రూమ్‌మేట్‌తో కలిసుంటున్నారా?

వృత్తి ఉద్యోగాలు, పైచదువుల రీత్యా పట్టణాలు, నగరాలకు వచ్చిన అమ్మాయిలు హాస్టళ్లలో, ప్రత్యేకంగా గదుల్ని అద్దెకు తీసుకొని ఉండడం మామూలే! అయితే ఇలా గదిని పంచుకున్న రూమ్‌మేట్‌తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా.. అప్పుడప్పుడూ పలు విషయాల్లో భేదాభిప్రాయాలు, చిన్న చిన్న గొడవలు.....

Updated : 21 Apr 2022 14:28 IST

వృత్తి ఉద్యోగాలు, పైచదువుల రీత్యా పట్టణాలు, నగరాలకు వచ్చిన అమ్మాయిలు హాస్టళ్లలో, ప్రత్యేకంగా గదుల్ని అద్దెకు తీసుకొని ఉండడం మామూలే! అయితే ఇలా గదిని పంచుకున్న రూమ్‌మేట్‌తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా.. అప్పుడప్పుడూ పలు విషయాల్లో భేదాభిప్రాయాలు, చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇది వ్యక్తిగతంగానే కాకుండా, మానసిక ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే రూమ్‌మేట్‌తో కలిసున్నప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

ప్రైవసీని హరించద్దు!

స్నేహితురాలితో కలిసున్నా, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా.. ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమకంటూ కొంత ప్రత్యేక సమయం కేటాయించుకుంటారు. ఇలాంటప్పుడు ఎదుటివారికి భంగం కలిగించకుండా మెలగడం మంచిదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీ రూమ్‌మేట్‌ ఫ్రెండ్‌/కొలీగ్‌ మీ గదికి వచ్చిందనుకోండి.. అనవసరంగా వాళ్ల మాటల్లో తలదూర్చడం, వాళ్ల చర్చకు అంతరాయం కలిగించడం సబబు కాదు. తద్వారా మీ రూమ్‌మేట్‌కు మీపై ప్రతికూల భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లను స్వేచ్ఛగా వదిలేసి మీ పని మీరు చేసుకోండి. అలాగే మీకు వీలైతే వచ్చిన అతిథులకు ఓ కప్పు కాఫీ/టీ అందించినా తప్పు లేదు. ఈసారి మీరు ఇలా చేస్తే.. మీకు సంబంధించిన వాళ్లెవరైనా మీ గదికి వస్తే మీ రూమ్‌మేట్‌ కూడా మీకు సహాయపడుతుంది. తద్వారా ఇద్దరి మధ్య చెలిమి పెరుగుతుంది.

కలిసి పంచుకోవాలి!

చాలామంది రూమ్‌మేట్స్‌కి పేచీ వచ్చేది ఎక్కడంటే.. ఇంటి పనుల దగ్గరే! సమయం లేకో, వీలు పడకో.. ఒక్కోసారి ఒకరి పైనే పనుల భారం పడచ్చు.. దానివల్ల ‘అన్నీ నేనే చేయాలా?’ అన్న ఆలోచన అవతలి వారిలో మొదలవుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఈ ఒక్క ఫీలింగ్‌ చాలు! అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసే పనులన్నీ సమానంగా పంచుకోవాలి. అలాగే బయటి నుంచి తెచ్చుకునే సరుకులు, కాయగూరల విషయంలోనూ.. కలిసే చేసుకోవాలి. అలా వీలు కాకపోతే ఒకరు ఒకసారి, ఇంకొకరు ఇంకోసారి చేసేలా ప్లాన్‌ చేసుకోండి. అయితే ఒక్కోసారి పనిభారమంతా మీ రూమ్‌మేట్ పైనే పడచ్చు.. అలాంటప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారో వివరణ ఇవ్వడంలో తప్పు లేదు. అలాగే వాళ్లకి కుదరనప్పుడు పనుల భారం మీ భుజాలపై వేసుకోండి. ఇలా ఇద్దరూ పనుల్ని సమన్వయం చేసుకోగలిగితే.. ఏ గొడవా ఉండదు.

ఎక్కడెంత ఖర్చు పెడుతున్నారు?

ఆర్థిక విషయాల్లో కూడా కొంతమంది రూమ్‌మేట్స్‌ గొడవలు పడుతుంటారు. నెలకు సరిపడా అయ్యే ఖర్చుల్లో హెచ్చుతగ్గులున్నాయని ఎడమొహం పెడమొహంగా ఉంటుంటారు. దీనివల్ల ప్రశాంతత కొరవడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధమూ దెబ్బతింటుంది. అలా జరగకూడదంటే.. ఇద్దరికీ కలిపి నెలకయ్యే ఉమ్మడి ఖర్చును సగం-సగం పంచుకుంటే సరి! వ్యక్తిగత అవసరాల కోసం ఎవరికి వారే ఖర్చు పెడతారు కాబట్టి ఇబ్బంది ఉండదు.

ఆ విషయంలో ఇబ్బంది పెట్టద్దు!

ప్రతి ఒక్కరికీ ఉండే అలవాట్లు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. ఈ విషయంలోనూ రూమ్‌మేట్స్‌ ఒకరినొకరు గౌరవించుకోకపోతే తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీకు కాస్త ఆలస్యంగా నిద్ర పోయే అలవాటుందనుకోండి.. అదే మీ రూమ్‌మేట్ ఉదయాన్నే ఆఫీస్‌కెళ్లాలని త్వరగా పడుకుంటుందనుకోండి.. టీవీ చూస్తూ మీరు కాలక్షేపం చేస్తూ తన నిద్రకు భంగం కలిగించడం కరక్ట్‌ కాదు. కాబట్టి అలాంటి సందర్భాలలో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని వీక్షిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ ఒక్క విషయమనే కాదు.. బయటి నుంచి ఆర్డర్‌ చేసే ఫుడ్‌ విషయంలో కావచ్చు.. ఎక్కువగా ఫోన్లు వాడే విషయంలో కావచ్చు.. ఎవరి సౌకర్యానికి వాళ్లను వదిలేయడం మంచిది. తద్వారా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

ఒకవేళ గొడవైతే..!

ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక విషయంలో మనస్పర్థలు రావని చెప్పలేం. అలాంటి సమయాల్లో పంతాలకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. ఈ క్రమంలో తప్పు ఎవరిదైనా సరే.. ఎదుటివారికి క్షమాపణ చెప్పడం, అసలు మీరు ఆ సమయంలో ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చిందో విడమరిచి చెప్పడంలో తప్పు లేదు. ఇలా రియలైజ్‌ అవడం వల్ల ఇద్దరి మధ్య సమస్య సద్దుమణగడమే కాదు.. అనుబంధమూ రెట్టింపవుతుంది.

మరి, మీరూ మీ రూమ్‌మేట్‌తో కలిసుంటున్నారా? అయితే గొడవలు, అపార్థాలు దొర్లకుండా.. ఇద్దరి మధ్య అనుబంధం పెంచుకోవడానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్