Period Pal అలాంటి అమ్మాయిల కోసమే ఈ యాప్
close
Updated : 07/12/2021 20:03 IST

Period Pal: అలాంటి అమ్మాయిల కోసమే ఈ యాప్!

నెలసరి.. సక్రమంగా వస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటామో.. క్రమం తప్పితే అన్నే అనారోగ్యాల బారిన పడతాం. అందుకే నెలనెలా పిరియడ్స్‌ సక్రమంగా వస్తున్నాయో, లేదో చెక్‌ చేసుకోవడం తప్పనిసరి అంటోంది బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ విషయం తెలుసుకోవడానికే ఓ సరికొత్త యాప్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. పిరియడ్‌ ట్రాక్‌ చేయడం దగ్గర్నుంచి నెలసరి సమస్యలకు నిపుణులచే సలహాలిప్పించడం దాకా.. నెలసరి ఆరోగ్యం గురించిన ప్రతి విషయాన్నీ అమ్మాయిలు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చంటోందీ బాలీవుడ్‌ అందం.

మహిళలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడడం, ఈ క్రమంలో పలు సమస్యలకు సలహాలివ్వడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది తాప్సీ. ఈ నేపథ్యంలోనే నెలసరి సమస్యలు, దీనిపై నెలకొన్న అపోహలపై ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఈ ముద్దుగుమ్మ.. ఇవే విషయాల్ని ‘Period Pal’ అనే యాప్‌ రూపంలో అందరి ముందుకు తెచ్చింది.

యాప్‌లో ఏమేముంటాయి?

‘LAIQA’ అనే పిరియడ్‌ కేర్‌ బ్రాండ్‌తో కలిసి ఈ యాప్‌ను ప్రారంభించింది తాప్సీ. ప్రస్తుతం దీనికి ఛీఫ్‌ ఇన్నొవేషన్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె దీని ద్వారా నెలసరి, నెలసరి సమస్యలకు సంబంధించిన బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చంటోంది.
‘నెలసరి పరిశుభ్రత, ఆ సమయంలో వాడే ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ చాలా చోట్ల పాత కాలపు పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతున్నాయి. వీటికి చెక్‌ పెట్టడానికే ఈ యాప్‌ని రూపొందించాం. పిరియడ్స్‌ ఎప్పుడొస్తాయి? ఆ సమయంలో కనిపించే శారీరక లక్షణాలేంటి? అండం విడుదలయ్యే రోజులు (Ovulation Cycles).. వంటివన్నీ ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా నెలసరి గురించి ముందస్తు సూచనలుంటే ఆయా ఉత్పత్తులు ముందుగానే కొని వెంట ఉంచుకోవచ్చు.. తద్వారా అసౌకర్యం ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

అలాగే నెలసరి సక్రమంగా రాకపోయినా లేదంటే ఈ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైనా నిపుణుల సలహాలు, సూచనలు పొందచ్చు. అంతేకాదు.. నెలసరి తీసుకొచ్చే మూడ్‌ స్వింగ్స్‌, ఇతర మానసిక ఒత్తిళ్లకూ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. ఇక ఈ యాప్‌లో ఉండే Taapsee's Corner ద్వారా ఒకరికొకరం నెలసరికి సంబంధించిన అనుభవాలు పంచుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మాయిలందరికీ ఇదొక నెలసరి నేస్తంలా ఉపయోగపడుతుంది..’ అంటోంది తాప్సీ.

ఆ ‘గుసగుసలు’ తొలగిపోవాలి!

పిరియడ్స్‌ గురించి ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ పలు చోట్ల దీన్ని కళంకంగానే చూస్తున్నారంటోందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చిన్నతనంలో తనకెదురైన పలు చేదు అనుభవాలను ఇలా పంచుకుంది. ‘ఈ సమాజంలో నేటికీ నెలసరిని ఓ కళంకంగానే భావిస్తున్నారు. ఈ సమయంలో చిరాకు పడడం, ఇంట్లో ఉండే పురుషులకు ఈ విషయం తెలియకుండా గోప్యంగా ఉంచడం, ఓ గదికే పరిమితమవడం.. ఈ రోజుల్లోనూ కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. నా చిన్నతనంలో నాకూ ఇలాంటి చేదు అనుభవాలు బోలెడున్నాయి. ఆ ఐదు రోజులు ఇతరులతో అంటీ ముట్టనట్టు ఉండడం, గదిలో బందీ అవడం, పదే పదే డ్రస్‌ వెనక భాగాన్ని చెక్‌ చేసుకోవడం.. ఇవన్నీ నేనేదో నేరం చేశానేమోనన్న భావనలోకి నన్ను నెట్టేసేవి.

ఇక కడుపునొప్పిని అజీర్తి సమస్యలంటూ కవర్‌ చేయడం, నెలసరిలో ఉన్నానని చెప్పడానికి విచిత్రమైన కోడ్‌ పేర్లను ఉపయోగించడం.. వంటివి చేసేవాళ్లం. దీనివల్ల నెలసరికి సంబంధించిన ఎన్నో అనారోగ్యాలు, సమస్యలు కూడా గోప్యంగానే ఉండేవి. తద్వారా మనకే నష్టం. అందుకే ఈ గుసగుసలకు స్వస్తి పలికి నెలసరి సమస్యల గురించి నిర్మొహమాటంగా అందరితో పంచుకోవాలి. పిరియడ్స్‌ని సాధారణమైన అంశంగా పరిగణించాలి.. అప్పుడే దీనిపై ఉన్న అపోహలు, వివక్ష.. వంటివన్నీ తొలగిపోతాయి..’ అంటోందీ సొట్టబుగ్గల బ్యూటీ.

కూతురి సమస్యే పరిష్కారం చూపింది!

తాప్సీ ప్రారంభించిన ఈ పిరియడ్‌ పాల్‌ యాప్‌లో LAIQA అనే బ్రాండ్‌ భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీకి మోనికా బింద్రా సహ వ్యవస్థాపకురాలిగా కొనసాగుతున్నారు. తన స్నేహితులు నజీష్‌ మిర్‌, అలీ మిర్‌లతో కలిసి ఈ నెలసరి బ్రాండ్‌ను ప్రారంభించారు మోనిక. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా పర్యావరణహిత శ్యానిటరీ ప్యాడ్స్‌, ఇతర నెలసరి ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైంది ఈ సంస్థ. 

‘నిజానికి LAIQA ప్రారంభించడానికి నా కూతురే కారణం అని చెప్తా. ఎందుకంటే తను నెలసరి సమయంలో ఎదుర్కొన్న పలు సమస్యలు చూసి నా మనసు చలించిపోయేది. ఇదే విషయం గురించి నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే.. వాళ్లూ తమ కూతుళ్ల సమస్యల్ని చెప్పేవారు. అప్పుడనిపించింది.. నా కూతురిలాగే ఎంతోమంది నెలసరి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని! ఇందుకు కారణం ఈ సమయంలో వాడే వివిధ రకాల పిరియడ్‌ ఉత్పత్తులే అని అర్థమైంది. వీటికి చరమగీతం పాడడానికే పర్యావరణహిత ఉత్పత్తుల్ని రూపొందిస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి, ఈ సమయంలో వాడే శ్యానిటరీ న్యాప్‌కిన్లపై అవగాహన పెంచడానికి ‘Buy one Donate one’ అనే స్కీమ్‌ని కూడా తీసుకొచ్చాం..’ అంటున్నారు మోనిక.

నిజానికి నెలసరిపై ఎంతమంది సెలబ్రిటీలు ఎన్ని రకాలుగా అవగాహన పెంచుతున్నా.. ఆరోగ్యకరమైన ఉత్పత్తులెన్నో అందుబాటులోకొస్తున్నా.. ఇంకా చాలామంది దీన్నో అసాధారణ విషయంగానే పరిగణిస్తున్నారనడంలో సందేహం లేదు. మరి, ఇలాంటి సమయంలో నెలసరిపై ఉన్న అపోహల్ని, దూరం చేయాలంటే ఏం చేయాలి? మీ అమూల్యమైన అభిప్రాయాల్ని, సలహాల్ని మాతో పంచుకోండి!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని