పని ప్రదేశంలో ‘సానుకూలత’..

ప్రయాణ సమయంలో పక్క సీటులోకి ఎవరొస్తారో, వాళ్లు మనతో ఎలా ప్రవర్తిస్తారో అని ఆలోచిస్తాం కదా! కాసేపు ప్రయాణానికే అలా ఆలోచించినప్పుడు రోజులో ఎక్కువ సేపు గడిపే సహోద్యోగులతోనూ సానుకూలంగా వ్యవహరించాలిగా.

Published : 27 Jan 2023 00:22 IST

ప్రయాణ సమయంలో పక్క సీటులోకి ఎవరొస్తారో, వాళ్లు మనతో ఎలా ప్రవర్తిస్తారో అని ఆలోచిస్తాం కదా! కాసేపు ప్రయాణానికే అలా ఆలోచించినప్పుడు రోజులో ఎక్కువ సేపు గడిపే సహోద్యోగులతోనూ సానుకూలంగా వ్యవహరించాలిగా. ఆ తీరు వృత్తిపరంగానే కాక వ్యక్తిగత జీవితంలోనూ విజయవంతమవటానికి దోహదపడుతుంది. దానికోసం నిపుణుల సూచనలివీ....

కృతజ్ఞతా భావం... ఇతరుల్లో మంచిని చూడగలిగినప్పుడే మనలోని మంచినీ ఇతరులు చూడగలుగుతారు. ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞత చూపండి. ఇది ఆనందం ఇవ్వడమేకాక ఆలోచనా విధానాన్నీ మారుస్తుంది. ముఖ్యంగా పని ప్రదేశాల్లో సహోద్యోగుల మధ్య నమ్మకం, గౌరవాన్ని పెంచుతుంది. తోటి ఉద్యోగులు ఏదైనా సాధించినప్పుడు అభినందించండి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ‘థాంక్యూ’ అనే చిన్న పదం ఎన్ని పెద్ద మార్పులు తీసుకొస్తుందో! అయితే అది నిజాయతీగా ఉండాలి. ఉదాహరణకు మీటింగ్‌లో ఎవరిదైనా ఐడియా మీలో స్ఫూర్తిని నింపిందనుకోండి. వెంటనే ఆ విషయం వారికి తెలియజేయండి. అది వాళ్లపై మీకున్న కృతజ్ఞతను తెలియజేస్తుంది.

సానుకూలంగా మాట్లాడటం... మాటలు ఎంతో శక్తిమంతమైనవి. సహోద్యోగులతో మాట్లాడే ప్రతిమాటా ఆశావాదంతో, నిర్మాణాత్మక ధోరణిలో ఉండాలి. సంభాషణలు వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. మన నిర్ణయాలనూ పరిగణనలోకి తీసుకుంటారు.

విజయం చిన్నదైనా.... పెద్ద విజయాలు సాధించినప్పుడు అభినందించడం మామూలే. చిన్న విజయాలను చాలా సార్లు పట్టించుకోము. కానీ అవీ కీలకమే. ఎంత పెద్ద ఆశయమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుంది కదా! అందుకే పెద్ద విజయాలు సాధించడంలో సహోద్యోగులది చిన్న పాత్ర అయినా సరే అభినందించండి.

నవ్వండి.... నవ్వు అంటువ్యాధి లాంటిది. మనం నవ్వితే ఎదుటి వాళ్లూ అప్రయత్నంగా నవ్వుతారు. ఒక చిన్న నవ్వు ఆలోచనలను, భావాలనూ పెంచుతుంది. ఉదాహరణకు కంపెనీ అమ్మకాలు తగ్గినా మరే ప్రతికూల పరిస్థితుల్లోనైనా మీ సహోద్యోగుల వద్ద చిరునవ్వును చెరగనివ్వకండి. అది వారిలో, మీలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది.

అంతిమంగా సానుకూల ధోరణి చాలా శక్తిమంతమైనది. అది మనకి జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది. సానుకూలంగా ఉండటం వల్ల మానసికంగా బలంగా తయారవడమే కాకుండా మన చుట్టు పక్కల వాళ్లలోనూ అదే గుణాన్ని పెంచుతుంది. పని ప్రదేశాన్నీ ఆహ్లాదంగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్