ఆ ఆలోచనలు పోవాలంటే..!

ఆరోగ్యం బాలేనప్పుడో లేదా నిద్రలేమి వంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు మన ఆలోచనలు ప్రతికూలంగా సాగుతుంటాయి. ముఖ్యంగా రోజువారీ పనుల కారణంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, నిరాశ, డిప్రెషన్.. వంటి సమస్యలన్నీ ప్రతికూల ఆలోచనలకే దారి తీస్తాయి.

Published : 12 Feb 2024 20:38 IST

ఆరోగ్యం బాలేనప్పుడో లేదా నిద్రలేమి వంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు మన ఆలోచనలు ప్రతికూలంగా సాగుతుంటాయి. ముఖ్యంగా రోజువారీ పనుల కారణంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, నిరాశ, డిప్రెషన్.. వంటి సమస్యలన్నీ ప్రతికూల ఆలోచనలకే దారి తీస్తాయి. అందుకే మన ఆలోచనలు సానుకూలంగా సాగాలంటే వీటన్నింటినీ అదుపులో పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడితే తిరిగి సానుకూల ఆలోచనా ధోరణిలోకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా మన ఆలోచనా ధోరణిని వీలైనంత వరకు సానుకూలంగా ఉండేలా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.

పేపర్‌పై రాయండి..

బాధ.. సంతోషం.. ఏదైనా సరే.. మనసులో ఉన్న విషయాలను వేరొకరితో పంచుకున్నప్పుడే మన మనసు తేలికపడుతుంది. అలాగని అన్ని విషయాలనూ అందరితోనూ పంచుకోలేకపోవచ్చు. లేదా అలా పంచుకోవడం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మీ బుర్రని తొలిచేస్తున్న ఆలోచనలేంటో పేపర్‌పై రాయడానికి ప్రయత్నించండి. ఏ అంశం గురించి మీరు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఆ ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయి? వాటి పర్యవసానం ఏ విధంగా ఉండచ్చు.. ఇలా మీ ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫలితంగా మీకూ ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది.

మనసారా నవ్వండి..!

ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో మానసిక ఒత్తిడి ముందువరుసలో ఉంటోంది. అయితే దానిని ఎదుర్కొనే ఆయుధం కూడా మన దగ్గరే ఉందని మీకు తెలుసా?మన నవ్వే.. ఆ ఆయుధం! బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు మనసారా నవ్వడానికి ప్రయత్నించి చూడండి. ఇందుకోసం నచ్చిన హాస్య సన్నివేశాలను చూడడం, జోక్స్ చదవడం, చెప్పడం, వినడం.. ఇలా మీకు నచ్చిన విధంగా మనసారా నవ్వడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం మాత్రమే కాదు.. మన ఆలోచనా తీరు కూడా సక్రమంగా సానుకూల ధోరణిలో సాగుతుంది.

సృజనాత్మకంగా..

ప్రతిఒక్కరిలోనూ క్రియేటివిటీ ఉంటుంది. వాళ్లు చేసే పనిలో అది కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది సాదాసీదా జీవనశైలికి అలవాటు పడిపోయి వారి సృజనాత్మకతను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. యాంత్రికంగా పని చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల చేసే పనిలో ఆశించినంత ఫలితం రాదు సరికదా.. ఒక పని చేయడంలో మన మార్కు ఏంటో చూపించుకోవడం కూడా కష్టం అవుతుంది. అందుకే ఏ పని చేసినా సరే.. దాని గురించి సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ శైలిలో ఆలోచిస్తూ, చేసే పనిలో మీ మార్కు కనిపించేలా జాగ్రత్తపడండి. ఇలా చేస్తే మానసికంగా సంతృప్తి కలగడమే కాదు.. మన ఆలోచనలు కూడా సానుకూలంగానే సాగుతాయి.

యోగా/ ధ్యానం..

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా, అనారోగ్య సమస్యల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా.. అందుకు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. ముఖ్యంగా యోగా, ధ్యానం.. వంటి వాటిని మన రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడడమే కాదు.. మన ఆలోచనా ధోరణి కూడా సానుకూలంగా సాగుతుందంటున్నారు నిపుణులు. అనవసర విషయాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెడుతూ కాసేపు ధ్యానం చేసినా అది చక్కని ఫలితాన్ని ఇస్తుందని వారు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్