Guinness World Record: అతి పెద్ద పాదాలు.. తనవే!

ఇతరుల కంటే మనలో ఏదో ఒక లక్షణం కొత్తగా, విభిన్నంగా ఉంటే.. దాన్ని లోపమనుకుంటామే కానీ.. అదే మన ప్రత్యేకత అనుకునే వారు చాలా అరుదు. అలాంటి అరుదైన అమ్మాయే అమెరికాకు చెందిన తాన్యా హెర్బెర్ట్‌. చిన్నతనం నుంచి వయసుకు మించిన ఎత్తు పెరుగుతూ వచ్చిన ఆమె పాదాలూ పొడవే! అదెంతలా అంటే.. తన పాదం సైజుకు తగ్గట్లుగా మార్కెట్లో....

Published : 18 Nov 2022 13:25 IST

(Photos: Screengrab)

ఇతరుల కంటే మనలో ఏదో ఒక లక్షణం కొత్తగా, విభిన్నంగా ఉంటే.. దాన్ని లోపమనుకుంటామే కానీ.. అదే మన ప్రత్యేకత అనుకునే వారు చాలా అరుదు. అలాంటి అరుదైన అమ్మాయే అమెరికాకు చెందిన తాన్యా హెర్బెర్ట్‌. చిన్నతనం నుంచి వయసుకు మించిన ఎత్తు పెరుగుతూ వచ్చిన ఆమె పాదాలూ పొడవే! అదెంతలా అంటే.. తన పాదం సైజుకు తగ్గట్లుగా మార్కెట్లో పాదరక్షలు వెతికీ వెతికీ ఆఖరికి తానే ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తయారుచేయించుకునేంతగా! ఇక ఇప్పుడు ఆ ప్రత్యేకతే తాన్యాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో ‘అతి పెద్ద పాదాలు కలిగిన మహిళ’గా తాజాగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుందీ అమెరికన్‌ అమ్మాయి. తన అధిక పొడవు, పెద్ద పాదాల కారణంగా తన జీవితంలో తానెదుర్కొన్న పలు సవాళ్లను ఈ సందర్భంగా పంచుకుంది తాన్యా.

అమెరికాలోని హ్యూస్టన్‌ నగరానికి చెందిన తాన్యా ఎత్తు 6’9’’. అంటే ప్రపంచంలోనే జీవించి ఉన్న వారిలో అత్యంత పొడవైన మహిళగా రికార్డు సృష్టించిన రుమెయ్‌సా గెల్గీ (7’ 0.7’’) కంటే.. కేవలం మూడే మూడు అంగుళాలు చిన్నది తాన్యా. ఇక ఆమె తల్లిదండ్రులు కూడా పొడుగరులే! ‘అమ్మ ఎత్తు 6’5’’, ఇక నాన్న 6’4’’ అడుగులుంటారు. కాబట్టి జన్యుపరంగా చూసుకుంటే.. నేనూ వారిలా వయసుకు మించిన ఎత్తు పెరగడంలో ఆశ్చర్యమేముంది?!’ అంటూ నవ్వేస్తోంది తాన్యా.

కోచ్‌లకు అది నచ్చేది కాదు!

అందరిలా కాకుండా.. ఇలా ఎక్కువ ఎత్తున్నా, బరువున్నా స్కూల్లో తోటి పిల్లలు హేళన చేయడం చాలామందికి అనుభవమే! కానీ తన విషయంలో ఇవేవీ జరగలేందంటోంది తాన్యా. ‘నాకు చిన్న వయసు నుంచే ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ విషయమైనా సానుకూలంగానే ఆలోచించేదాన్ని.. స్పందించేదాన్ని. దీనంతటికీ కారణం అమ్మానాన్నలే! ‘అందరికంటే పొడవున్నానని చిన్నబోకు.. ఇదేమీ ప్రతికూల అంశం కాదు.. పైగా ఇది నీ ప్రత్యేకత’ అంటూ పదే పదే వాళ్లు నాలో ఆత్మవిశ్వాసం నింపేవారు. ఇక స్కూల్లో కూడా వేధింపులు, హేళనలకు గురైన సందర్భాలు దాదాపు లేవు. ఇంకా చెప్పాలంటే నా తోటి విద్యార్థులు నన్ను మరింత ప్రేమగా చూసుకునేవారు.. స్నేహం చేసేవారు. అయితే ఎత్తు విషయంలో నాకు ఎదురైన ప్రతికూల సందర్భం ఒకే ఒకటి.. అదీ మా స్కూల్లో పీఈటీల రూపంలో ఎదురైంది. నేను వయసుకు మించిన ఎత్తు పెరగడం వల్ల వాళ్లు ‘నీ ఎత్తు బాస్కెట్‌ బాల్‌ వంటి క్రీడలకు బాగా సరిపోతుంది. కాబట్టి అలాంటి ఆటలు ఎంచుకుంటే రాణించగలవు..’ అంటూ దెప్పిపొడిచేవారు. కానీ నాకేమో ఆటల కంటే చదువంటే ఇష్టం. అందుకే వాళ్ల మాటలు పట్టించుకోకుండా చదువు పైనే పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చింది తాన్యా.

అందుకే పురుషుల చెప్పులేసుకునేదాన్ని!

 ‘నా పాదాలకు సరిపడే చెప్పుల జత కోసం వెతికీ వెతికీ వేసారిపోయేదాన్ని. ఒక్కోసారి టెన్నిస్‌ షూస్‌, పురుషులు ధరించే లోఫర్స్‌.. వంటివి ఎంచుకున్నప్పటికీ అవి స్కూల్‌ డ్రస్‌, ఇతర ఫ్యాన్సీ దుస్తుల పైకి నప్పకపోయేవి. అయినా అయిష్టంగానే వేసుకునేదాన్ని. నేనే కాదు.. ఇలా పొడవాటి పాదాలున్న మహిళలూ చెప్పుల సైజు విషయంలో పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న విషయం సోషల్‌ మీడియాలో చేరాకే నాకు అర్థమైంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత అవసరాల రీత్యా పాదరక్షలు తయారుచేయించుకోవచ్చన్న విషయమూ అవగతమైంది. ఇక అప్పట్నుంచి నాకు నప్పేలా పాదరక్షలు తయారుచేయించుకుంటున్నా.. చాలామంది అబ్బాయిలు ‘మీ పొడవాటి పాదాల ఫొటోలు అమ్మి డబ్బు సంపాదించచ్చు కదా!’ అని అడుగుతుంటారు. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు.. నా పోస్టులతో ఈ వేదిక ద్వారా సానుకూల దృక్పథం నింపడం, స్ఫూర్తి రగిలించడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటోంది తాన్యా.

ఏడాదిలో 74 కిలోలు తగ్గా!

ఎత్తు, పాదాల విషయంలోనే కాదు.. తాన్యా బరువూ ఎక్కువే! దీనివల్ల భవిష్యత్తులో ఇతర అనారోగ్యాలు ఎదురవుతాయేమోనన్న ముందు చూపుతోనే కిలోల కొద్దీ బరువు తగ్గానంటోందామె.

‘నా జీవితంలో ప్రతికూల సమయం ఏదైనా ఉందంటే అది 2021. ఎందుకంటే అప్పటికి నేను 250 కిలోలున్నా. ఇక అదే ఏడాది మా అమ్మ క్యాన్సర్‌తో కన్నుమూసింది. ఆ బాధలోనే బరువు తగ్గి ఫిట్‌గా మారాలని నిర్ణయించుకున్నా. నాకు సహజంగానే ముందు చూపు ఎక్కువ. ఈ అధిక బరువు వల్ల భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు చుట్టుముట్టకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ క్రమంలో గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ కూడా చేయించుకున్నా. నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇదీ ఒకటి. దీనికి తోడు వైద్యుల సలహా మేరకు ఆహార, వ్యాయామ నియమాల్లో మార్పులు చేసుకొని ఏడాది తిరిగేసరికి సుమారు 74 కిలోలు తగ్గా. ప్రస్తుతం మరికొన్ని కిలోలు తగ్గే పనిలో బిజీగా ఉన్నా. ఇది భావోద్వేగాలతో కూడిన ప్రయాణమే అయినా క్రమంగా ఒక్కో లక్ష్యాన్ని చేరుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా రెట్టింపు చేసింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ అమెరికన్‌ లేడీ.

నేను కోరుకునేది అదొక్కటే!

తనలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రేమిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోన్న తాన్యా.. తాజాగా ‘అతి పెద్ద పాదాలు కలిగిన మహిళ’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్లో చోటు సంపాదించింది. ఈ క్రమంలో ఆమె కుడి పాదం పొడవు 33.1 సెం.మీ. (13.03 అంగుళాలు), ఎడమ పాదం పొడవు 32.5 సెం.మీ. (12.79 అంగుళాలు)గా నమోదయ్యాయి. ‘నాకొచ్చిన ఈ గుర్తింపు చూశాకనైనా.. షూ/పాదరక్షలు తయారుచేసే సంస్థలు ఓ అడుగు ముందుకు వేయాలి. నాలాంటి పొడవైన పాదాలున్న మహిళల సమస్యల్ని అర్థం చేసుకొని.. వారి కోసం ప్రత్యేకమైన సైజుల్లో చెప్పులు రూపొందించాలి.. నేను కోరుకునేది ఇదొక్కటే!’ అంటూ తన నిస్వార్థమైన మనసును మరోసారి బయటపెట్టిందీ గిన్నిస్‌ క్వీన్.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్