Celebrity Talk: యోగా.. శరీరాన్నే కాదు.. మా జీవితాన్నీ మార్చేసింది..!

యోగా.. కొంతమందికి అది వ్యాయామం అయితే.. మరికొందరికి జీవన శైలి..! అయితే యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించి.. దీన్ని తమ జీవన శైలిగా మార్చుకొన్నవారు....

Published : 22 Jun 2023 13:04 IST

(Photos: Instagram)

యోగా.. కొంతమందికి అది వ్యాయామం అయితే.. మరికొందరికి జీవన శైలి..! అయితే యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించి.. దీన్ని తమ జీవన శైలిగా మార్చుకొన్నవారు ఎందరో ఉంటారు. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సెలబ్రిటీలు! యోగా వల్ల తమ శరీరాన్నే కాదు.. జీవితాన్ని కూడా మార్చుకున్న కొందరు ముద్దుగుమ్మల గురించి ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

శిల్పా శెట్టి

ఈ బాలీవుడ్ బ్యూటీ ఎన్నో ఏళ్లుగా యోగా సాధన చేస్తోంది. తన సౌందర్యానికి, చురుకుదనానికి ఇదే కారణమని చెబుతోంది. అయితే కొన్నేళ్ల క్రితం సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యతో బాధపడింది శిల్ప. ఈ సమయంలోనే యోగా తన సమస్యను తగ్గిస్తుందని భావించిన ఆమె.. దాన్ని సాధన చేయడం ప్రారంభించింది. అనుకున్నట్లే తన ఆరోగ్య సమస్య తగ్గడంతో.. ఆపై దాన్ని తన జీవనశైలిలో భాగం చేసుకుంది. వెయిట్ ట్రైనింగ్ కూడా చేసే శిల్ప.. రిలాక్స్ అవ్వడానికి ఈ ట్రైనింగ్ సెట్స్ మధ్య కూడా యోగా సాధన చేస్తుంటుందట. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి యోగా మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెప్పే ఈ బ్యూటీ.. తన పిల్లలకూ చిన్నతనం నుంచే యోగా నేర్పిస్తోంది.


అనుష్క

టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ యోగా అని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే! అయితే సినిమాల్లోకి రాకముందు యోగా గురువుగా పనిచేసిందీ అందాల భామ. ఆమె ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద యోగాలో శిక్షణ తీసుకుంది. దీనివల్ల జీవితంలో ఎంతో ప్రశాంతత దొరుకుతుందని గ్రహించిన ఆమె యోగా గురువుగా మారాలని నిర్ణయించుకుంది. యోగా తన జీవితాన్ని మార్చేసిందని, దాన్ని నలుగురికీ నేర్పించాలని నిర్ణయం తీసుకోవడం.. తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటని చెబుతుంటుందీ ముద్దుగుమ్మ. సినిమాలతో బిజీగా ఉన్నా.. ఇప్పటికీ రోజూ తప్పనిసరిగా యోగా చేసే ఆమె తన ప్రశాంతమైన జీవితానికి, సానుకూల దృక్పథానికి యోగానే కారణమంటుంది.


బిపాసా బసు

ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం ప్రారంభించిన బిపాసా.. ఫిట్‌నెస్‌ని తన జీవన శైలిగా మార్చుకుంది. ముఖ్యంగా యోగా అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ‘చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు రావడంతో నేను యోగా గురించి తెలుసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత దీన్ని నా జీవనశైలిలో భాగం చేసుకున్నా. యోగా ఒక్కొక్కటిగా నా ఆరోగ్య సమస్యలన్నింటినీ తగ్గించి, నన్ను పూర్తి ఫిట్‌గా మార్చింది. ఈ క్రమంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. అంతేకాదు.. యోగా బరువునూ అదుపులో ఉంచుతుంది. అందానికీ ఇది దివ్యౌషధం. పూర్తిగా యోగాసనాలన్నీ సాధన చేయలేని వారు కనీసం ప్రాణాయామం చేయగలిగినా చాలు.. రోజులో ఇరవై నిమిషాల పాటు మంద్రస్థాయి సంగీతం పెట్టుకొని మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ యోగా వల్ల తనకు చేకూరిన ప్రయోజనాలను ఓ సందర్భంలో పంచుకుంది బిప్స్‌. గతేడాది నవంబర్‌లో ‘దేవి’ అనే పాపకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తన ప్రసవానంతర బరువును తగ్గించుకోవడానికి ఇతర వ్యాయామాలతో పాటు యోగానూ సాధన చేస్తున్నానంటోంది.


కరీనా కపూర్

ఒకప్పుడు బొద్దుగా ఉండే కరీనా.. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి బరువు తగ్గింది. ఆ తర్వాత ‘తషాన్’ సినిమా సమయంలో సైజ్ జీరోకి తగ్గి.. అమ్మాయిలందరికీ కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌ని పరిచయం చేసింది. తన ఫిట్‌నెస్‌కి కారణం యోగానే అంటుందీ బ్యూటీ.. నిజానికి నాజూగ్గా మారడానికి తను యోగా ప్రారంభించలేదట! ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ద్వారా తెలుసుకున్న కరీనా.. దాన్ని సాధన చేయడం ప్రారంభించినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. రోజూ సూర్యనమస్కారాలు, 45 నిమిషాల పాటు ఇతర యోగాసనాలు చేస్తుందట ఈ బ్యూటీ. అంతేకాదు.. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడేలా కపాలభాతి ప్రాణాయామం చేయడం కరీనాకు అలవాటట! ఈ యోగా వల్ల తన రోజంతా చురుగ్గా ఉంటుందని, ఒక్కరోజు ఏదైనా కారణం వల్ల దీన్ని చేయలేకపోతే.. ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుందంటోంది బెబో. ఇక తాను గర్భిణిగా ఉన్న సమయంలోనూ ప్రి-నాటల్‌ యోగా చేస్తూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందీ అందాల అమ్మ.


లారా దత్తా

ఎన్నో ఏళ్లుగా యోగా ప్రాక్టీస్ చేస్తోంది లారా. తన ఆరోగ్యాన్ని కాపాడేందుకు, సి-సెక్షన్ తర్వాత తిరిగి కొన్ని రోజుల్లోనే ఫిట్‌గా మారేందుకు యోగానే ఉపయోగపడిందని ఓ సందర్భంలో పంచుకుంది లారా. గర్భం దాల్చిన తర్వాత యోగా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎన్నో మంచి ప్రయోజనాలు అందుతాయంటోంది. అంతేకాదు.. సహజ ప్రసవం కావడానికి కూడా ఎక్కువ అవకాశాలుంటాయని.. అందుకే గర్భం దాల్చిన తర్వాత యోగా ఎలా చేయాలి? దానివల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలేంటి? వంటివన్నీ వివరిస్తూ యోగాకు సంబంధించి గతంలో కొన్ని డీవీడీలను కూడా రూపొందించిందీ మిస్‌ యూనివర్స్‌.


సోనమ్ కపూర్

సినిమాల్లోకి అడుగుపెట్టే క్రమంలో బరువు తగ్గి నాజూగ్గా మారడానికి యోగాను మార్గంగా ఎంచుకుంది సోనమ్.. మొదట సాధారణ యోగాతోనే శ్రీకారం చుట్టినా ఆ తర్వాత బిక్రమ్ యోగా అని పిలిచే హాట్ యోగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిందామె. దీని ద్వారా తన బరువు ఎప్పుడూ అదుపులో ఉంటుందని చెప్పే సోనమ్.. దీన్ని ప్రతిరోజూ తప్పక చేస్తుందట. దీంతో పాటు ఏరియల్ యోగా కూడా సోనమ్‌ యోగా లిస్ట్‌లో ఉంటుంది. ఇక గర్భంతో ఉన్నప్పుడూ- తీసుకునే పోషకాహారంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో యోగా సాధన చేస్తూ అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢంగా ఉన్నానంటోంది సోనమ్‌.

ఇక వీరితో పాటు సమంత, రకుల్‌ప్రీత్ సింగ్, శ్రియ, మంచులక్ష్మి తదితర టాలీవుడ్ భామలకు సైతం యోగ సాధన వారి జీవన శైలిలో ఓ భాగం. అందుకే తమ అందానికి, ఆరోగ్యానికి యోగానే కారణమంటారు వీరు. మీరూ ఈ జాబితాలో చేరాలంటే ఇప్పటికైనా యోగా మొదలుపెట్టేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్