కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!

కొత్తగా పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు.. కొత్త కోడలిగా అత్తింట్లో ఎలా మసలుకోవాలి? వాళ్ల మనసులు ఎలా గెలుచుకోవాలి? భర్తకు మరింత దగ్గరవడమెలా?.. నవ వధువుల మనసంతా ఇలాంటి విషయాల చుట్టే తిరుగుతుంటుంది. ఇలా వీళ్ల మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికే.....

Published : 05 Jul 2022 13:23 IST

కొత్తగా పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు.. కొత్త కోడలిగా అత్తింట్లో ఎలా మసలుకోవాలి? వాళ్ల మనసులు ఎలా గెలుచుకోవాలి? భర్తకు మరింత దగ్గరవడమెలా?.. నవ వధువుల మనసంతా ఇలాంటి విషయాల చుట్టే తిరుగుతుంటుంది. ఇలా వీళ్ల మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికే ఇటీవల కొన్ని సంస్థలు  కొన్ని సర్వేలు ఈ క్రమంలో అసలు కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఆన్‌లైన్‌లో ఏయే విషయాల గురించి వెతుకుతున్నారో ఆరా తీశాయి. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడైనట్లు తేలింది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మరింత అందంగా.. ఎలా?

సాధారణంగానే అమ్మాయిలు ఎలాంటి అకేషన్‌ అయినా ఆకర్షణీయంగా ముస్తాబవ్వాలనుకుంటారు. అలాంటిది వలచి వరించిన భాగస్వామి కంటికి మరింత అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో ఇందుకోసం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు, తీసుకోవాల్సిన ఆహారం, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు-చేర్పులు.. వంటి విషయాల్ని ఎక్కువగా శోధించినట్లు చెబుతున్నారు పరిశోధకులు. అలాగే భర్తలు కూడా తమ భార్యకు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడమెలా.. ఫిట్‌నెస్, సిక్స్‌ ప్యాక్‌ బాడీ పొందడమెలా? వంటి విషయాల గురించి వెతికినట్లు చెబుతున్నారు పరిశోధకులు.

ఏం కోరుకుంటున్నారు?

ఈకాలంలో చాలా జంటలు కాబోయే జీవిత భాగస్వామి అభిరుచులు, ఇష్టాయిష్టాల గురించి పెళ్లికి ముందే అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి విషయాల గురించి కొత్త పెళ్లి కూతుళ్లు ఆన్‌లైన్‌లో కూడా శోధిస్తున్నారట! అది కూడా.. అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడే అంశాలేంటి? సాధారణంగా భార్య నుంచి భర్త ఏం ఆశిస్తాడు? దాంపత్య బంధంలో ఎలా మెలిగితే.. తమ మధ్య అన్యోన్యత బలపడుతుంది? తనతో రొమాంటిక్‌గా ఎలా ఉండాలి? తదితర విషయాల గురించే ఎక్కువగా వెతుకుతున్నారట కొత్త పెళ్లి కూతుళ్లు. ఇక, ఈ విషయంలో అబ్బాయిలూ అమ్మాయిల్నే అనుసరిస్తున్నారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. భార్యకు ఎలా ఉంటే నచ్చుతుంది? అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి బహుమతుల్ని ఇష్టపడతారు?.. వంటి విషయాల్ని శోధించి, ఆచరించి.. తమ భార్య మనసు గెలుచుకునే పనిలో ఉన్నారట చాలామంది భర్తలు.

అత్తారింట్లో ఇమిడిపోయేలా..!

కొత్తగా పెళ్లైన అమ్మాయికి అత్తారిల్లే పుట్టిల్లవుతుంది. అత్తమామలే తల్లిదండ్రులవుతారు.. ఆడపడుచుల్నే తోబుట్టువుల్లా చూసుకోవాల్సి ఉంటుంది. అత్తింటి బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించాల్సి వస్తుంది. అప్పుడే కోడలిగా నూటికి నూరు మార్కులు కొట్టేయచ్చు. మరి, ఇందుకోసం ఏం చేయాలి? అత్తారింట్లో ఎలా నడుచుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకోవడానికీ కొత్త పెళ్లి కూతుళ్లు ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారని తేలింది. ఈ క్రమంలో మరికొందరు ఆన్‌లైన్‌లో నిపుణుల్ని సంప్రదించి మరీ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారట!

మరోవైపు అబ్బాయిలూ.. అల్లుడిగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అప్పుడే ఇరు కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ విషయాల గురించి తెలుసుకోవడానికీ చాలామంది గూగుల్‌నే ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అప్పుడే పిల్లల్ని కనాలా? వద్దా?

పెళ్లయ్యాక పిల్లల్ని కనే విషయంలో అందరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు. ఈ క్రమంలో కుటుంబ ఒత్తిళ్లు, ఇతర అంశాలు కూడా కొందరిని ప్రభావితం చేస్తుంటాయి. ఏదేమైనా ఈ విషయాల గురించి తెలుసుకోవడానికీ కొత్త జంటలు ఆన్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకునే వారు.. వేగంగా గర్భం ధరించే మార్గాలు, ఆపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెతుకుతుంటే.. కొన్నాళ్లు గర్భం వాయిదా వేయాలనుకునే వారు సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులు, ఇతర విషయాల గురించి శోధిస్తున్నారట! మరికొంతమంది ఆయా విషయాల్లో నిపుణుల కౌన్సెలింగ్‌ కూడా తీసుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

ఎలా బ్యాలన్స్ చేయాలి?

అప్పటిదాకా పుట్టింట్లో ఉన్న అమ్మాయిలు స్వేచ్ఛగా తమ ఉద్యోగం చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలా వరకు వాళ్లకు ఇంట్లో ఎలాంటి బాధ్యతలు ఉండకపోవచ్చు. అదే పెళ్లయ్యాక ఇటు ఇంటిని, అటు ఆఫీస్‌ని బ్యాలన్స్‌ చేయడం కాస్త కష్టమవుతుంది. దీనికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ పాఠాల గురించి కొత్త పెళ్లి కూతుళ్లు ఆన్‌లైన్‌లో ఎక్కువగా వెతుకుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో అనుభవం ఉన్న ఇతర మహిళల సలహాలు, సూచనలు తీసుకోవడానికీ వాళ్లు వెనకాడట్లేదట!

ఇవన్నీ చదువుతుంటే.. మీరూ మీ పెళ్లైన కొత్తలో ఆన్‌లైన్‌లో శోధించిన అంశాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆలస్యమెందుకు? మీ అనుభవాలు, అనుభూతులు Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్