Parenting: వద్దని చెప్పకుండానే...

పిల్లలు గారంగా అమ్మా నీ ఫోన్‌ ఒకసారి ఇవ్వవూ.. అంటే చాలు. కాదనలేరు తల్లిదండ్రులు. టీవీ ముందు కూర్చోవద్దంటే అలుగుతారు.

Published : 21 May 2023 01:22 IST

పిల్లలు గారంగా అమ్మా నీ ఫోన్‌ ఒకసారి ఇవ్వవూ.. అంటే చాలు. కాదనలేరు తల్లిదండ్రులు. టీవీ ముందు కూర్చోవద్దంటే అలుగుతారు. అలాగని వదిలేయకూడదు. అయితే పిల్లలను నిరాశపరచకూడదు కూడా.. అంటున్నారు నిపుణులు. వద్దని చెప్పకుండానే వేరే వైపు మార్గాన్ని మళ్లించే చిట్కాలు కొన్ని చెబుతున్నారు.

చిన్నారులు గోముగా అడిగినంత మాత్రాన వారు కోరింది వెంటనే ఇస్తే మరోసారి కూడా అదే మార్గంలో వస్తారు. ఫోన్‌ అడిగితే వెంటనే అరవడం, కోప్పడకుండా మృదువుగానూ వారి ఆలోచనను మళ్లించొచ్చు. మరోసారి ఇస్తా, నాకు కొంచెం పని ఉంది ప్లీజ్‌..అనాలి. అప్పుడు కూడా పిల్లలు వెంటాడుతుంటే నా పని అయిన తర్వాత మనిద్దరం కలిసి ఏదైనా కొత్త పని చేద్దామని చెప్పి చూడాలి. అమ్మానాన్నలు తమతో ఆడటానికి సిద్ధపడుతున్నారనే ఉత్సాహం పిల్లలను అటువైపు అడుగులేయించేలా చేస్తుంది. ఆ తర్వాత వారికిష్టమైన ఆటను కలిసి ఆడటానికి కొంత సమయాన్ని కేటాయించాలి.

మరో ఆలోచన... ఫోన్‌ లేదా టీవీలో గంటలతరబడి ఉండే పిల్లలను అక్కడి నుంచి కదపడం చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు మృదువుగా చెప్పినా, అరచి చెప్పినా విననట్లే వారి లోకంలో వారు మునిగిపోతుంటారు. గతంలో పార్కు, మైదానానికి వెళదామని వారడిగిన సందర్భాన్ని గుర్తు చేయాలి. అలాగే వెళుతున్నామంటూ బయలుదేరితే చాలు. ఉత్సాహంగా మన చేయి పట్టుకొని బయటికెళదామంటూ, ఆడుకోవడానికి సిద్ధపడతారు. నిత్యావసరాలు కావాలంటూ మార్కెట్‌కెళ్లాలి, వస్తావా అనీ అడగొచ్చు. వాళ్లతోనే కావాల్సిన సామాన్లను కాగితంపై  రాయించాలి. అంతేకాదు, ఆ పట్టికను వారి చేతికిచ్చి దుకాణంలో సేకరించడంలో వారిని భాగస్వాములను చేయాలి. ఇవన్నీ  వారిలో కొత్త నైపుణ్యాలను నేర్పిస్తాయి.

కొత్తగా.. వంటింట్లో హడావుడిగా ఉన్నప్పుడు పిల్లలు వచ్చి తామూ చేస్తామని సరదా పడుతుంటారు. ఫోన్‌, టీవీలో ఉన్నప్పుడు ఆ పని గుర్తు చేయాలి. లేదా రోటీ, సలాడ్‌ వంటివి చేయడానికి వారి సాయాన్ని కోరాలి. హుషారుగా వంటింట్లోకి అడుగుపెట్టిన తర్వాత చిన్నచిన్న పనులు అప్పజెప్పి చేసేలా చూడాలి. వారి సాయం తీసుకుంటున్నట్లే పని పూర్తిచేయాలి. వేడివేడిగా వారికిష్టమైన వంటకాన్ని అందిస్తే చాలు. వారి ముఖాలు సంతోషంతో నిండిపోవడమే కాదు. వంటపై ఆసక్తి పెంచుకుంటారు.  సమయం ఉన్నప్పుడల్లా గరిట తిప్పడానికి ప్రయత్నిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్