ఉద్యోగంలో చేరాక వదిలేయొద్దు..

చేసే పనిలో ఉన్నతంగా ఎదగాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే, చాలామంది అమ్మాయిలు చేరిన కొత్తల్లో చూపిన ఉత్సాహం తర్వాత కొనసాగించలేరు. కారణాలు ఏవైనా... అవాంతరాలు దాటుకుని నాయకత్వ బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదగాలంటారు కెరియర్‌ నిపుణులు.

Published : 19 Jan 2023 00:49 IST

చేసే పనిలో ఉన్నతంగా ఎదగాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే, చాలామంది అమ్మాయిలు చేరిన కొత్తల్లో చూపిన ఉత్సాహం తర్వాత కొనసాగించలేరు. కారణాలు ఏవైనా... అవాంతరాలు దాటుకుని నాయకత్వ బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదగాలంటారు కెరియర్‌ నిపుణులు. అందుకోసమే ఈ సూచనలు చేస్తున్నారు.

* మొదట ఉద్యోగంలో ఉత్సాహంగానే చేరతాం. కానీ, క్రమంగా ఆ ఆసక్తి సన్నగిల్లుతుంది. ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ముందు కెళ్లాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి. మీ రంగంలో అత్యున్నత హోదా ఏదో గమనించుకుని మీ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఒక్కో మెట్టూ ఎలా ఎక్కాలో తెలుసుకుంటూ ప్రణాళికలు వేసుకుంటే కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. మీదైన ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు. ఆ అడుగులే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి.

* ఒక్కరోజులో ఎవరికీ విజయం వచ్చేయదు. దానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. వాటిని కచ్చితంగా పూర్తి చేయాలన్న పట్టుదల కావాలి. అంతేకాదు, మారే పరిస్థితుల్ని అంచనా వేసుకోగల సమయస్ఫూర్తి, చొరవని అలవరుచుకోవాలి. అప్పుడు ఎవరి తోడూ అవసరం లేకుండానే ముందడుగు వేయగలరు.

* సహోద్యోగుల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. అప్పుడప్పుడూ అసూయ కూడా తొంగి చూస్తుంది. అయినంత మాత్రాన అందరినీ ప్రతికూలంగా చూడటం, చిన్న చిన్న విషయాలకు వాదులాడటం వంటివి వద్దు. ఏదయినా సమస్య ఉంటే దాన్ని వ్యక్తం చేసేటప్పుడు కాస్త సౌమ్యంగా చెప్పగలగాలి. ఎప్పుడూ అవతలివారిలో లోపాలు ఎత్తి చూపడమే కాదు... మంచినీ మెచ్చుకోండి. అప్పుడే మీ బంధం బలపడుతుంది.

* మహిళలు సవాళ్లు తీసుకునేందుకు భయపడతారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఆ పరిస్థితిని అధిగమించడానికి మీరే ముందడుగు వేయండి. చొరవ తీసుకోండి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీకు పనిచేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. మీ మార్గంలో మీకెదురైన సమస్యల్ని మెంటార్‌ సాయంతో సులువుగా అధిగమించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్