మీ అమ్మాయి అలా కాకూడదంటే..!

తమ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కలలు కంటుంటారు. ఇందుకోసం చెమటోడ్చి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అయితే పిల్లలు ప్రయోజకులుగా మారాలంటే చదువుతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు....

Published : 20 Mar 2024 13:24 IST

తమ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కలలు కంటుంటారు. ఇందుకోసం చెమటోడ్చి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అయితే పిల్లలు ప్రయోజకులుగా మారాలంటే చదువుతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అమ్మాయిలకు చదువుతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని చెబుతున్నారు.

అమ్మాయితో చర్చించండి..
మన దేశంలో చాలామంది మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తమ భర్తపై ఆధారపడుతుంటారు. దానివల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే నేటి తరం అమ్మాయిలు ఉద్యోగం పొందకముందే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని తీర్చిదిద్దడం అవసరం. దీనికోసం ఇంట్లో జరిగే ఆర్థిక చర్చల్లో వారిని భాగం చేయండి. ఫలితంగా వారికి ఆర్థిక ప్రణాళిక, పన్నులు, ఖర్చులు వంటి వివరాలపై అవగాహన వస్తుంది. ఆర్థికపరమైన విషయాల గురించి మీ అమ్మాయితో చర్చించండి. అలాగే పొదుపు చేసేలా, సొంతంగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల స్నేహితులు, భవిష్యత్తులో భర్తతో కూడా ఆర్థిక విషయాలను స్వేచ్ఛగా, సాధికారికంగా మాట్లాడగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

డబ్బు విలువ తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఆనందం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, వారికి అడిగిందల్లా కొనివ్వడం చేస్తున్నారు. ఫలితంగా వారికి డబ్బు విలువ తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇది వారి భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి, పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసేలా చేయాలంటున్నారు నిపుణులు. దీనికోసం వారు చేయగలిగే కొన్ని పనులను అప్పగించండి. సరిగా చేస్తే బహుమతిగా కొంత నగదు ఇవ్వండి. ఒకవేళ పనిలో నాణ్యత లేకపోతే తక్కువ డబ్బు ఇవ్వండి. దీనివల్ల డబ్బులు సులభంగా రావనే విషయం వారికి తెలిసే అవకాశం ఉంటుంది. ఫలితంగా వారు డబ్బుకు విలువివ్వడం మొదలుపెడతారు.

ఆ వ్యత్యాసాన్ని తెలియజేయండి..
ఆశకి, అవసరానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అది తెలిస్తే ఎవరైనా తమ ఖర్చులను అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఇదే విషయాన్ని చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు చేసే ఖర్చును వారే అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం మీ అమ్మాయి ఏదైనా వస్తువు కొనమని అడిగితే అది తప్పనిసరిగా కావాలా? లేకపోయినా పర్లేదా? అని అడిగి నిర్ణయం తీసుకోండి. ఇదే పద్ధతిని మీ అమ్మాయికి క్రమంగా అలవాటు చేయండి. ఈవిధంగా ఆలోచించడం వల్ల వారు భవిష్యత్తులో బలమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

చిన్నప్పటి నుంచే..!
కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం సంపాదించిన తర్వాత షాపింగ్ పేరుతో విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు క్రెడిట్‌ కార్డులను ఇష్టం వచ్చినట్లు వాడేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు అప్పుల ఊబిలోకి దించుతాయి. ఆర్థిక అస్థిరత్వానికి దారితీస్తాయి. కాబట్టి, పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే వివరించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపును అలవాటు చేసే కొన్ని రకాల యాప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి గురించి కూడా వారికి తెలియచేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్