ఇలాంటి వాళ్లు పక్కనుంటే.. తిరుగే లేదు!

మనసు బాగోలేకపోతే నచ్చిన పనులు చేయడానికి ఆసక్తి చూపుతాం. అదే ఆ సమయంలో ఎవరైనా మనల్ని మాట్లాడిస్తే ‘అబ్బా.. కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్‌!’ అని కసురుకుంటామే తప్ప.. వారితో మన బాధేంటో చెప్పుకోం.. కానీ అలా చెప్పుకున్నప్పుడే మనసు....

Published : 12 Mar 2023 10:31 IST

మనసు బాగోలేకపోతే నచ్చిన పనులు చేయడానికి ఆసక్తి చూపుతాం. అదే ఆ సమయంలో ఎవరైనా మనల్ని మాట్లాడిస్తే ‘అబ్బా.. కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్‌!’ అని కసురుకుంటామే తప్ప.. వారితో మన బాధేంటో చెప్పుకోం.. కానీ అలా చెప్పుకున్నప్పుడే మనసు తేలికపడుతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. అంతేకాదు.. మన చుట్టూ ఉండే కొన్ని రకాల వ్యక్తులు, వారి మనస్తత్వాలు మనల్ని సానుకూల దృక్పథం వైపు అడుగులేయిస్తాయంటున్నారు. మరి, మనలోని నెగెటివిటీని దూరం చేసి పాజిటివిటీ దిశగా అడుగులేయాలంటే ఎలాంటి వ్యక్తులతో అనుబంధం పెంచుకోవాలో తెలుసుకుందాం రండి..

మొహమాటమే లేని వారు!

మనం ఒక పనిచేస్తే ఎదుటివారి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా ఉండాలనుకుంటామే తప్ప నెగెటివ్‌గా ఉంటే తట్టుకోలేం. మన పనితనం ఎలా ఉన్నా కూడా బాగుంది అనే చెప్పాలనుకుంటాం. అలాగే ఇతరుల విషయంలో కూడా ఎదుటివారు ఏమనుకుంటారోనన్న మొహమాటంతో మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి చెబుతుంటాం. అయితే మనం చేసిన పని బాగుంటే బాగుందని, బాగోలేకపోతే బాలేదని నిర్మొహమాటంగా చెప్పే వాళ్లు ఉంటేనే మనలోని లోపాల్ని సరిదిద్దుకునే ఓర్పు-నేర్పు మనకు అలవడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలాంటి వాళ్లతో మాట్లాడినా, స్నేహం చేసినా ఎలాంటి సవాళ్లనైనా ఇట్టే ఎదుర్కొనే నైజం మనకు అలవడుతుందట! ఇక ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకునే ఆలోచనా విధానం కూడా ఇలాంటి వ్యక్తులతో సావాసం చేయడం వల్ల మనం సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

అచ్చం మీలాంటి వారేనా?!

ఒకే పరీక్ష కోసం ఇద్దరు విద్యార్థులు కలిసి ప్రిపేర్‌ అవుతున్నారనుకోండి.. వారి మధ్య ఆయా టాపిక్స్‌ గురించి ఎన్నో సందేహాలు తలెత్తుతాయి.. ఒకరికి తెలిసిన సమాధానం మరికొరికి తెలియకపోవచ్చు.. ఇలా ఇద్దరి మధ్య జరిగే చర్చల ద్వారా వారిలో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఇదే సూత్రాన్ని నిజ జీవితానికి కూడా ఆపాదించుకోవచ్చు. మీలాగే గొప్ప గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తులు మీ చుట్టూ ఉండడం వల్ల వారు వాటిని ఎలా చేరుకుంటున్నారు? ఈ క్రమంలో సవాళ్లను ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? ఇవన్నీ ఒకరి ద్వారా మరొకరికి తెలుస్తాయి. ఇలా వీటి గురించి ఇద్దరూ కలిసి చర్చించుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. తద్వారా ఎన్ని ఒడిదొడుకులెదురైనా ధైర్యంగా ముందుకు సాగచ్చు.. మనలోని ప్రతికూలతల్ని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే!

చెప్పేది వింటున్నారా?

జీవితమంటేనే కష్టసుఖాల సమ్మేళనం.. సమస్య వచ్చినప్పుడు కుంగిపోవడం, సంతోషమొచ్చినప్పుడు పొంగిపోవడం సర్వసాధారణంగా జరిగేదే! అయితే సంతోషాన్ని పంచుకున్నంత సునాయాసంగా మనలోని బాధను ఇతరులతో పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కారణం.. తన గోడు ఇతరులు వింటారో లేదోనన్న సందిగ్ధమే! కానీ నిజంగా మన చుట్టూ ఉండే వారు మన బాధను ఓపిగ్గా విని, అర్థం చేసుకుంటే గనుక మనలోని బాధ మటుమాయమవడమే కాదు.. సమస్యకు తగిన పరిష్కారం దొరికే వీలు కూడా ఉంది. అందుకే మన చుట్టూ ఉండే వారిలో మంచి శ్రోతలు ఉండాలంటున్నారు నిపుణులు. అలాగే మనం కూడా ఇతరుల బాధను విని అర్థం చేసుకునే ఓర్పును పెంచుకోవాలంటున్నారు. నిజంగా ఇలాంటి వాళ్లున్నారన్న ధైర్యమే మనల్ని సమస్యల నుంచి బయటపడేసి సానుకూల దృక్పథం వైపు అడుగులేయిస్తుందనడంలో సందేహం లేదు.

నవ్వుతూ-నవ్విస్తూ..!

సమస్యలు, బాధలు.. లేని వారు ఎవరుంటారు చెప్పండి! అయితే వాటిని తమ మనసు మీదకు తీసుకునే తీవ్రతను బట్టే వారు సానుకూలంగా ఉన్నారా? ప్రతికూలంగా ఆలోచిస్తున్నారా? అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది మాత్రం ఏ సమస్య అయినా నవ్వుతూ పరిష్కరించుకుంటారు. అలాంటి సమస్యే ఇతరులకు వచ్చినా వారినీ నవ్విస్తూ ఆ మూడ్‌లోంచి బయటపడేస్తారు. ప్రతికూలతలతో సతమతమవుతున్న వారి చుట్టూ అలాంటి సరదా వ్యక్తులే ఉండాలంటున్నారు నిపుణులు.
తద్వారా ప్రతి విషయాన్ని అవసరం ఉన్నా లేకపోయినా భూతద్దంలో పెట్టి చూడకుండా తేలిగ్గా తీసుకునే వీలుంటుంది. సవాళ్లను కూడా భారంగా కాకుండా నేర్పుగా, సునాయాసంగా ఎదుర్కొనే నైజం అలవడుతుంది. అయితే ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకోవడం కూడా సరికాదు. దేనికెంత ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకుంటే ఈ ఒత్తిళ్లు, టెన్షన్ల గొడవే ఉండదు.. సానుకూలంగా ముందుకు సాగడానికి ఇంతకంటే వేరే మార్గం ఇంకేముంటుంది చెప్పండి?

సాహసం శ్వాసగా సాగిపోతూ..!

జీవితమంతా ఎప్పుడూ ఒకేలా ముందుకు సాగుతుంటే అందులోని మజాని ఆస్వాదించలేం.. అందుకే అప్పుడప్పుడూ కొన్ని సాహసాలు చేస్తేనే లైఫ్‌లో అసలు సిసలైన మాధుర్యాన్ని సొంతం చేసుకోగలం. అందుకే మన చుట్టూ సాహసాలంటే ఇష్టపడే వ్యక్తులుండాలంటున్నారు నిపుణులు. ఇలా వీరితో సావాసం చేయడం వల్ల మనమూ మన జీవితంలో సాహసాలు చేయడానికి వెనకాడం.. అంతేకాదు.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇలాంటి వారు మనల్ని ప్రభావితం చేస్తారట! తద్వారా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నెట్టుకురావడం, కీలక నిర్ణయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా నిర్ణయించుకోవడం మనకు అలవడుతుంది. తద్వారా కఠిన పరిస్థితుల్లోనూ సానుకూలంగా ముందుకు సాగచ్చు.

వీరితో పాటు నిజాయతీగా ఉండే వారు, ప్రతి విషయంలోనూ మనల్ని ప్రోత్సహించేవారు.. మన చుట్టూ ఉంటే అలాంటి వారి నుంచి జీవితానికి సంబంధించి బోలెడన్ని విషయాలు మనకు అవగతమవుతాయి. తద్వారా నెగెటివ్‌ ఆలోచనల్ని పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో అడుగు ముందుకేయచ్చు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్