షలు చేయడం.. ఒకవేళ కన్య కాని వధువును పెళ్లాడితే.. ఆ వ్యక్తికి ఆమే కన్య అయిన మరో అమ్మాయిని వెతికి పెళ్లి చేయడం.. వంటి దురాచారాలూ అక్కడ కొనసాగుతున్నాయట!

అయితే ఇలా బలవంతంగా చేసే కన్యత్వ పరీక్షల వల్ల చాలామంది మానసికంగా, ఎమోషనల్‌గా కుంగిపోతున్నారని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో నొప్పితో పాటు యాంగ్జైటీ, కుంగుబాటు, ఒత్తిడి, ఒక రకమైన భయాందోళనలతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు.


ఆ రోజు ఎప్పుడు?!

ఇవే కాదు.. భ్రూణ హత్యలు, గృహ హింస, బాల్య వివాహాలు, అత్యాచారాలు, పని ప్రదేశంలో లైంగిక హింస.. నేటికీ వివిధ దేశాల్లో జరుగుతోన్న ఇలాంటి అఘాయిత్యాలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి. వారి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల కింద మొదలైన ఈ అనాగరిక చర్యలు మహిళల హక్కులకు, వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. అయితే ఆయా దేశాల్లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది యువత వీటిపై చేస్తోన్న పోరాట ఫలితంగా ఈ తరహా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. వాటిని పూర్తిగా నిర్మూలించే రోజు మాత్రం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పచ్చు. అంతేకాదు.. కొంతమంది మహిళలు ‘పరువు’ హత్యలకు గురికావడం.. వంటివీ అక్కడక్కడా జరగడం విచారకరం! అందుకే ఈ మూఢాచారాల్ని సాధ్యమైనంత త్వరగా ఈ సమాజం నుంచి తరిమేయాలని డబ్ల్యూహెచ్‌వో, ఐక్యరాజ్య సమితి.. వంటి సంస్థలు ఎప్పటికప్పుడు పిలుపునిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్