తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ తన పైపర్‌ని కలుసుకున్న వేళ..!

కొంతమందికి తమ పెట్స్ అంటే పంచ ప్రాణాలు. ఎంతలా అంటే తమ సొంత పిల్లల్లాగా సాకుతుంటారు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, టీకాలు వేయించడం చేస్తుంటారు. ఒకవేళ తమ పెట్‌ కనబడకుండా పోతే ఇలాంటివారు అస్సలు తట్టుకోలేరు. కొంతమందైతే అన్నం కూడా తినడం....

Published : 28 Feb 2023 13:09 IST

(Photos: Instagram)

కొంతమందికి తమ పెట్స్ అంటే పంచ ప్రాణాలు. ఎంతలా అంటే తమ సొంత పిల్లల్లాగా సాకుతుంటారు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, టీకాలు వేయించడం చేస్తుంటారు. ఒకవేళ తమ పెట్‌ కనబడకుండా పోతే ఇలాంటివారు అస్సలు తట్టుకోలేరు. కొంతమందైతే అన్నం కూడా తినడం మానేస్తుంటారు. ఆమెరికాకు చెందిన ఓ మహిళ కూడా ఇలానే ఓ పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంది. దానికి ముద్దుగా పైపర్‌ అనే పేరు కూడా పెట్టుకుంది. అయితే ఓ రోజు ఆ పిల్లి కనబడకుండా పోయింది. ఎంత వెతికినా దాని ఆచూకీ లభించలేదు. దాంతో ఆ పిల్లి చనిపోయిందని భావించింది. కానీ, ఆమె ఎంత గట్టిగా అనుకుందో కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత తన పైపర్‌ను మళ్లీ కలుసుకుంది. ఇంతకీ అదెలాగో తెలుసుకుందామా...

అమెరికాలోని వర్జీనియా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పెట్స్‌ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతో ఓ పిల్లిని తెచ్చుకుంది. దానికి ముద్దుగా పైపర్‌ అనే పేరు పెట్టుకుంది. అయితే ఓ రోజు అనుకోకుండా పైపర్‌ తప్పిపోయింది. ఇష్టంతో పెంచుకున్న పిల్లి ఒక్కసారిగా కనిపించకపోవడంతో ఆ మహిళ ఎంతో బాధపడింది. దాని ఆచూకీ తెలుసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, ఆ పిల్లి ఆచూకీ మాత్రం తెలియలేదు. దాంతో పైపర్‌ చనిపోయిందని భావించింది.

తొమ్మిదేళ్ల తర్వాత..!

ఆ మహిళ ఎంత గట్టిగా అనుకుందో కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత పైపర్‌ని పోలీసులు మళ్లీ ఆమె దగ్గరకు చేర్చారు. దీనికి టెక్నాలజీ కూడా దోహదపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

‘ఇటీవలే హెన్రికో కౌంటీ పోలీస్‌కు సంబంధించిన జంతు సంరక్షణ విభాగానికి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఒక వ్యక్తి తమ నివాసం దగ్గర పిల్లి తిరుగుతోందని, ఎంత ప్రయత్నించినా బయటకు వెళ్లడం లేదని చెప్పాడు. దాంతో మా అధికారి ఆ పిల్లిని జంతు సంరక్షణ షెల్టర్‌కు తీసుకొచ్చాడు. ఆ పిల్లి మెడలోని మైక్రోచిప్‌ను స్కాన్‌ చేస్తే ఆ పిల్లి ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలిసింది. దాంతో ఆ ప్రాంతానికి సంబంధించిన పశువైద్యులను సంప్రదించాం. లోతుగా విచారణ చేసిన తర్వాత ఆ పిల్లి యజమాని వివరాలు తెలిశాయి. దాంతో ఆ మహిళకు ఫోన్‌ చేసి పిల్లిని అప్పగించాం’ అని రాసుకొచ్చారు.

మొదట నమ్మలేదు..!

పోలీసుల నుంచి ఫోన్‌ రాగానే ఆ మహిళ మొదట నమ్మలేదు. కానీ, ఎప్పుడైతే పైపర్‌ను చూసిందో తెగ సంబరపడింది. పైపర్‌ కూడా తొమ్మిదేళ్ల తర్వాత సైతం తన యజమానిని గుర్తించడం విశేషం. ఈ క్రమంలో పైపర్‌ ఆచూకీ తెలుసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగపడిందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా-  ‘ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. పైపర్‌కు అమర్చిన మైక్రోచిప్‌ వల్లే దానిని తన యజమాని దగ్గరకు చేర్చగలిగాం. కాబట్టి, మీరు కూడా మీ పెట్‌కు మైక్రోచిప్‌ అమర్చండి. అలాగే అందులోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండండి’ అని సూచించడం గమనార్హం.

మైక్రోచిప్పింగ్‌ అంటే ఏంటి?

మైక్రోచిప్పింగ్‌లో భాగంగా బియ్యపు గింజంత ఎలక్ట్రానిక్‌ చిప్‌ను పెట్‌ చర్మం లోపల అమర్చుతారు. దీనివల్ల పెట్‌కు ఎటువంటి హానీ ఉండదు. ఈ చిప్‌లో ఒక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఉంటుంది. ఇందులో దాని యజమాని, ఇప్పించిన వ్యాక్సిన్లకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు. ఈ వివరాలను ప్రత్యేక స్కానర్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్‌ యూనియన్‌ వంటి దేశాల్లో పెట్స్‌కి మైక్రోచిప్పింగ్‌ తప్పనిసరిగా చేయాలనే చట్టాలు కూడా ఉన్నాయి. మన దేశంలో మైక్రోచిప్పింగ్‌కు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు లేవు. కానీ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతువులకు సంబంధించిన క్లినిక్‌లు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ చిప్‌ను అమర్చడం ద్వారా అవి తప్పిపోయినప్పుడు, ఎవరైనా తీసుకెళ్లినప్పుడు వాటి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్