Tabu: అందుకే ఆయన పేరు చేర్చుకోలేదు!

అందాల తారల వృత్తిగత జీవితం తెరచిన పుస్తకం.. అయితే తమ వ్యక్తిగత విషయాల గురించి మాత్రం బయటకు పంచుకోవడానికి కొంతమంది అంతగా ఆసక్తి చూపరు. అందాల తార టబు కూడా అంతే! భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా పేరుగాంచిన ఆమె.. తన వ్యక్తిగత విషయాల్ని చాలా అరుదుగా.....

Published : 05 Nov 2022 12:24 IST

(Photos: Instagram)

అందాల తారల వృత్తిగత జీవితం తెరచిన పుస్తకం.. అయితే తమ వ్యక్తిగత విషయాల గురించి మాత్రం బయటకు పంచుకోవడానికి కొంతమంది అంతగా ఆసక్తి చూపరు. అందాల తార టబు కూడా అంతే! భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా పేరుగాంచిన ఆమె.. తన వ్యక్తిగత విషయాల్ని చాలా అరుదుగా పంచుకుంటుంటుంది. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సూపర్ సీక్రెట్‌ని ఇటీవల బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ ఎవర్‌గ్రీన్ బ్యూటీ పుట్టినరోజు నేడు! ఈ సందర్భంగా టబు.. తన జీవితం గురించి వివిధ సందర్భాల్లో పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

అమ్మతోనే అనుబంధం!

సాధారణంగా అమ్మాయికి నాన్నతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది.. కానీ నాకు మా అమ్మ రిజ్వానాతో, అమ్మమ్మతోనే అనుబంధం ఎక్కువ. నాకు మూడేళ్లున్నప్పుడు అమ్మానాన్న విడిపోయారు. ఆ తర్వాత అమ్మ నన్ను, అక్కను తీసుకొని హైదరాబాద్‌లోని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేసింది. మేం అక్కడే పెరిగాం. నా చిన్నతనం ఓ మధుర జ్ఞాపకం. అమ్మ ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఇక ఇంటికొచ్చాక మాతో ఎక్కువగా సమయం గడిపేది. మా అమ్మమ్మకు దైవభక్తి ఎక్కువ. పుస్తకాలు బాగా చదివేవారు. తనతో ఉండడం వల్ల నాకూ ఇవి అలవడ్డాయి. చిన్నతనం నుంచీ నేను చాలా సిగ్గరిని. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నటినయ్యాక కూడా!


స్కూల్లోనూ ఆ పేరే!

నా అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. కానీ ఆ పేరు నేను ఎక్కడా వాడను. పైగా ఈ పేరు (హష్మి - తండ్రి ఇంటి పేరు) నా జీవితంలో అంత ముఖ్యమని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అందుకే నా పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా అనే చెప్తా. స్కూల్లో కూడా ఫాతిమానే నా ఇంటి పేరుగా రాయించుకున్నా. మా నాన్నతో నాకు ఎలాంటి జ్ఞాపకాలు లేవు. ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. నేను ఇలా ఉండడానికే ఇష్టపడతా. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. జీవితంలో పూర్తిగా స్థిరపడ్డా. మా కుటుంబంలో ఆడపిల్లల సంఖ్య ఎక్కువ. అందరూ ధైర్యవంతులు, ధీశాలులు. బహుశా.. అదే నాలో స్వతంత్ర భావజాలాన్ని పెంచిందేమో అనిపిస్తుంది.


అతడి వల్లే సింగిల్‌గా ఉన్నా!

నేను, అజయ్‌ (అజయ్‌ దేవ్‌గణ్) చిన్ననాటి స్నేహితులం. నా కజిన్‌ సమీర్‌ ఆర్యకు ప్రాణ స్నేహితుడాయన. అలా మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అయితే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు సమీర్‌, అజయ్‌ నాపై నిఘా పెట్టేవారు. ఏ అబ్బాయి నాతో మాట్లాడినా పట్టుకొని కొట్టేవారు. ఇలా వీళ్లిద్దరూ నన్ను ఇబ్బంది పెట్టేవారు. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నానంటే అందుకు కారణం అజయే! తను చేసిన పొరపాటుకు ఆ తర్వాతైనా పశ్చాత్తాపపడ్డాడని అనుకుంటున్నా. నా దృష్టిలో పెళ్లి కాకుండా తల్లవడం తప్పు కాదు. కానీ పిల్లలను ఉద్దేశపూర్వకంగా తమ తల్లిదండ్రుల నుంచి వేరు చేయకూడదు.


పూర్తి శాకాహారిని!

నేను నటించిన ‘చీనీ కమ్’ సినిమా మీరు చూసే ఉంటారు. అందులో నాన్‌వెజ్‌ అంటే పడి చచ్చిపోయే పాత్ర నాది. ముఖ్యంగా చికెన్‌ బిరియానీని బాగా ఇష్టపడతా. ఇది చూసి చాలామంది ‘మీకు మాంసాహారం అంటే అంతిష్టమా?’ అని అడిగారు. కానీ నిజ జీవితంలో నేను పూర్తి శాకాహారిని. మా అమ్మ చికెన్‌ బిరియానీ ఎంతో రుచిగా ప్రిపేర్‌ చేస్తుంది. అయినా సరే.. శాకాహారానికే నా ఓటు.


జుట్టుతో ప్రయోగాలు చేయను!

‘చాలామంది చాలా రకాల హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నిస్తుంటారు.. మీరు మాత్రం ఏ సినిమాలో చూసినా జుట్టు వదిలేయడం లేదంటే పోనీ వేసుకోవడం.. వంటివే చేస్తుంటారు?’ అని చాలామంది అడుగుతుంటారు. జుట్టుతో ప్రయోగాలు చేయడమంటే నాకెందుకో నచ్చదు. అందుకే కొత్త కొత్త హెయిర్‌స్టైల్స్‌కి ప్రాధాన్యమివ్వను. నా పొడవాటి, నల్లని, ఒత్తైన జుట్టు రహస్యమిదే!


భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా..!

కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. నా వంతుగా సమాజానికి కాస్త సమయం కేటాయించడానికి ఇష్టపడతా. అవసరం ఉన్న వారికి కాదనకుండా సహాయం చేస్తుంటా. ప్రస్తుతం ‘రిలీఫ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నా. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న సంస్థ ఇది. నా సంపాదనలో కొంత డబ్బును పలు స్వచ్ఛంద సంస్థలకు, ట్రస్టులకు విరాళమిస్తుంటా.


ఏ పేరుతో పిలిచినా పలుకుతా!

* చిత్ర పరిశ్రమలో నాకు బోలెడన్ని ముద్దుపేర్లున్నాయి. ట్యాబ్స్‌, టబ్స్‌, టబ్బీ, టోబ్లర్‌.. వంటివి అందులో కొన్ని. వీటిలో ఏ పేరుతో పిలిచినా పలుకుతా!

* హిందీ, ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, ఉర్దూ.. వంటి భాషలూ అనర్గళంగా మాట్లాడగలను. హైదరాబాద్‌లో పెరగడం వల్ల ఈ రెండు భాషలపై పట్టు పెరిగింది.

* అలనాటి నటి షబానా అజ్మీకి నేను స్వయానా మేనకోడలిని!

తన నట ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న టబు.. ‘మాచీస్‌’, ‘చాంద్‌నీ బార్‌’ చిత్రాలకు ‘ఉత్తమ నటి’గా రెండు జాతీయ పురస్కారాలు దక్కించుకుంది. 2011లో ‘పద్మ శ్రీ’ పురస్కారం కూడా అందుకుందీ బాలీవుడ్‌ అందం.

హ్యాపీ బర్త్‌డే బ్యూటీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్