Marriage Day: బంగారు గులాబీల బొకేతో.. భర్తకు మర్చిపోలేని బహుమతి!

ప్రేమికుల దినోత్సవం.. ప్రేమను పంచుకునే వారికి ప్రత్యేకం! ఈ రోజున ప్రేమికులు, భార్యాభర్తలు.. ఒకరికొకరు విలువైన బహుమతులిచ్చిపుచ్చుకోవడం సహజమే! అయితే ఈ ప్రత్యేక సందర్భానికి వివాహ వార్షికోత్సవం కూడా తోడైతే.. ఆనందం డబుల్‌ అవుతుంది. ఈ రెట్టింపు ఆనందాన్ని తన భర్త ముఖంలో చూడాలనుకుంది....

Published : 15 Feb 2023 21:19 IST

ప్రేమికుల దినోత్సవం.. ప్రేమను పంచుకునే వారికి ప్రత్యేకం! ఈ రోజున ప్రేమికులు, భార్యాభర్తలు.. ఒకరికొకరు విలువైన బహుమతులిచ్చిపుచ్చుకోవడం సహజమే! అయితే ఈ ప్రత్యేక సందర్భానికి వివాహ వార్షికోత్సవం కూడా తోడైతే.. ఆనందం డబుల్‌ అవుతుంది. ఈ రెట్టింపు ఆనందాన్ని తన భర్త ముఖంలో చూడాలనుకుంది పరిధి బెన్‌. ఈ క్రమంలో మామూలు రోజా పూలైతే సాయంత్రానికి వాడిపోతాయనుకుందో ఏమో.. ఏకంగా బంగారంతో పూత పూసిన రోజా పూలతో హృదయాకృతిలో ఓ అందమైన బొకే తయారుచేయించి మరీ తన ఇష్టసఖుడికి బహుమతిగా అందించింది. ఇలా ఎన్నేళ్లైనా వాడిపోని రోజాపూలతో తనకు మరపురాని బహుమతిచ్చి తనపై చూపిన గాఢమైన ప్రేమకు ఆ భర్త ఆశ్చర్యపోవడమే కాదు.. చెప్పలేనంత సంతోషంలో మునిగిపోయాడు. ఇలా పరిధి తన భర్తకు ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పరిధి బెన్‌, దీప్‌.. సూరత్‌కు చెందిన వీళ్లిద్దరూ భార్యాభర్తలు. సరిగ్గా ఏడాది క్రితం ప్రేమికుల దినోత్సవం రోజున ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఏటేటా పెళ్లి రోజు వచ్చినా.. తొలి వివాహ వార్షికోత్సవం మాత్రం ప్రతి జంటకూ ప్రత్యేకం! ఈ క్రమంలో పరిధి-దీప్‌ తొలి వివాహ వార్షికోత్సవం, వేలంటైన్స్‌ డే ఒకే రోజు రావడంతో వాళ్ల జీవితాల్లో సంతోషం మరింత రెట్టింపైంది.

మొదట ఉంగరం అనుకొని..!

మరి, ఈ శుభ సందర్భంలో ఓ విలువైన బహుమతిచ్చి తన భర్తను సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంది పరిధి. ఈ ఆలోచనతోనే అక్కడి ఓ ఆభరణాల దుకాణానికి డైమండ్‌ రింగ్‌ కొందామని వెళ్లిందామె. అయితే అదే సమయంలో అక్కడ బంగారు పూత పూసి తయారుచేసిన గులాబీ పువ్వులు ఆమె కంట పడ్డాయి. అయినా డైమండ్‌ రింగ్‌ బహుమతిగా ఇస్తే అందులో ప్రత్యేకత ఏముంటుంది? అనుకున్న పరిధి.. ఈ వినూత్న బహుమతిని తయారుచేయించింది.

‘బంగారు పూత పూసిన గులాబీలు నాకెంతో నచ్చాయి. అలాంటి 108 గులాబీలతో హృదయాకారం వచ్చేలా ఓ బొకేను తయారుచేయించి దీప్‌కి కానుకగా ఇస్తే బాగుంటుందనిపించింది. వెంటనే నా ఆలోచనను జ్యుయలరీ షాపు వాళ్లతో పంచుకున్నా. ఈ బహుమతికి పలు ప్రత్యేకతలున్నాయి. 108 సంఖ్య పవిత్రతకు, ఐకమత్యానికి, పరిపూర్ణతకు ప్రతీక. ఇలాంటి బహుమతులు భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, ప్రేమను రెట్టింపు చేస్తాయి. అందుకే ఈ బహుమతితో దీప్‌ను సర్‌ప్రైజ్‌ చేశా..’ అంటూ చెప్పుకొచ్చిందీ లవ్లీ వైఫ్.

మా ప్రేమా వాడిపోదు!

పెళ్లి రోజు, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భార్య ఇచ్చిన అందమైన బహుమతిని చూసిన దీప్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘నా భార్య నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే అందమైన బహుమతిచ్చింది. ఈ గిఫ్ట్‌ రూపంలో తన మనసులో నాపై ఉన్న గాఢమైన ప్రేమను బయటపెట్టింది. ఈ పువ్వులు ఎన్నేళ్లయినా వాడిపోవు. మా ప్రేమ కూడా అంతే..!’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడీ లక్కీ హబ్బీ. ఇక సూరత్‌కు చెందిన జ్యుయలర్‌ షీతల్‌ చోక్సీ ఈ అమూల్యమైన బహుమతిని తయారుచేశారు. ‘పరిధి తన ప్రేమనంతా రంగరించి తన భర్త కోసం ఈ ప్రత్యేకమైన బహుమతిని మా వద్ద తయారుచేయించుకుంది. బంగారు పూత పూసిన 108 గులాబీలతో హృదయాకృతిలో ఈ బొకేను  రూపొందించాం. ఒక్కో పువ్వు ధర సుమారు రూ. 1700. ఇలా దీని కోసం సుమారు రూ. 1.83 లక్షలు వెచ్చించిందామె..’ అంటూ చెప్పుకొచ్చారు షీతల్.

ఇలా తన భర్తకు మరపురాని ప్రేమ కానుక ఇచ్చి.. ఆయనపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్న పరిధిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ జంట బహుమతి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. చాలామంది ‘ప్రేమగా చూసుకునే ఇలాంటి భార్య దొరకడం దీప్‌ అదృష్టమం’టున్నారు. మరికొంతమంది.. తమ జీవితంలోని ఇలాంటి అమూల్యమైన జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్