సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధమవుతున్నారా?

పిల్లలు పుట్టిన తర్వాత మహిళల జీవితం ఇంటికే పరిమితమవుతుందనుకుంటారు కొంతమంది. కానీ ఈ తరానికి చెందిన మహిళలు మాత్రం ఇది ఎంతమాత్రం కరక్ట్‌ కాదని నిరూపిస్తున్నారు. పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే తిరిగి పనిలోకి అడుగుపెడుతున్నారు. ఒకవేళ పిల్లల ఆలనా పాలన చూడడం కుదరకపోతే....

Published : 03 Apr 2023 15:38 IST

పిల్లలు పుట్టిన తర్వాత మహిళల జీవితం ఇంటికే పరిమితమవుతుందనుకుంటారు కొంతమంది. కానీ ఈ తరానికి చెందిన మహిళలు మాత్రం ఇది ఎంతమాత్రం కరక్ట్‌ కాదని నిరూపిస్తున్నారు. పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే తిరిగి పనిలోకి అడుగుపెడుతున్నారు. ఒకవేళ పిల్లల ఆలనా పాలన చూడడం కుదరకపోతే కొంతకాలం కెరీర్‌కి గ్యాప్‌ ఇచ్చి.. తిరిగి ఉద్యోగ వేట ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోమని చెబుతున్నారు నిపుణులు.

తపనేంటో తెలుసుకోండి!

ఫలానా రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలి.. ఉన్నత స్థాయికి ఎదగాలి.. ఇలా కెరీర్‌ పరంగా ఒక్కొక్కరిదీ ఒక్కో దారి! అలాగని అందరూ ఇలా తమ తపనకు తగిన ఉద్యోగమే చేస్తారని చెప్పలేం. ముందు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు తలెత్తచ్చు.. కొంత ఉద్యోగ అనుభవం సంపాదించాక ఆ దిశగా ప్రయత్నాలు చేయచ్చు కదా అనుకోవచ్చు. ఇలా పలు కారణాల వల్ల తమ అంతిమ లక్ష్యాన్ని వాయిదా వేస్తూ వచ్చిన వారికి రెండో ఇన్నింగ్స్‌ సరైన సమయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ క్రమంలో ఇంట్లో ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకున్నప్పటికీ.. రోజులో అప్పుడప్పుడూ ఎంతో కొంత సమయం దొరుకుతుంది. మీ తపనను నెరవేర్చుకోవడానికి ఆ సమయాన్ని కేటాయించచ్చు. కాబట్టి ముందు ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకున్నా.. ఇప్పుడు మీ తపనేంటో తెలుసుకోండి.. అంతిమ లక్ష్యం దిశగా అడుగులేయండి.. ఈ క్రమంలో కొత్త విషయాలపై అవగాహన పెంచుకుంటూ, నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటూ, టెక్నాలజీ విషయంలో అప్‌డేటెడ్‌గా ఉంటూ రెజ్యూమెను అప్‌డేట్‌ చేసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.

త్వరపడడం మంచిదట!

రోజులు గడుస్తున్న కొద్దీ సమయం వృథా తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ఒక రకమైన అలసత్వం ఆవహించే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో కెరీర్‌పై దృష్టి పెట్టే వారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగ వేట ప్రారంభించాలంటున్నారు నిపుణులు. లేదంటే గ్యాప్‌ పెరిగిన కొద్దీ దాన్ని పూడ్చుకోవడం కష్టమవుతుందంటున్నారు. అవకాశాలూ సన్నగిల్లుతాయంటున్నారు. ఈ క్రమంలో మీరు గతంలో పనిచేసిన మీ సహోద్యోగులతో నిరంతరం టచ్‌లో ఉండడం, లింక్డ్‌ఇన్‌లో నెట్‌వర్క్‌ పెంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా ఆయా కంపెనీల్లో ఉండే ఖాళీల వివరాలు వారు మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగ ప్రయత్నాలు మరింత సులభమవుతాయి. అంతటితో ఆగకుండా మీ వంతుగా మీరు ఆయా జాబ్‌ పోర్టల్స్‌లో మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే వీలైనంత త్వరగా తిరిగి ఉద్యోగంలో చేరచ్చు.

ఆచితూచి అడుగేయాలి!

కెరీర్‌లో గ్యాప్‌ తీసుకోవడం వరకు బాగానే ఉంటుంది.. కానీ ఒక్కోసారి ఆ గ్యాప్‌ను పూడ్చడం అంత తేలిక కాకపోవచ్చు. అయితే అందుకు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే ముందు నుంచే సన్నద్ధం కావాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు కెరీర్ నుంచి ఎందుకు విరామం తీసుకోవాల్సి వచ్చింది? ఇన్ని రోజులు సమయం వృథా చేశారా? ఏవైనా నైపుణ్యాలు నేర్చుకున్నారా? లేదంటే ఏదైనా బిజినెస్‌ చేశారా?.. వంటి వివరాలన్నీ ఇంటర్వ్యూ చేసే బృందానికి ఓర్పుగా నేర్పుగా వివరించాల్సి ఉంటుంది. ఇలా చెప్పే క్రమంలో ఏమాత్రం తడబడినా ఎదుటివారికి సందేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ తల్లిగా పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికే కెరీర్‌ నుంచి విరామం తీసుకోవాల్సి వస్తే.. నిస్సందేహంగా అదే విషయం చెప్పచ్చు. ఇక ఇప్పుడు ఉద్యోగానికి పూర్తి సన్నద్ధమయ్యానంటూ వారికి వివరిస్తే సరిపోతుంది. తద్వారా మీ పరిస్థితిని వారు అర్థం చేసుకొని మీ అర్హతలు, మీ నైపుణ్యాల్ని బట్టి మీకు ఉద్యోగం కల్పించే ఆస్కారం కచ్చితంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

కోర్సులు నేర్చుకోవచ్చు!

అమ్మయ్యాక తిరిగి ఉద్యోగ వేట ప్రారంభించే తల్లులు కొత్త కోర్సులు నేర్చుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. కొత్తగా తల్లైన వారికి అంత సమయం ఉండచ్చు.. ఉండకపోవచ్చు.. కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ, స్కూలుకెళ్లే క్రమంలో రోజులో గంటో, రెండు గంటలో సమయం దొరక్కపోదు. ఆ సమయాన్ని కెరీర్‌ పరంగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇందులో భాగంగా మీరు నేర్చుకోవాలనుకున్న కోర్సులు, పెంచుకోవాలనుకున్న నైపుణ్యాలకు సంబంధించిన తరగతులు ఆన్‌లైన్‌లోనే బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఉచితంగానైనా చేరచ్చు.. లేదంటే కొంత ఫీజు చెల్లించి చేరచ్చు.. ఇలా మొత్తానికి ఖాళీగా సమయం వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మీ ఉద్యోగ వేట మరింత సులభమవుతుందంటున్నారు నిపుణులు.
అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకునే మహిళలని ఇప్పుడు ఎన్నో సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్‌సైట్లు కూడా పని చేస్తున్నాయి. ఇలాంటి వాటి ద్వారా కూడా మీ కలల ఉద్యోగాన్ని సంపాదించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్