20-20-20 రూల్ పాటిస్తున్నారా?

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి.. ప్రస్తుతం దాదాపు అందరి జీవితాల్లోనూ భాగమైపోయాయి. ఇక విధుల్లో భాగంగా రోజుకు గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్‌ను చూస్తూనే పని చేయడం మన కళ్లపై ఒకింత ప్రభావం చూపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. దీని ఫలితంగానే కళ్లు పొడిబారడం...

Published : 13 Oct 2022 16:08 IST

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి.. ప్రస్తుతం దాదాపు అందరి జీవితాల్లోనూ భాగమైపోయాయి. ఇక విధుల్లో భాగంగా రోజుకు గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్‌ను చూస్తూనే పని చేయడం మన కళ్లపై ఒకింత ప్రభావం చూపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. దీని ఫలితంగానే కళ్లు పొడిబారడం... కంటి నుంచి నీరు కారడం.. కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు నేడు సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలో వృత్తిగత జీవితంలో ఎక్కువ భాగం కంప్యూటర్‌పై పని చేస్తున్నవారు, కంటి సంబంధిత సమస్యలను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి నియమాలు పాటించాలో ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ (వరల్డ్‌ సైట్‌ డే) సందర్భంగా తెలుసుకుందాం...

✮ 20-20-20 సూత్రాన్ని తప్పనిసరిగా పాటించండి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి.

✮ చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారి, మంట పుడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి. ఒకవేళ కళ్లు తరచూ పొడిబారుతూ ఉంటే వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించి ఐడ్రాప్స్ తీసుకోవడం మంచిది.

✮ కళ్లు, మానిటర్ పైభాగం ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానిటర్ మధ్య భాగానికి, కళ్లకు 15 నుంచి 20 డిగ్రీల కోణం ఉంటుంది. ఫలితంగా కళ్లు ఎటువంటి ఒత్తిడికి గురవ్వవు.

✮ విశ్రాంతి తీసుకొనే సమయంలో కళ్లను సవ్య, అపసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పాలి. లేదంటే కళ్లను మూసి ఉంచాలి.

✮ కళ్లకు, కంప్యూటర్ స్క్రీన్‌కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండాలి.

✮ మానిటర్‌పై వెలుగు పడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలుపుల నుంచి స్క్రీన్‌పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు ఉపయోగించాలి.

✮ దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి.

✮ అలాగే స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మన కంటికి సరిపోయే రీతిలో అమర్చుకోవాలి.

✮ కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయడానికి వీలుగా లభించే యాంటీ రిఫ్లెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించవచ్చు. ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరి.

✮ గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్‌వేర్‌లను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీటి వల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి.

✮ సాధ్యమైనంత వరకు ఫాంట్‌సైజు పెంచుకోవాలి.

✮ ముఖానికి ఎదురుగా ఫ్యాన్ పెట్టుకోవద్దు. గాలి వల్ల కూడా కళ్లు తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.

✮ కంప్యూటర్ పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

చూశారుగా! కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు కళ్ల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. మీరు కూడా వీటిని తప్పకుండా పాటించండి. మీ కళ్లను జాగ్రత్తగా సంరక్షించుకోండి. అలాగే నిర్ణీత వ్యవధుల్లో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్