ఏ ఎయిర్‌హోస్టెస్‌ ఏ యూనిఫాం ధరిస్తారో తెలుసా?

ఎయిర్‌హోస్టెస్‌ అనగానే చక్కటి డ్రస్‌కోడ్‌లో ముస్తాబైన అందమైన అమ్మాయిలే దర్శనమిస్తారు. అయితే వివిధ దేశాల విమానయాన సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం డ్రస్‌ కోడ్‌ రూపొందించడం పరిపాటే!

Published : 08 Dec 2023 12:25 IST

(Photos: Instagram)

ఎయిర్‌హోస్టెస్‌ అనగానే చక్కటి డ్రస్‌కోడ్‌లో ముస్తాబైన అందమైన అమ్మాయిలే దర్శనమిస్తారు. వివిధ దేశాల విమానయాన సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం డ్రస్‌ కోడ్‌ రూపొందించడం పరిపాటే! ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన వివిధ విమానయాన సంస్థల్లోనూ ఎయిర్‌హోస్టెస్ల కోసం విభిన్న ఏకరూప దుస్తుల్ని రూపొందించారు డిజైనర్లు. అయితే ఇవి దేశ సంస్కృతిని ప్రతిబింబించడమే కాదు.. భారతీయతను, నిండుదనాన్ని ప్రస్ఫుటించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మన దేశంలో ఏయే విమానయాన సంస్థలు తమ ఎయిర్‌హోస్టెస్ల కోసం ఎలాంటి డ్రస్‌ కోడ్‌ అమలు చేస్తున్నాయో తెలుసుకుందాం రండి..

ఎయిరిండియా.. ‘చీరకట్టు’ మారనుందా?

చీరకట్టు భారతీయతను ప్రతిబింబిస్తుంది. అందుకే మన దేశంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగినుల కోసం చీరల్ని డ్రస్‌కోడ్‌గా ఎంచుకోవడం మనం చూస్తుంటాం. మన దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా దాదాపు 60 ఏళ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఎరుపు, నీలం రంగు ప్రింటెడ్‌ శారీస్‌ని తమ ఎయిర్‌హోస్టెస్లకు యూనిఫాంగా కేటాయించింది. వీటికి జతగా హైనెక్‌ బ్లౌజుల్ని రూపొందించి మహిళల హుందాతనాన్ని మరింతగా పెంచిందీ సంస్థ. అయితే ఈ డ్రస్‌ కోడ్‌లో త్వరలో సంస్థ కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్లు మొన్నామధ్య వార్తలొచ్చాయి. చీరలకు బదులుగా ఎరుపు-ఆరెంజ్‌ రంగులతో చుడీదార్స్‌ని, పురుషులకు సూట్‌ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అలాగని చీరల్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా.. తమ మహిళా సిబ్బంది కోసం ప్రి-డ్రేప్‌డ్‌ శారీస్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక ఈ కొత్త డ్రస్‌ కోడ్‌ని ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజన్‌ చేస్తున్నారట! త్వరలోనే విస్తారా ఎయిర్‌లైన్స్‌ని ఎయిరిండియాలో విలీనం చేశాక.. ఈ కొత్త డ్రస్‌కోడ్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారట! ఏదేమైనా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. నిజానికి 1962 వరకు ఎయిరిండియాలో స్కర్ట్స్‌, జాకెట్స్‌, హ్యాట్స్‌.. వంటి వాటితో కాస్త మోడ్రన్‌ డ్రస్‌ కోడ్‌నే అమలు చేసేవారు. ఆపై జేఆర్‌డీ టాటా తమ విమానయాన సంస్థ మహిళా సిబ్బంది కోసం చీరకట్టును యూనిఫాంగా తీసుకొచ్చారు. దీంతో గత ఆరు దశాబ్దాలుగా సంప్రదాయ చీరకట్టునే కొనసాగిస్తున్నారు ఎయిరిండియా ఎయిర్‌హోస్టెస్లు.


ఇండిగో.. వన్‌ పీస్‌ డ్రస్‌

పేరుకు తగినట్లుగానే ఇండిగో సంస్థ తమ సిబ్బంది/ఎయిర్‌హోస్టెస్ల కోసం డ్రస్‌కోడ్‌ను రూపొందించింది. ఇండిగో బ్లూ/నీలం రంగుల్లో యూనిఫాంను డిజైన్‌ చేయించింది. ఈ క్రమంలో మహిళల కోసం నేవీ బ్లూ కలర్‌ వన్‌ పీస్‌ డ్రస్‌ని కేటాయించారు. దానికి జతగా బ్లూ కలర్‌ బెల్టు, అదే రంగులో ఉన్న నెక్‌ టై, బెరెట్‌ (క్యాప్‌)ను డిజైన్‌ చేయించారు. ఇక కాళ్లు కవరయ్యేలా మ్యాచింగ్‌ కలర్‌ నెట్‌ లెగ్గింగ్‌, స్టిలెట్టోస్‌ని రూపొందించారు. చూడ్డానికి మోడ్రన్‌గానే కనిపించినా.. నిండుదనాన్ని, హుందాతనాన్ని ప్రతిబింబించే ఈ యూనిఫాంను డిజైనర్‌ రాజేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ డిజైన్‌ చేశారు. ఇక మేకప్‌ ఆర్టిస్ట్‌ అంబికా పిళ్లై ఈ యూనిఫాంకు తగినట్లుగా ఎయిర్‌హోస్టెస్‌ లుక్స్‌కి హంగులద్దారు. ఇక పురుషుల కోసం.. తెలుపు రంగు షర్ట్‌, నేవీ బ్లూ జాకెట్‌, ట్రౌజర్స్‌ డ్రస్‌కోడ్‌గా నిర్ణయించారు.


స్పైస్‌జెట్‌.. హుందాగా, క్యాజువల్‌గా!

కొన్ని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకించి డ్రస్‌ కోడ్‌ లేకపోయినా.. వారి ఆహార్యం విషయంలో పలు నియమనిబంధనల్ని విధిస్తుంటాయి ఆయా సంస్థలు. కానీ ‘క్యాజువల్‌ ఫ్రైడేస్‌’ పేరుతో ఆ నిబంధనల్ని కాస్త సడలించి.. వారాంతాల్లో మాత్రం వారి ఇష్టానికి, సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా దుస్తుల్ని ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. చౌక ధరల్లోనే విమానయాన సేవలందించే ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న స్పైస్‌జెట్‌ కూడా తమ సిబ్బంది కోసం ఇలాంటి నియమాన్నే అమలు చేస్తోంది. వారమంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిసిన షిఫ్ట్‌ డ్రస్‌లో దర్శనమిచ్చే స్పైస్‌జెట్‌ ఉద్యోగినులు, వారాంతాల్లో మాత్రం రంగురంగుల కుర్తీలు-జీన్స్‌లు ధరిస్తూ క్యాజువల్‌గా కనిపిస్తుంటారు. వీటికి జతగా స్లింగ్‌ బ్యాగ్‌, బాక్స్‌ హీల్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇలా తమ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, ప్రయాణికులకూ సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచుతోందీ సంస్థ. ఇక పురుషుల కోసం బ్లాక్‌ ట్రౌజర్స్‌కు జతగా తెలుపు రంగు షర్ట్‌, రెడ్‌ వెయిస్ట్‌ కోట్‌, బ్లాక్‌ జాకెట్‌ను ఎంపిక చేసింది.


జెట్‌ ఎయిర్‌వేస్‌.. నెహ్రూ జాకెట్‌ స్టైల్‌!

‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ విమానయాన సంస్థ తమ మహిళా క్యాబిన్‌ క్రూ కోసం పురుషుల డ్రస్సింగ్‌ తరహాలోనే ప్రత్యేకమైన యూనిఫాంను రూపొందించింది. వారి కోసం పసుపు రంగు నెహ్రూ స్టైల్‌ కోట్‌, నేవీ బ్లూ ట్రౌజర్స్ని ఎంపిక చేసింది. ఇక పురుషుల కోసం నేవీ బ్లూ కలర్‌ ప్యాంట్‌ సూట్‌ని డిజైన్‌ చేయించిన ఈ ఎయిర్‌లైన్స్.. యూనిఫాం ద్వారానూ తమ ఉద్యోగుల్లో సమానత్వ స్ఫూర్తిని నింపింది. ఈ దుస్తుల్ని ఇటలీ డిజైనర్‌ రోబెర్టో క్యాపుచి డిజైన్‌ చేశారు.


ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. కుర్తా-లెగ్గింగ్‌

కుర్తా-లెగ్గింగ్‌.. మనం క్యాజువల్‌గా ధరించే దుస్తులివి. అయితే వీటినే కాస్త ట్రెడిషనల్‌గా మలిచి తమ క్యాబిన్‌ క్రూ యూనిఫాంగా డిజైన్‌ చేయించింది ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానయాన సంస్థ. ఎరుపు రంగు కుర్తాకు ఆరెంజ్‌ కలర్‌ లెగ్గింగ్‌ని జత చేస్తూ.. కాస్త మోడ్రన్‌ లుక్‌ని అందించేందుకు ప్రింటెడ్‌ నెక్‌ స్కార్ఫ్‌తో హంగులద్దింది. ఈ దుస్తులకు తోడు బన్‌ హెయిర్‌స్టైల్‌, తక్కువ మేకప్‌తో ఈ సంస్థ క్యాబిన్‌ క్రూ మెరిసిపోతారు. ఇక పురుషుల కోసం బీజ్‌ కలర్‌ సూట్‌, ఎరుపు రంగు టైని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిందీ ఎయిర్‌లైన్స్. ప్రముఖ డిజైనర్‌ రీతూ బెరి ఈ దుస్తుల్ని రూపొందించారు.

వీటితో పాటు.. ఎయిర్‌ ఏషియా, గో ఎయిర్‌, ఆకాశ ఎయిర్‌.. వంటి విమానయాన సంస్థలు తమ ఎయిర్‌హోస్టెస్ల కోసం డిజైన్‌ చేయించిన ప్రత్యేకమైన ఫ్యాషనబుల్‌ డ్రస్‌కోడ్స్‌ కూడా అటు హుందాతనానికి, ఇటు సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్