Breast Ironing: కామాంధుల కళ్లకు అందంగా కనిపించకూడదని..!

పురుషుల్లో లైంగిక కోరికలు కలగకుండా అమ్మాయిల అందాన్ని అణచివేయడం..మగవాళ్లు ఎలాంటి వారైనా.. కన్య అని తేలితేనే అమ్మాయిని వివాహమాడడం..తాము బహుభార్యత్వాన్ని పాటించినా.. తన భార్య మాత్రం గీసిన గీత దాటకుండా ఉండాలన్న కట్టుబాటు.. బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పితృస్వామ్య వ్యవస్థలో మహిళల మనుగడకు శాపంగా పరిణమిస్తోన్న అంశాలు ఎన్నో..

Updated : 13 Sep 2023 21:03 IST

పురుషుల్లో లైంగిక కోరికలు కలగకుండా అమ్మాయిల అందాన్ని అణచివేయడం..

మగవాళ్లు ఎలాంటి వారైనా.. కన్య అని తేలితేనే అమ్మాయిని వివాహమాడడం..

తాము బహుభార్యత్వాన్ని పాటించినా.. తన భార్య మాత్రం గీసిన గీత దాటకుండా ఉండాలన్న కట్టుబాటు.. బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పితృస్వామ్య వ్యవస్థలో మహిళల మనుగడకు శాపంగా పరిణమిస్తోన్న అంశాలు ఎన్నో! నిజానికి ఈ అరాచకాలనే కొన్ని దేశాలు ఇప్పటికీ ఆచారాలుగా పాటించడం శోచనీయం! ప్రపంచవ్యాప్తంగా పలు మారుమూల ప్రాంతాలు, గిరిజన తెగల్లో నేటికీ ఇలాంటి ఆచారాల పేరిట మహిళలపై అణచివేత కొనసాగుతోందని ‘ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (UNFPA)’ నివేదిక చెబుతోంది. ఇలాంటి మూఢనమ్మకాలు కొందరు బాలికలు, మహిళల జీవితాన్నే అంతమొందిస్తుంటే.. మరికొందరు వీటి ప్రభావంతో జీవితాంతం కుంగుబాటులోనే గడపాల్సి వస్తోంది.

వక్షోజాలు పెరగకుండా..!

అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభమయ్యే క్రమంలో.. హార్మోన్లలో మార్పుల కారణంగా వారిలో పలు శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వక్షోజాల్లో పెరుగుదల, లైంగిక కోరికలు కలగడం.. వంటివి సహజం. ఈ క్రమంలో- వయసొచ్చిన తమ పిల్లల పైన మగవాళ్ల కళ్లు పడకుండా ఉండేందుకు, వారిపైన అత్యాచారాలను నిరోధించేందుకు, తమ కూతుళ్లు పెళ్లికి ముందే గర్భం ధరించకుండా ఉండేందుకు ఆఫ్రికన్‌ తల్లులు వారి కూతుళ్ల అందాన్ని అణచివేయడానికీ వెనకాడరట. ఈ క్రమంలో అమ్మాయిల్లో రజస్వలకు సంబంధించిన లక్షణాలు పసిగట్టడమే ఆలస్యం.. వారిలో లైంగిక కోరికలు కలగకుండా, అబ్బాయిలకు ఆకర్షణీయంగా కనిపించకుండా చేసేందుకు.. ‘బ్రెస్ట్‌ ఐరనింగ్‌/బ్రెస్ట్‌ ఫ్లాటెనింగ్‌’ పద్ధతిని పాటిస్తారట అక్కడి తల్లులు. ముఖ్యంగా కామెరూన్ వంటి కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ పద్ధతిని ఇప్పటికీ ఆచారంగా కొనసాగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. కొన్ని రకాల ఆకులు, అరటి కాయలు, కొబ్బరి చిప్పలు మొదలైన వాటితో గట్టిగా మర్దన చేయడం, రాళ్లు, ఇనుప రాడ్లు.. వంటి కొన్ని రకాల వస్తువుల్ని కాల్చి.. వక్షోజాలపై బలంగా వత్తడం, ఛాతీ చుట్టూ ఎలాస్టిక్‌ బెల్టులు బిగించడం.. ఇలా వివిధ పద్ధతుల ద్వారా తమ కూతుళ్ల రొమ్ము కణజాలం పెరగకుండా చేస్తారట అక్కడి తల్లులు.

ఆచారం పేరిట అనుసరిస్తోన్న ఈ అరాచకాన్ని లింగ వివక్షకు సంబంధించి.. తక్కువగా నివేదించిన ఐదు నేరాల్లో ఒకటిగా పరిగణించింది ఐక్యరాజ్య సమితి. అయినా కామాంధుల బారి నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవడం కోసమే తామీ పద్ధతిని పాటిస్తున్నట్లు అక్కడి తల్లులు సమర్థించుకోవడం గమనార్హం! ఏదేమైనా.. ఈ అనాచారం కారణంగా.. అమ్మాయిల వక్షోజాలపై గాయాలవడంతో పాటు, భవిష్యత్తులో పలు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ అరాచకానికి గురైన మహిళలు తల్లయ్యాక బిడ్డలకు పాలిచ్చే విషయంలోనూ పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

కన్యగా ఉండాలని..!

పెళ్లికి ముందే శృంగారం మన సంప్రదాయం కాకపోయినా.. పాశ్చాత్య పోకడల ప్రభావంతో చాలా దేశాల్లో ఇది సాధారణమైన అంశంగా మారిపోతోంది. అయితే కొన్ని దేశాలు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లయ్యే వరకూ కన్యగానే ఉండాలన్న కట్టుబాట్లు, సామాజిక ఒత్తిళ్ల ప్రభావంతో.. వారిపై ఆచారాల పేరుతో అరాచకాలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మాయిలకు శాపంగా మారిన జననాంగ విరూపణ ప్రక్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సబ్ సహరన్‌ ఆఫ్రికా, అరబ్‌ దేశాలు, ఆసియా, తూర్పు యూరప్‌, లాటిన్‌ అమెరికాతో పాటు యూరప్‌, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాల్లో ఈ అనాచారం అమ్మాయిలకు శాపంగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇక కరోనా సమయంలో ఇది మరింతగా పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 68 మిలియన్ల మంది అమ్మాయిలు జననాంగ విరూపణకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నాయి.

జననేంద్రియాల్ని పాక్షికంగా తొలగించడం/కుట్లు వేయడం/పూర్తిగా తొలగించడం.. ఇలా అమ్మాయిల్లో, మహిళల్లో లైంగిక కోరికల్ని అణచివేయడానికి పాటిస్తోన్న ఈ పద్ధతి వల్ల.. వారిలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, అసౌకర్యంతో పాటు.. భవిష్యత్తులో సంతానలేమి, మాతా-శిశు మరణాల ముప్పు.. వంటి సమస్యలు పొంచి ఉంటాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ పద్ధతిని అంతమొందించి అమ్మాయిల్ని హింసకు దూరంగా ఉంచేందుకు ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ పాపులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ICPD)’ సంస్థ ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలో బాలికలు/మహిళలకు తమ హక్కుల గురించి తెలియజేయడంతో పాటు.. లైంగిక విషయాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం.. తదితర అంశాల పైనా అవగాహన కల్పించడమే దీని లక్ష్యం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్