ఫ్రెండ్లీగా... హ్యాపీగా..!

మనలో చాలామందికి రోజులో సగం కంటే ఎక్కువ సమయం ఆఫీస్‌లోనే గడిచిపోతుంది. అలాంటప్పుడు పని ప్రదేశాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా మార్చుకుంటేనే ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాం.. పనిలో నాణ్యత, ఉత్పాదకతను అందించగలుగుతాం.

Updated : 05 Apr 2024 12:48 IST

మనలో చాలామందికి రోజులో సగం కంటే ఎక్కువ సమయం ఆఫీస్‌లోనే గడిచిపోతుంది. అలాంటప్పుడు పని ప్రదేశాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా మార్చుకుంటేనే ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాం.. పనిలో నాణ్యత, ఉత్పాదకతను అందించగలుగుతాం. ఇందుకోసం ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం పెంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

⚛ కొంతమంది ‘మన పనేదో మనది.. ఇతరులతో అవసరం లేద’న్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ కొన్ని పనులకు ఇతరుల సహాయం అవసరం ఉన్నా, లేకపోయినా.. మరికొన్ని పనులు బృందంతో కలిసి చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు సహోద్యోగులతో సులభంగా కలిసిపోతేనే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కాబట్టి అందరితో కలిసిపోతూ మీకు సందేహం ఉన్న విషయాల్లో సహోద్యోగుల సలహాలు తీసుకోవడం మంచిది. తద్వారా వాళ్లతో చెలిమి పెరుగుతుంది. పనిలో అనుభవమూ గడిస్తారు.

⚛ ఆఫీస్‌ పనుల్లో కొంతమంది ఉద్యోగులు చురుగ్గా ఉన్నా.. యాజమాన్యం నిర్వహించే కొన్ని రకాల యాక్టివిటీల్లో మాత్రం పాల్గొనడానికి ఆసక్తి చూపరు. కానీ సహోద్యోగుల మధ్య స్నేహం పెరగాలంటే అవీ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నెలకోసారి బృంద సభ్యులంతా కలిసి లంచ్‌/డిన్నర్‌కి వెళ్లడం, క్యాజువల్‌గా నిర్వహించే డిబేట్స్‌లో పాల్గొనడం, ఆటలు-వ్యాయామాల్లో పాల్గొనడం.. వంటివి చేయాలి. అప్పుడే సహోద్యోగుల మధ్య కమ్యూనికేషన్‌ పెరిగి స్నేహ బంధం ఏర్పడుతుంది.

⚛ ఆఫీస్‌లో వివిధ విభాగాలుంటాయి. కొన్నిసార్లు వాళ్లతోనూ కలిసి పని చేయాల్సి రావచ్చు. కాబట్టి వాళ్లు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించినా మీరు హాజరవడం, మీ బృందం ఏదైనా హాలిడే పార్టీ చేసుకున్నా వాళ్లను ఆహ్వానించడం.. వంటివి చేస్తే ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగులతోనూ స్నేహం పెంచుకోవచ్చు.

⚛ ఆటలు, వినోదం, వంట చేయడం, పుస్తక పఠనం.. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక ఉమ్మడి ఆసక్తి ఉంటుంది. లేదంటే బృంద సభ్యుల్లో ఉన్న ఉమ్మడి ఆసక్తేంటో గుర్తించాలి. దీని గురించి పదే పదే సహోద్యోగులతో చర్చించడం, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం.. వంటివి చేస్తే వాళ్లతో బంధం మరింతగా పెరుగుతుంది.

⚛ చేసే పనిలో కావచ్చు.. లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు.. కొంతమంది సహోద్యోగులు ఇబ్బంది పడడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు చూసీ చూడనట్లుగా కాకుండా.. మీకు చేతనైనంత సహాయం చేయండి. వాళ్లు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చూపండి. ఇలా మీరు చేసిన సహాయాన్ని వాళ్లు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇద్దరి మధ్య స్నేహం పెరగడానికి ఇదీ ఓ మార్గమే!

⚛ టీమ్‌తో కలిసి బయటికి డిన్నర్‌/లంచ్‌కి వెళ్లడమే కాకుండా.. మీరూ మీ ఇంట్లో అకేషనల్‌గా ఓ చిన్న పార్టీ ఏర్పాటుచేయచ్చు.. లేదంటే అందరూ కలిసి పాట్‌లక్‌ పార్టీ ప్లాన్‌ చేసుకోవచ్చు. దీనికి కాస్త వినోదాన్ని జోడిస్తే.. సహోద్యోగుల మధ్య దూరాలన్నీ తొలగిపోయి స్నేహం పెరుగుతుంది.

⚛ ఇంట్లో చేసుకున్న ప్రత్యేక వంటకాలు, స్నాక్స్‌ ఆఫీస్‌కు తెచ్చుకుంటారు కొందరు. అయితే అందరి ముందు తినడానికి మొహమాటపడుతుంటారు. అదే వాటిని తలా కొంచెం సహోద్యోగులతో పంచుకుంటే.. ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.. అక్కడ ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులతో స్నేహం కూడా పెరుగుతుంది.

⚛ ఒకరు అందంగా తయారై ఆఫీస్‌కు రావచ్చు.. మరొకరు ఓ ఫ్యాషనబుల్‌ డ్రస్‌ వేసుకొని రావచ్చు.. ఇంకొకరు పనిలో చక్కటి ప్రతిభ కనబర్చచ్చు.. ఇలాంటి వాళ్లను చూసి ఈర్ష్యపడకుండా.. చక్కటి కాంప్లిమెంట్‌ ఇవ్వండి. వాళ్లూ హ్యాపీగా ఫీలవుతారు.. మీతో సులభంగా కలిసిపోతారు.

⚛ కొన్ని సంస్థలు ‘ఓపెన్‌ ఆఫీస్‌ వర్క్‌స్పేస్‌’ పద్ధతిని పాటిస్తుంటాయి. అంటే.. హోదాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకే చోట కూర్చొని పనిచేయడమన్న మాట! దీనివల్ల కూడా ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే చేసే పనుల్లో వచ్చిన ఆలోచనల్ని అప్పటికప్పుడే పంచుకోవచ్చు.. సందేహాల్నీ వెంటనే నివృత్తి చేసుకోవచ్చు.

ఇలాంటి స్నేహపూర్వక, ఆహ్లాదకరమైన వాతావరణం మన చుట్టూ ఉంటే ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాం. తద్వారా పనిలో నాణ్యత, ఉత్పాదకత పెరుగుతుంది. కెరీర్‌లోనూ ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్