తల్లిగా అప్పుడెంతో తల్లడిల్లిపోయాం..!
అమ్మయ్యే క్రమంలో పలు సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి.. ఒక్కోసారి అంతా సవ్యంగానే సాగుతుందనుకున్నా.. కొంతమందికి సడన్‌గా అబార్షన్ అవ్వచ్చు. నెలలు నిండి బిడ్డ పుట్టాక.. పాపాయిలో అనుకోని సమస్యేదైనా తలెత్తచ్చు.
(Photos: Instagram)
అమ్మయ్యే క్రమంలో పలు సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి.. ఒక్కోసారి అంతా సవ్యంగానే సాగుతుందనుకున్నా.. కొంతమందికి సడన్‌గా అబార్షన్ అవ్వచ్చు. నెలలు నిండి బిడ్డ పుట్టాక.. పాపాయిలో అనుకోని సమస్యేదైనా తలెత్తచ్చు. నిజానికి అమ్మగా ఇలాంటి విషయాల్ని జీర్ణించుకోవడం కష్టమే! పైగా ఇలాంటి సున్నితమైన విషయాల గురించి ఇతరులతో పంచుకోవడమంటే గుండె బరువెక్కుతుంటుంది. అయినా ధైర్యం చేసి మరీ.. తమ జీవితంలో జరిగిన ఈ విషయాల గురించి నలుగురితో పంచుకోవడానికి ఇటీవలే ముందుకొచ్చారు కొందరు తారలు. మరి, వాళ్లెవరు? అమ్మగా తమ జర్నీలో తమకెదురైన చేదు అనుభవాల గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..
అయిదో నెలలో అబార్షన్ - రాణీ ముఖర్జీ
దర్శకనిర్మాత ఆదిత్య చోప్రాను 2014లో వివాహం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీ. మరుసటి ఏడాది అధిరా అనే పాపకు జన్మనిచ్చిందీ జంట. నిజానికి తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడే వీరు.. తమ కూతురినీ కెమెరా కంటికి దూరంగా ఉంచుతుంటారు. అయితే ఇటీవలే మెల్‌బోర్న్‌లో జరిగిన ‘భారతీయ చిత్రోత్సవం’లో పాల్గొన్న రాణి.. తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన గురించి బయటపెట్టింది. కరోనా సమయంలో తాను రెండోసారి గర్భం ధరించినా అది నిలవలేదని చెప్పుకొచ్చింది.
‘నాకు జరిగిన అబార్షన్ గురించి పంచుకోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. అయితే ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి కూడా నలుగురితో పంచుకోవడం, చర్చించుకోవడం సర్వసాధారణమైపోయింది. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. 2020లో కరోనా సమయంలో నేను రెండోసారి గర్భం దాల్చాను. దురదృష్టవశాత్తూ అయిదో నెలలోనే నాకు గర్భస్రావం అయింది. ఆపై సరిగ్గా పది రోజుల తర్వాత ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా అవకాశం వచ్చింది. ఆ చిత్ర నిర్మాత నిఖిల్ అడ్వాణీ నాకు ఫోన్ చేసి ఈ సినిమా కథ చెప్పారు. నేనూ వెంటనే ఓకే చేశా. ఎందుకంటే అప్పటికే అబార్షన్ బాధలో ఉన్న నేను.. అమ్మతనం అనే కథాంశంతో అవకాశం రావడంతో వెంటనే కనెక్ట్ అయిపోయా..’ అంది రాణి. తమ పిల్లల కస్టడీ కోసం భారత్ నుంచి నార్వేకు వలస వెళ్లిన ఓ తల్లి నార్వే ప్రభుత్వంతో పోరాడే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.
అధిరా ప్రిమెచ్యూర్ బేబీ!
అయితే ఇటీవలే కరీనా కపూర్ టాక్ షో ‘వాట్ విమెన్ వాంట్’లో పాల్గొన్న రాణి.. తన కూతురు అధిరాకు సంబంధించిన మరో విషయాన్ని పంచుకుంది.
‘అబార్షన్ సమయంలోనే కాదు.. అధిరా పుట్టినప్పుడూ నేను, ఆది (రాణి భర్త) ఇలాంటి కఠిన సమయాన్నే ఎదుర్కొన్నాం. తను ప్రిమెచ్యూర్ బేబీ. ప్రసవ తేదీ కంటే రెండు నెలలు ముందుగానే పుట్టింది. అప్పుడు చేతుల్లో ఇమిడిపోయేంత చిన్నగా ఉంది. NICUలో 15 రోజులుంచాలన్నారు వైద్యులు. కానీ తన ఎదుగుదల చూసి ఏడు రోజుల్లోనే పాపను మాకు అప్పగించారు. అధిరా పుట్టాక 14 నెలలకు ‘హిచ్కీ’ చిత్ర షూటింగ్‌కి వెళ్లాను. ఆ సమయంలో పాపను ఇంట్లో వదిలి వెళ్లడం చాలా బాధగా అనిపించింది. తిరిగి ఇంటికొచ్చాక తనను చూస్తే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించేది. తనను ఓ సెలబ్రిటీ కిడ్‌గా కాకుండా సింపుల్‌గానే పెంచుతున్నాం. తనకు ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించాలనుకుంటున్నాం.. ఇక అమ్మయ్యాక నాలో ఓపిక, అర్థం చేసుకునే తత్వం పెరిగాయి. ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం నేర్చుకున్నా..’ అంటూ అమ్మగా తన అనుభవాల్ని పంచుకుంది రాణి.
ఏ తల్లికీ ఆ కష్టం రాకూడదు! - బిపాసా బసు
తమకు పాపే పుట్టాలని కోరుకున్న బాలీవుడ్ కపుల్ బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ జంట గతేడాది నవంబర్‌లో తల్లిదండ్రులయ్యారు. వారు అనుకున్నట్లుగానే దేవి అనే పాపకు జన్మనిచ్చారీ క్యూట్ కపుల్. అయితే పాప పుట్టినందుకు సంతోషంగా ఉన్నా.. పుట్టుకతోనే తనకున్న ఓ ఆరోగ్య సమస్య తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని ఇటీవలే ఓ వీడియోలో చెప్పుకొచ్చింది బిప్స్.
‘అమ్మతనం జీవితంలో ఎన్నో మధురానుభూతుల్ని మోసుకొస్తుంది. అయితే నేను అమ్మయ్యాక కొన్ని కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. దేవి పుట్టాక.. అందరు తల్లిదండ్రుల్లా మా జర్నీ సాఫీగా ముందుకు సాగలేదు. నిజానికి అదో క్లిష్ట సమయం. ఎందుకంటే కొత్తగా తల్లయ్యాక.. పుట్టుకతోనే బిడ్డలో ఆరోగ్య సమస్య ఉందని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు! దేవి పుట్టిన మూడు రోజులకు తనకు గుండెలో రెండు రంధ్రాలున్నాయన్న విషయం తెలిసింది. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (VSD) వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు వైద్యులు. నిజానికి VSD అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఇక దీని గురించి కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కి ఎవరికీ చెప్పలేదు.
నెలనెలా స్కాన్ చేయించాలన్నారు డాక్టర్లు. ఒకవేళ ఆ రంధ్రాలు వాటంతటవే పూడుకుపోతే సరే సరి.. లేదంటే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఒక రంధ్రం పెద్దగా ఉండడంతో దేవికి మూడు నెలల వయసులో సర్జరీ చేయించక తప్పలేదు. అయితే ఈ సమయంలో నేను ధైర్యంగానే ఉన్నా.. కరణ్ భయపడ్డాడు.. సర్జరీకి ఒప్పుకోలేదు. ఎటూ తేల్చుకోలేని ఇలాంటి కఠిన పరిస్థితుల్ని ఎలా దాటామో తలచుకోవడానికే బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు! ఇక సర్జరీ పూర్తయిన 40 రోజులు రాత్రింబవళ్లు పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. ఇలా దేవి పుట్టాక తొలి ఐదు నెలలు మా జీవితంలో అత్యంత క్లిష్టంగా గడిచిపోయాయి’ అందీ అందాల అమ్మ. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉందంటూ.. ఎప్పటికప్పుడు తన పాపాయికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారీ క్యూట్ కపుల్.
అబార్షన్ అయిన మరుసటి రోజే..! - స్మృతీ ఇరానీ
నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన వ్యక్తిగత విషయాల్నీ ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి వెనకాడరు. బుల్లితెరపై ‘క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ’ అనే సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్న స్మృతి.. ఈ షూటింగ్ సమయంలోనే తనకు అబార్షన్ అయిందని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకున్నారు.
‘అప్పుడు నేను క్యూంకీ సీరియల్ చిత్రీకరణలో పాల్గొంటున్నా. నిజానికి ఆ సమయంలో నేను గర్భవతినన్న విషయం నాకే తెలియదు. సెట్‌లో ఉన్నప్పుడే ఒంట్లో నలతగా అనిపించడంతో ఇంటికెళ్దామనుకున్నా. అప్పటికే సాయంత్రం కావడంతో.. డాక్టర్‌కి ఫోన్ చేస్తే సోనోగ్రఫీ చేయించుకోమన్నారు. అదే సమయంలో బ్లీడింగ్ మొదలైంది. వర్షంలోనే ఆటో ఎక్కి ఆస్పత్రికి వెళ్లాను. ఓ నర్సు నా సమస్యను గుర్తించి నన్ను వెంటనే ఆస్పత్రిలో చేరమంది. అయితే నా పరిస్థితి తెలుసుకొని మరుసటి రోజు షూటింగ్‌కి రావద్దన్నారు దర్శకుడు రవి చోప్రా. కానీ ఈఎంఐ, ఇతర ఆర్థిక అవసరాల రీత్యా.. అబార్షన్ అయిన మరుసటి రోజే షూటింగ్‌కి వెళ్లక తప్పలేదు..’ అంటూ ఆనాటి చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు స్మృతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.