‘సూపర్‌మామ్’ కాకపోయినా ఓకే.. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త!

ఇల్లు, ఉద్యోగం.. రెంటినీ బ్యాలన్స్ చేయడమంటే ఎవరికైనా సరే- కత్తి మీద సామే! అయితే ఈ క్రమంలో ఉన్నతమైన, అసాధారణమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటారు కొందరు మహిళలు. ప్రతి పనినీ పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకుంటారు. ఆఖరికి వీటిని చేరుకోలేక తీవ్రమైన....

Published : 04 May 2022 12:48 IST

ఇల్లు, ఉద్యోగం.. రెంటినీ బ్యాలన్స్ చేయడమంటే ఎవరికైనా సరే- కత్తి మీద సామే! అయితే ఈ క్రమంలో ఉన్నతమైన, అసాధారణమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటారు కొందరు మహిళలు. ప్రతి పనినీ పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకుంటారు. ఆఖరికి వీటిని చేరుకోలేక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. దీన్నే ‘సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. ఈ సమస్య అటు ఆరోగ్యాన్ని, ఇటు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. దీన్ని అధిగమించడం మన చేతుల్లోనే ఉందని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అన్నింటికంటే ముఖ్యమని సలహా ఇస్తున్నారు.

అటు వృత్తిఉద్యోగాల్లో కొనసాగుతూనే.. ఇటు భార్యగా, తల్లిగా, కోడలిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఇలా ఎన్నెన్నో బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తుంటారు మహిళా మణులు. అయితే ఈ క్రమంలో ప్రతి పనిలోనూ పర్‌ఫెక్షనిజాన్ని కోరుకుంటారు. తమను తామే నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంత చేసినా లక్ష్యాన్ని చేరుకోలేని పక్షంలో తీవ్రమైన అసహనం, ఒత్తిడి ఆవహిస్తుంటుంది. ఓడిపోయామన్న భావన కలుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని ‘సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌’గా అభివర్ణిస్తున్నారు నిపుణులు.

ఈ లక్షణాలతో గుర్తించచ్చు!

ఈ సిండ్రోమ్‌తో బాధపడుతోన్న మహిళలు ‘నా’ అన్న విషయం మర్చిపోయి చుట్టూ ఉన్న వారి గురించే తెగ ఆలోచిస్తుంటారు. తద్వారా ప్రతి క్షణం, ప్రతి పనిలో అవతలి వాళ్లను సంతృప్తిపరచలేమేమో అనే ఫీలింగ్‌తో ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇది వారిలో విపరీతమైన ఒత్తిడికి దారితీస్తుంది. దీని కారణంగా ఏకాగ్రత లోపం, మతిమరుపు, మూడ్‌ స్వింగ్స్‌, ఆందోళన, కోపం, చిరాకు.. వంటి లక్షణాల్ని గమనించచ్చు. ఇక వీటి మూలంగా బరువు పెరగడం, పొత్తి కడుపులో నొప్పి, కండరాల సమస్యలు, చర్మ సమస్యలు, యాంగ్జైటీ, శ్వాస తీసుకోలేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.. వంటి అనారోగ్యాలు బాధిస్తాయి.

అధిగమించడమెలా?!

ఇలా ఈ సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌ అటు మన వ్యక్తిగత, ఇటు వృత్తిపరమైన జీవితాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుంటుంది. అయితే దీన్ని ఎదుర్కోవాలంటే మాత్రం మన జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.

మీకోసం మీరు!

వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌లో కూరుకుపోయిన మహిళలు తమను తామే మర్చిపోతుంటారు. నిజానికి ఇది వారి వ్యక్తిగత జీవితానికి ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే.. ఎవరి కోసం వారు కొంత సమయం కేటాయించడం ముఖ్యం. నచ్చిన వారితో సమయం గడిపేందుకు వ్యక్తిగత ప్రదేశాన్ని ఏర్పాటుచేసుకోవాలి. అలాగే నచ్చిన పనులు చేయడం వల్ల స్వీయ ప్రేమ పెరుగుతుంది. జిమ్‌తో పాటు ఇంట్లో చేసే వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది.

ఎవరూ పర్‌ఫెక్ట్‌ కారు!

ప్రతి పనినీ పర్‌ఫెక్ట్‌గా చేయాలని అసాధారణ లక్ష్యాలు పెట్టుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంటుంది. నిజానికి ఈ విషయంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కారని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ప్రతి రోజూ ఇల్లంతా నీట్‌గా ఉంచాలి.. సమయానికి ఆఫీస్‌ వర్క్‌ పూర్తిచేయాలి.. పిల్లల్ని చూసుకోవాలి.. ఇలా ఒక రోజులో ఇన్ని పనులు సాధ్యం కాకపోవచ్చు.. కాబట్టి ప్రాధాన్యతల్ని బట్టి చేయాల్సిన పనులేవో నోట్‌ చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయడం.. వంటి పనులు వారాంతాలకు వాయిదా వేసినా నష్టం లేదు. ఇలా అవసరమైన పనులే చేయడం వల్ల మీకంటూ కేటాయించడానికి కాస్త సమయం చిక్కుతుంది. ఫలితంగా ఒత్తిడినీ అధిగమించచ్చు.

సహాయం కోరండి!

ఇంట్లో వాళ్లెవరూ చెప్పిన పనిని నీట్‌గా చేయరు.. అటు ఆఫీస్‌లోనూ ఫలానా పనిని నేనైతేనే పర్‌ఫెక్ట్‌గా చేయగలను.. అంటూ అదనపు భారం తమ నెత్తిన వేసుకుంటారు కొందరు మహిళలు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. పైగా మనం రోబోలం కాదు కదా.. ప్రతి పనినీ క్షణాల్లో పూర్తిచేయడానికి! కాబట్టి ఇంటి పనుల్లో కొన్ని మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు పంచండి. ఇక ఆఫీస్‌లో మీకు సాధ్యమైనంత పనులే స్వీకరించి.. అదనపు పని భారానికి ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేయాలనుకున్న పనుల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తారు. తద్వారా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌ను అధిగమించడానికి ఇదీ ఓ మంత్రమే!

కౌన్సెలింగ్‌ ఎప్పుడు?!

‘అతి ఏదైనా అనర్థదాయకమే’ అన్నట్లు ఒత్తిడి ఎక్కువైనా కుంగుబాటుకు గురవుతాం.. దీంతో మనసు నిండా ప్రతికూల ఆలోచనలే తాండవిస్తుంటాయి. ఇవి తీవ్రమైతే ఆత్మహత్యాప్రయత్నం దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడలేం. ఇలాంటి సందర్భాల్లో మానసిక నిపుణులే మిమ్మల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. సమయానికి సరైన చికిత్స, మందులు వాడుతూనే.. కౌన్సెలింగ్‌ తీసుకుంటే ఈ సిండ్రోమ్‌ నుంచి త్వరలోనే బయటపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్