Working Women: చిన్న దేశాలే.. మహిళలకు బ్రహ్మరథం పడుతున్నాయి!

మన దగ్గర మహిళలు ఉద్యోగాలు చేయాలంటే ఎన్నో అడ్డంకులు. సరైన ప్రోత్సాహం లేకపోవడం, అవకాశాలు కల్పించకపోవడం, వివక్ష, ఆంక్షలు-విమర్శలు, లింగ అసమానతలు, ఇంటి బాధ్యతలు.. వంటివెన్నో వారి కెరీర్‌ అభివృద్ధికి....

Published : 15 Jun 2023 13:14 IST

మన దగ్గర మహిళలు ఉద్యోగాలు చేయాలంటే ఎన్నో అడ్డంకులు. సరైన ప్రోత్సాహం లేకపోవడం, అవకాశాలు కల్పించకపోవడం, వివక్ష, ఆంక్షలు-విమర్శలు, లింగ అసమానతలు, ఇంటి బాధ్యతలు.. వంటివెన్నో వారి కెరీర్‌ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. పోనీ.. పని ప్రదేశంలోనైనా పనికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా అంటే.. అదీ ప్రశ్నార్థకమే! పని ప్రదేశంలో మహిళల శాతం పెరగకపోవడానికి ఇవే కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. మనమే కాదు.. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి దేశాలకు కొన్ని చిన్న దేశాలు కనువిప్పు కలిగిస్తున్నాయి. మహిళలకు అవకాశాలు కల్పించడమే కాదు.. పని ప్రదేశంలో పురుషులతో సమానంగా మహిళల సంఖ్యను పెంచడానికి పలు చర్యలూ చేపడుతున్నాయి. మరి, ఇంతకీ ఏయే దేశాల్లో/ప్రాంతాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ? అందుకు దోహదం చేస్తోన్న అంశాలేంటి? తెలుసుకుందాం రండి..

మడగాస్కర్

‘మహిళలే మహిళల్ని ముందుకు నడిపించగలరు’ అంటుంటారు. అదే దేశ సారథి కూడా మహిళే అయితే.. ఆ దేశం మహిళల అభ్యున్నతికి మారుపేరుగా నిలిచే అవకాశం ఉంటుంది. తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్‌ దేశమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! 2.89 కోట్ల జనాభా ఉన్న ఈ చిన్ని దేశానికి మియాలీ రజోలినా అనే మహిళ అధ్యక్షురాలిగా ఉంది. 2019లో ఈ పదవి చేపట్టిన ఆమె.. ఆ దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలికలకు విద్యావకాశాలు, మహిళలకు ఉపాధి/ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గతేడాది ‘Girls Learn, Women Earn’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది గతేడాది నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం’తో ప్రారంభమై.. ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ వరకు కొనసాగింది. సుమారు వంద రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా.. బాలికా విద్య, మహిళల ఆర్థిక సాధికారత, లింగ వివక్ష.. ఈ మూడు అంశాలకు ప్రతిబంధకాలుగా మారుతోన్న అంశాలేంటో గుర్తించి.. వాటిని పారదోలే ప్రయత్నం చేశారు. దీంతో పాటు పని ప్రదేశంలో మహిళ లకు సౌలభ్యాలు కల్పించడం, వర్కింగ్‌ మదర్స్‌కి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం పైనా దృష్టి పెట్టారు మియాలీ. ఇవే అక్కడ అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అక్కడ మహిళా ఉద్యోగుల సంఖ్య 83 శాతానికి పైగానే ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


నెదర్లాండ్స్

చాలాదేశాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు అంత విలువ ఉండదు. అందులో నాణ్యతా తక్కువే! జీతమూ అంతంతమాత్రమే! కానీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాన్ని కూడా పూర్తి స్థాయి ఉద్యోగంగా పరిగణిస్తోంది నెదర్లాండ్స్‌ దేశం. ముఖ్యంగా కొత్తగా తల్లైన మహిళలు, ఇంటి బాధ్యతలు-ఇతర కారణాల రీత్యా ఉద్యోగం చేయలేకపోతున్న స్త్రీల కోసం ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తోంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం.. పని ప్రదేశంలో మహిళల ప్రాతినిథ్యం.. వంటి అంశాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆ దేశం విశ్వసిస్తోంది. ఇక పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసే మహిళలకూ వారి పని గంటల్ని బట్టి.. పూర్తి స్థాయి ఉద్యోగాలు చేసే వారితో సమానమైన జీతభత్యాలు చెల్లించడం విశేషం! ప్రస్తుతం అక్కడ 40 శాతానికి పైగా మహిళలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నట్లు.. కొన్ని దేశాలతో పోల్చితే ఈ రేటు అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉద్యోగం చేసే మహిళలకు పలు వెసులుబాట్లు, పనిప్రదేశంలో ఎన్నో సౌలభ్యాలు కల్పిస్తోన్న నెదర్లాండ్స్‌లో మహిళా ఉద్యోగులు 76 శాతానికి పైమాటేనట!


కంబోడియా

ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా-పాలన, గృహ హింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు.. ఇలాంటివి చాలా దేశాల్లో మహిళల కెరీర్‌కు అడ్డుపడుతున్నాయి. తమ దేశంలోనూ ఉన్న ఈ ప్రతిబంధకాలపై కొన్నేళ్ల క్రితం దృష్టి సారించింది కంబోడియా దేశం. భార్యాభర్తల ఉమ్మడి నిర్ణయం మేరకు.. ఇంటి బాధ్యతలు మగవారికి అప్పగించి.. మహిళలు తమ కెరీర్‌పై దృష్టి పెట్టేలా వారిని ప్రోత్సహించింది. పని ప్రదేశంలో వేతన వ్యత్యాసాన్ని తొలగించడం, లైంగిక హింసకు అడ్డుకట్ట వేసేలా పలు పాలసీలు రూపొందించడం.. వంటి విషయాల్లో పాలసీలు రూపొందించింది. బాలికల్ని ఉన్నత విద్యావంతుల్ని చేయడం, మహిళలకు వొకేషనల్‌ ట్రైనింగ్‌ అందించడం, వ్యాపారాల్లో స్త్రీలను ప్రోత్సహించడం, జాతీయ-అంతర్జాతీయంగా మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం.. ఇలా అక్కడి మహిళలు వృత్తిఉద్యోగాల్లో రాణించడానికి పలు చర్యలు తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. ఇవే అక్కడ లింగ సమానత్వానికి తెర తీశాయని, పని ప్రదేశంలో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ విభిన్న రంగాల్లో మహిళా ఉద్యోగుల శాతం 70కి పైమాటే అని నిపుణులు అంటున్నారు.


సోలోమన్‌ ఐల్యాండ్స్

పసిఫిక్‌ మహాసముద్రంలోని వెయ్యి దీవుల సముదాయం ఈ ప్రాంతం. 7.08 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో పురుషుల కంటే మహిళల శాతమే ఎక్కువ. ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం.. ఇక్కడి మహిళల సంఖ్య 4.17 లక్షలు (58 శాతం)గా నమోదైంది. అయితే మహిళల సంఖ్యే కాదు.. ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఇక్కడ ఎక్కువమందే ఉన్నారు. అన్ని రంగాల్లో కలుపుకొంటే ఇక్కడ 84 శాతం కంటే ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి కొన్నేళ్ల క్రితం వరకు ఇక్కడా పురుషాధిపత్య సమాజమే ఉండేది. కానీ పని ప్రదేశంలో మహిళల సంఖ్యను పెంచడానికి, లింగ సమానత్వం సాధించడానికి 2017లో ఆ దేశ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే ‘Waka Mere Program’కు తెరతీసింది. ‘Waka Mere’ అంటే ‘షీ వర్క్స్‌’ అని అర్థం. ‘సోలోమన్ ఐల్యాండ్స్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’, ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ సంయుక్తంగా రెండేళ్ల పాటు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా.. మహిళలు కెరీర్‌ పరంగా రాణించలేకపోవడానికి సామాజిక పరంగా ఉన్న కారణాలు, ఆ వివక్షను అధిగమించే మార్గాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చిందని, పలు కంపెనీలు మహిళలకు అవకాశాలు - పని ప్రదేశంలో సౌలభ్యాలు పెంచాయని, మరికొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఉన్నత స్థానాల్ని కట్టబెట్టాయని.. అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఇలా ఈ కార్యక్రమం ప్రభావం నేటికీ కొనసాగుతోందని, ఫలితంగానే అక్కడ మహిళా ఉద్యోగుల సంఖ్య 84 శాతానికి పెరిగిందని వారంటున్నారు.


ఐస్‌ల్యాండ్

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశమిది. కేవలం 3.73 లక్షల జనాభా ఉన్న ఈ దేశం.. మహిళలకు సానుకూలమైన దేశాల్లో టాప్‌ ర్యాంకులో నిలుస్తుంటుంది. ఇందుకు కారణం.. ఇక్కడ మహిళల అభ్యున్నతి పరంగా సానుకూల చట్టాలు ఎక్కువ. ఈ క్రమంలో ‘స్త్రీపురుషులకు సమాన హక్కులు కల్పించడం’ దగ్గర్నుంచి, ‘సమాన పనికి సమాన వేతనం’, ‘సంస్థ బోర్డుల్లో తప్పనిసరిగా 40 శాతం మహిళలుండాల’న్న నియమం, ‘ప్రపంచంలోనే అత్యుత్తమమైన పేరెంటల్‌ లీవ్‌ పాలసీ (తల్లిదండ్రులకు 9 నెలల వేతనంతో కూడిన సెలవు)’, ‘పాఠశాల దశ నుంచే లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం’, వ్యభిచారం తరహా కార్యకలాపాలు చట్టవిరుద్ధం’.. ఇలా మహిళలకు సంబంధించిన ప్రతి విషయం అక్కడ చట్టంతో ముడిపడి ఉంటుంది. ఇలా మహిళలకు సానుకూలంగా ఉంటూ.. వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోన్న ఐస్‌ల్యాండ్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య 77 శాతానికి పైమాటే!

ఇవే కాదు.. బురుండీ, సాన్‌ మారినో, స్వీడన్‌, నార్వే.. వంటి దేశాల్లోనూ పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్