ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!

హోలీ అంటేనే రంగులు, సరదాలు! చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి ఆడుకునే పండగ. అయితే ఒక గ్రామంలో మాత్రం ఈ పండగను కేవలం మహిళలు మాత్రమే జరుపుకొంటారట! ఈ వేడుకల్లోకి పురుషులకు ప్రవేశం లేదట!

Published : 25 Mar 2024 14:35 IST

హోలీ అంటేనే రంగులు, సరదాలు! చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి ఆడుకునే పండగ. అయితే ఒక గ్రామంలో మాత్రం ఈ పండగను కేవలం మహిళలు మాత్రమే జరుపుకొంటారట! ఈ వేడుకల్లోకి పురుషులకు ప్రవేశం లేదట! ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని దశాబ్దాలుగా ఇది అక్కడ ఆనవాయితీగా వస్తోందంటున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతేకాదు.. దీన్ని అక్కడి మహిళలు ఆంక్షలపై సాధించిన విజయంగా అభివర్ణిస్తుంటారు. మరి, ఇంతకీ ఎక్కడుందా గ్రామం? ఈ సంప్రదాయం వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి..

దేశవ్యాప్తంగా తర-తమ భేదాల్లేకుండా హోలీ జరుపుకొంటుంటారు. అయితే ఇదే హోలీ రోజున ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలోని కుందౌరా గ్రామానికి వెళ్లారంటే.. అక్కడ ఎటు చూసినా మహిళలే దర్శనమిస్తుంటారు.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండగ సరదాల్ని ఆస్వాదిస్తుంటారు.

ఆ చేదు సంఘటనతో..!

కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ సంప్రదాయం వెనుక రెండు కారణాలున్నాయంటున్నారు అక్కడి మహిళలు. ఒకటి - కొన్నేళ్లకు పూర్వం జరిగిన ఓ చేదు సంఘటన. కొన్ని దశాబ్దాలకు పూర్వం ఆ గ్రామ ప్రజలు ఎప్పటిలాగే అక్కడి రామ్‌ జానకి గుళ్లో హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వేడుకల్లో ఓ హత్య చోటుచేసుకోవడంతో అందరూ దీన్ని అపశృతిగా భావించారు. దాంతో కొన్నేళ్ల పాటు అక్కడ హోలీ అన్న మాటే ఎత్తేవారు కాదట! కానీ ఆ తర్వాత ఆ గ్రామంలోని మహిళలంతా ఒక రోజు అదే గుళ్లో సమావేశమై.. ఇకపై మహిళలు మాత్రమే ఈ పండగ జరుపుకోవాలని, ఈ వేడుకల్లోకి పురుషుల్ని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారట! అలా అప్పట్నుంచి తమ కుటుంబంలోని పురుషులతో ప్రమేయం లేకుండా కేవలం మహిళలంతా కూడి ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఆంక్షలు తెంచుకొని.. సరదాలు పంచుకుంటూ..!

ఇక ఇలా మహిళలు మాత్రమే ఈ పండగను జరుపుకోవడం వెనకున్న రెండో కారణం - అక్కడ మహిళలపై ఉన్న కట్టుబాట్లు. సాధారణంగా పల్లెటూర్లలో పెళ్లైన మహిళలకు తమ అత్తింట్లో కొన్ని కట్టుబాట్లుంటాయి. ముఖ్యంగా మామ, బావ-మరుదులు, ఇతర పురుషుల సమక్షంలో ముఖం కనిపించకుండా కొంగుతో కప్పుకోవాలని, వాళ్ల ముందు ఎలాంటి సరదాల్లోనూ పాల్గొనకూడదని.. ఇలాంటి ఆంక్షలుంటాయి. అయితే హోలీ రోజు వీటన్నింటినీ పక్కన పెట్టి స్వేచ్ఛగా గడుపుతారట అక్కడి మహిళలు. రోజంతా తలపై వెయిల్‌ లేకుండా, పురుషులు చూస్తారేమోనని బిడియపడకుండా సరదాగా గడుపుతారట. పైగా ఈ వేడుకల్లో అత్తా-కోడళ్లు కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్‌ చేయడం ఆత్మీయంగా అనిపిస్తుందని చెబుతుంటారు అక్కడి మహిళలు. ఇలా ఈ పండగను కట్టుబాట్లు, మూసధోరణుల్ని తెంచుకొని అక్కడి మహిళలు సాధించిన విజయంగా చెబుతుంటారు.

పురుషులు కనిపిస్తే అంతే సంగతులు!

మొత్తం ఐదు వేల మంది జనాభా ఉండే ఈ గ్రామంలో రెండు రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయట! హోలీ ముందు రోజు పురుషులు మాత్రమే పండగ చేసుకుంటారు. ఇక హోలీ రోజు కేవలం మహిళలు, పిల్లలు కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. ఈ క్రమంలో పురుషులు ఇళ్లలోనే ఉండిపోవడం, లేదంటే పనులకు వెళ్లి.. సూర్యాస్తమయం అయ్యాక తిరిగిరావడం.. వంటివి చేస్తారట! ముఖ్యంగా కోడళ్లకు కనిపించకుండా మామలు జాగ్రత్తపడతారట! అయితే పొరపాటున ఎవరైనా మగవాళ్లు ఈ ఆడవాళ్ల వద్దకొస్తే మాత్రం.. వాళ్లకూ ఆడవాళ్ల దుస్తులు ధరింపజేసి.. రంగులు పూస్తారట! ఊరంతా ఊరేగిస్తారట! ఇక ఈ రోజంతా మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డప్పు చప్పుళ్లతో గ్రామమంతా కలియతిరుగుతూ, ఆటపాటలతో సరదాగా గడుపుతారట! ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతారట అక్కడి మహిళలు. ఇక రాత్రుళ్లు రుచికరమైన వంటకాలు చేసి.. ఇంట్లోని మగవారికి వడ్డించడం, తామూ తినడంతో పండగను సంపూర్ణం చేసుకుంటారు.

సాధారణంగా ఇలాంటి ప్రత్యేకమైన వేడుకల్ని ఫొటోలు, వీడియోల్లో బంధిస్తూ.. జీవితాంతం ఆ జ్ఞాపకాల్ని భద్రపరచుకుంటాం. కానీ ఈ మహిళా హోలీ వేడుకల్ని ఫొటోలు తీయడం, వీడియోల్లో బంధించడం నిషిద్ధం అంటున్నారు అక్కడి మహిళలు! మొత్తానికి భలే సరదాగా ఉన్నాయి కదా ఈ మహిళా హోలీ సంబరాలు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్