Joanna Cox: రోజుకు 22 గంటలు నిద్ర పోతుందట!

రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక పాట్లు పడుతుంటారు మనలో చాలామంది. నిద్ర మాత్రలు వేసుకొని మరీ నిద్రలోకి జారుకునే వారూ లేకపోలేదు. ఇలా నిద్ర పట్టక మనం ఇబ్బందులు పడుతుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన జొవాన్నా కాక్స్‌ మాత్రం మెలకువతో ఉండడానికి....

Published : 11 Mar 2023 12:37 IST

(Photos: Instagram)

రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక పాట్లు పడుతుంటారు మనలో చాలామంది. నిద్ర మాత్రలు వేసుకొని మరీ నిద్రలోకి జారుకునే వారూ లేకపోలేదు. ఇలా నిద్ర పట్టక మనం ఇబ్బందులు పడుతుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన జొవాన్నా కాక్స్‌ మాత్రం మెలకువతో ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే.. ఆమె రోజులో 18-22 గంటలు నిద్రలోనే గడిపేస్తోంది. తనకున్న ఓ అరుదైన ఆరోగ్య సమస్యే ఈ అతి నిద్రకు కారణమట! దీనివల్ల తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవనశైలిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటోన్న కాక్స్‌.. తన అరుదైన నిద్ర అలవాట్లతో ‘స్లీపింగ్‌ బ్యూటీ’గానూ పేరు తెచ్చుకుంది.

జొవాన్నా కాక్స్‌ది ఇంగ్లండ్‌ వెస్ట్‌ యార్క్‌షైర్‌లోని క్యాజిల్‌ఫోర్డ్‌ నగరం. ఇసాబెల్, కైట్లిన్‌.. అనే ఇద్దరు కూతుళ్లకు తల్లైన ఆమె.. రోజులో 18-22 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోతోంది. ‘అదేంటి.. సాధారణంగా రాత్రుళ్లు ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోతే.. మధ్యాహ్నం అసలు కునుకే రాదు.. అలాంటిది జొవాన్నా గంటల తరబడి నిద్రెలా పోతోంది?’ అనేగా మీ సందేహం? ఇందుకు ఆమెకున్న ‘ఇడియోపతిక్ హైపర్‌సోమ్నియా’ (Idiopathic Hypersomnia) అనే అరుదైన ఆరోగ్య సమస్యే కారణమట!

డిప్రెషనేమో అనుకున్నా.. కానీ!

ఈ అతినిద్ర సమస్య ఉన్న వారు రాత్రుళ్లు సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోయినా.. పగటి సమయంలోనూ నిద్రావస్థలోనే ఉంటారట! ఇలా ఈ అరుదైన సమస్యతో బాధపడుతోన్న కాక్స్‌ రోజులో 22 గంటలు నిద్రపోవడంతో పాటు ఒక్కోసారి లేవకుండా మూడు నాలుగు రోజులూ నిద్రలోనే ఉండిపోతానంటోంది.

‘నాకున్న అరుదైన ఆరోగ్య సమస్యతో రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడం చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి నిద్రలోకి జారుకున్నానంటే.. గంటల తరబడి మెలకువ రాదు. ఒకవేళ బలవంతంగా మేల్కొనే ప్రయత్నం చేస్తే.. ఆ రోజంతా అలసటగా, మగతగా అనిపిస్తుంటుంది. ఇక నాకున్న అనారోగ్యం గురించి అవగాహన లేని వారు ‘సోమరి.. నిన్ను నిద్ర లేపాలంటే బోలెడన్ని అలారంలు కావాలి..’ అంటూ హేళన చేస్తుంటారు. నిజానికి 2017లోనే ఈ నిద్ర లక్షణాలు గుర్తించా. కానీ డిప్రెషన్‌ వల్ల ఇలా జరుగుతుందేమో అనుకున్నా. సంబంధిత డాక్టర్‌కు చూపించుకుంటే.. ఇది డిప్రెషన్‌ కాదని, మరేదో ఆరోగ్య సమస్య అయి ఉంటుందని చెప్పారు. ఇలా నాకున్న అరుదైన నిద్ర అలవాట్లతో 2019లో ఉద్యోగం కూడా వదులుకున్నా.. మరోవైపు నేను ప్రారంభించిన వ్యాపారాన్నీ సమర్థంగా నిర్వర్తించలేకపోయా..’ అంటూ చెప్పుకొచ్చింది కాక్స్.

టూర్‌నీ మిస్సయ్యా!

ఇలా తనకున్న అరుదైన నిద్ర సమస్యతో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ పనీ చేయలేకపోతున్నానని, ఎన్నో సరదాల్నీ మిస్సవుతున్నానని చెబుతోంది కాక్స్. ‘నా నిద్రకు అంతులేదు.. దాన్ని ఆపుకొనే శక్తీ నాకు లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ క్షణాల్లోనే నిద్ర ముంచుకొస్తుంటుంది. అతి నిద్ర కారణంగా డ్రైవింగ్‌ చేయడం ఇబ్బందిగా మారడంతో దాన్నీ వదులుకున్నా. ఓసారి ఈ అతి నిద్ర వల్లే నా కూతుళ్లతో కలిసి వెళ్లాల్సిన స్పెయిన్‌ టూర్‌ మిస్సయింది. ఇలా గంటలే కాదు.. ఒక్కోసారి వరసగా మూడునాలుగు రోజుల పాటు లేవకుండా నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా ఏమీ తినకపోవడం వల్ల ఓసారి శరీరంలో చక్కెర స్థాయులు పడిపోయి ఆస్పత్రి పాలయ్యా. ఇక మెలకువతో ఉన్న ఆ రెండుమూడు గంటల్లోనే సులభంగా, త్వరగా తయారుచేసుకోగలిగే ప్రొటీన్‌ షేక్స్‌, ఇతర వంటకాల్ని వండుకొని ఆహారంగా తీసుకుంటా.. ఇలా గంటల తరబడి నిద్రలో గడిపి లేచినప్పుడు అసలు ‘ఇది ఏ రోజు?, ఏ తేదీ?’ అన్నది కూడా గుర్తుండదు.. మెలకువ వచ్చినా తిరిగి ఎప్పుడు నిద్రలోకి జారుకుంటానో కూడా తెలియదు..’ అంటోన్న కాక్స్‌.. ఈ ఆరేళ్లలో ఒక రోజులో గరిష్టంగా 12 గంటలు, కనిష్టంగా కొన్ని నిమిషాల పాటు మెలకువతో ఉందట! ఇలా తన అరుదైన నిద్ర లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా ‘స్లీపింగ్‌ బ్యూటీ’గా పిలిపించుకుంటోన్న కాక్స్.. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి- సంబంధిత నిపుణుల్ని సంప్రదించడంతో పాటు యోగా, మెడిటేషన్.. వంటి పద్ధతుల్నీ ప్రయత్నిస్తున్నానంటోంది. అలాగే నిద్రకు సంబంధించి ఇలాంటి అరుదైన సమస్యలతో బాధపడుతుంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించమని కూడా సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్