కెరీర్‌ గ్రాఫ్‌ పెరగాలంటే..!

కెరీర్‌లో త్వరగా ఎదగాలని ఎవరు కోరుకోరు చెప్పండి! అయితే చేసే పనికి తగిన గుర్తింపు లభించకపోవడం, టెక్నాలజీలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోలేకపోవడం.. ఇలా కారణమేదైనా కొంతమంది కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది.

Published : 09 Dec 2023 17:43 IST

కెరీర్‌లో త్వరగా ఎదగాలని ఎవరు కోరుకోరు చెప్పండి! అయితే చేసే పనికి తగిన గుర్తింపు లభించకపోవడం, టెక్నాలజీలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోలేకపోవడం.. ఇలా కారణమేదైనా కొంతమంది కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. తద్వారా చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి ఉండకపోగా.. పనిపై క్రమంగా ఆసక్తి తగ్గిపోతూ ఉత్పాదకత కూడా దెబ్బతింటుంది. మరి, అలా జరగకూడదంటే కొన్ని అంశాల్లో మనల్ని మనం మెరుగుపరచుకోవాలంటున్నారు నిపుణులు. ఫలితంగా కెరీర్‌నూ పరుగులు పెట్టించచ్చంటున్నారు.

వాటిని మర్చిపోయారా?

ఉద్యోగమంటే రోజూ చేసే పనులే కాదు.. నిర్ణీత వ్యవధిలో పనికి సంబంధించిన కొన్ని లక్ష్యాలనూ నిర్దేశించుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీరు చేసే పనిలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సాంకేతిక విషయాల్లో పరిజ్ఞానం సంపాదించడం.. ఇలా మీరు ముందు ముందు ఏ అంశాలపై పట్టు సాధించాలనుకున్నారో వాటి కోసం కాస్త సమయం కేటాయించాలి. ఇది ప్రత్యక్షంగా మీకే కాదు.. పరోక్షంగా మీ ఉద్యోగానికీ ఉపయోగపడుతుంది. తద్వారా కెరీర్‌లో వేగంగా ఉన్నతి సాధించచ్చు. అయితే ఈ విషయంలో చాలామంది ‘మాకు రోజువారీ పనులకే సమయం సరిపోదు.. ఇక మిగతా విషయాలపై ఎలా దృష్టి సారించగలం?’ అంటూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు. కానీ మనసుంటే మార్గముంటుందన్నట్లు.. ఓ ప్రణాళిక ప్రకారం పనుల్ని సమన్వయం చేసుకోగలిగితే నిర్దేశించుకున్న లక్ష్యాలపై శ్రద్ధ పెట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

నిత్య విద్యార్థిగా..!

కెరీర్‌లో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండడం ఎంతో ముఖ్యమన్న విషయం తెలిసిందే! అయినా చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కెరీర్‌లో త్వరితగతిన అభివృద్ధి సాధించకపోవడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే చేస్తున్న పనికి సంబంధించిన అంశాలపై పూర్తి పట్టు సాధించడం, అందులో వస్తోన్న మార్పుల్ని గ్రహించి వాటిపై పరిజ్ఞానం పెంచుకోవడం తప్పనిసరి అంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటే పనిని మరింతగా ఆస్వాదించచ్చు. ఈ చురుకుదనమే మనల్ని అనుకున్నంత త్వరగా అందలమెక్కిస్తుంది.

ఆ ఆలోచన తప్పు!

ఒకే సంస్థలో ఎక్కువ కాలం పాటు పనిచేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నతిని సాధించలేమనుకుంటారు చాలామంది. అందుకే జీతభత్యాలు, ప్రమోషన్లు వెంటవెంటనే వచ్చే సంస్థలేంటో అన్వేషించి మరీ పదే పదే కంపెనీలు మారుతుంటారు. అయితే ఈ ఆలోచన తప్పంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకే కంపెనీలో పనిచేసినా చురుగ్గా మనం ఎంచుకునే బాధ్యతలు, మనకున్న నైపుణ్యాలే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్త బాధ్యతల్ని స్వీకరించడానికి ఉత్సాహం చూపడం, ఓ సీనియర్‌గా కొత్తగా చేరిన ఉద్యోగుల్ని మీరు గైడ్‌ చేసే విధానం.. వంటివన్నీ మీ కెరీర్‌ని పరుగులు పెట్టించేవే!

వారినీ భాగం చేయండి!

మన కెరీర్‌ అభివృద్ధిలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పాత్ర కూడా కీలకమే అంటున్నారు నిపుణులు. అందుకే ‘నా పనేదో సమయానికి పూర్తి చేసుకుంటే చాలు’ అన్న ధోరణి వీడి.. బృందాన్ని కలుపుకొనిపోయే తత్వాన్ని అలవర్చుకోమంటున్నారు. మరీ, అత్యవసరమైతే పైఅధికారులు/బాస్‌ సలహాలు తీసుకోవడం, వారినీ మీ పనిలో భాగం చేయడం వల్ల పని పట్ల మీరు చూపించే ఉత్సాహం, మీ చురుకుదనం, ఆసక్తి.. వంటివన్నీ వారికి అర్థమవుతాయి. ఫలితంగా అటు పదోన్నతుల పరంగా, ఇటు జీతభత్యాల పరంగా మీ కెరీర్‌ పరుగులు పెట్టడం ఖాయం.

ఇక వీటితో పాటు సమయపాలన, పని పట్ల అంకితభావం, శారీరక-మానసిక ఆరోగ్యం.. ఇవన్నీ చక్కటి ఉత్పాదకతను అందించడంలో కీలకమే! తద్వారా కెరీర్‌లో వేగంగా అభివృద్ధిని సాధించచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్