Couple: ఆ కోపం.. చల్లార్చండిలా!

అలేఖ్యకు స్నేహితురాలి సంసారాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ దంపతులు ఒకేమాటపై ఉంటారు. తన భర్త మాత్రం ఇంట్లో, నలుగురిలోనూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఏ పొరపాటు దొరుకుతుందా అని ఎదురు చూస్తాడు.

Published : 29 Mar 2023 00:04 IST

అలేఖ్యకు స్నేహితురాలి సంసారాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ దంపతులు ఒకేమాటపై ఉంటారు. తన భర్త మాత్రం ఇంట్లో, నలుగురిలోనూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఏ పొరపాటు దొరుకుతుందా అని ఎదురు చూస్తాడు. ఈ పరిస్థితిని మార్చుకోవడమెలాగో నిపుణులు చెబుతున్నారిలా.

కే ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు నిపుణులు. దంపతుల్లో ఒకరు కోపంగా ఉంటే మరొకరు శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అవతలివారు మాటలతో కించపరుస్తున్నా, బాధపెడుతున్నా నిశ్శబ్దంగా ఉండమని కాదు. ఆ క్షణంలో అడ్డుపడకుండా, అలాగే కోప్పడకుండా ముందు వారిని మాట్లాడనివ్వాలి. కొంతసేపటి తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పాలి. అది కూడా ఎదుటివారిని వారిలాగే నిందిస్తూ కాకుండా మీ మనసులో విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. ప్రతిసారీ ఈ పద్ధతిని పాటించగలిగితే క్రమేపీ వారిలో మార్పు రావొచ్చు.

తామే.. భార్యాభర్తల్లో ఎవరికివారు తమకే అన్నీ తెలుసు, ఎదుటివారికి ఏదీ తెలీదనే అభిప్రాయంతో ఉండకూడదు. అలా చేస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారంకాదు. భార్యాభర్తలిద్దరూ తమకు తామే తెలివైనవారమనుకుంటూ.. ఎదుటివారిని ప్రతి విషయంలోనూ తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. అవతలివారికీ విలువనివ్వడం నేర్చుకుంటే సమస్యలు తగ్గుతాయి.

కారణం.. ప్రతికూల ఆలోచనలు, ఆత్మనూన్యతతో భాగస్వామి వద్ద తాము తక్కువకాదని నిరూపించే ప్రయత్నమే అతి కోపానికి కారణమంటున్నారు నిపుణులు. ఎదుటివారి నుంచి తమకు ప్రేమ దక్కడం లేదని లేదా వారు తమను గౌరవించడంలేదనే ఆలోచనలు అవతలివారిపై ఆగ్రహాన్ని పెంచుతాయి. దంపతుల మధ్య సమానత్వం, గౌరవమర్యాదలుంటే ఒకరిపై మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఇరువురి నడుమ కోపానికి తావు లేకుండా అనుబంధం ఏర్పడుతుంది.

మాట్లాడి.. భాగస్వామి కోపానికి కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవాలి. వారితో మాట్లాడి, సమస్యను తెలుసుకోగలిగితే మీవంతు సహకారం అందించొచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురైతే, గుర్తించి చేయూతనందించాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలు చిలికిచిలికి గాలివానగా మారతాయి.  వైవాహికబంధం బీటలువారే ప్రమాదమూ లేకపోలేదు. ఎదుటివారిలోని సానుకూల విషయాలను గుర్తించి ప్రేమించడానికి ప్రయత్నిస్తే సమస్యలు మాయమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్