అపరిచిత కాల్స్‌.. ఇలా చెక్‌ పెట్టొచ్చు!

దీప్తికి ఈ మధ్య వేర్వేరు మొబైల్‌ నంబర్ల నుంచి తరచూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అంటూ అవతలి వ్యక్తి ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. పైగా తన వివరాలు అడిగితే మాత్రం వెంటనే ఫోన్‌ పెట్టేయడం....

Updated : 03 Aug 2022 17:33 IST

దీప్తికి ఈ మధ్య తెలియని మొబైల్‌ నంబర్ల నుంచి తరచూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అంటూ అవతలి వ్యక్తి ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. పైగా తన వివరాలు అడిగితే మాత్రం వెంటనే ఫోన్‌ పెట్టేయడం, టాపిక్‌ మార్చేయడం.. వంటివి చేసేవాడు.

క్రెడిట్‌ కార్డు, బ్యాంక్‌ లోన్‌ అంటూ.. ఓ వ్యక్తి తరచూ ఫోన్‌ చేసి తన సమయం వృథా చేస్తున్నాడంటోంది కీర్తి. తీరా క్రాస్‌ చెక్‌ చేసుకుందామని ఆయా బ్యాంక్‌లకు ఫోన్‌ చేస్తే అది అపరిచిత కాల్‌ అని స్పష్టమైంది.

సాధారణంగా చాలామంది తెలిసిన నంబర్లు, ఇదివరకే ఫోన్లో సేవ్‌ చేసుకున్న నంబర్ల నుంచి కాల్‌ వస్తేనే మాట్లాడడానికి సుముఖత చూపుతారు. అదే.. తెలియని నంబరైతే పట్టించుకోరు. అయితే కొన్ని సందర్భాల్లో అపరిచిత నంబర్‌ నుంచి వచ్చిన కాల్‌ కూడా స్వీకరించాల్సి రావచ్చు. కొందరు అపరిచిత వ్యక్తులు ఇదే అదనుగా భావించి మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని చెబుతోంది ఓ తాజా సర్వే. మన దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది మహిళలకు తెలియని వ్యక్తుల నుంచి రోజూ ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయని, ఇది వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అపరిచిత కాల్స్‌కి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

కొందరు అపరిచితులు మహిళల్ని వేధించడానికి మొబైల్‌ ఫోన్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. వివిధ ఫోన్‌ నంబర్ల నుంచి కాల్‌ చేస్తూ వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారు. వారిని ఇబ్బందుల పాల్జేస్తున్నారు. అయితే ఇదే విషయంపై ప్రముఖ మొబైల్‌ యాప్‌ ‘ట్రూకాలర్‌’ ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వెల్లడైన వాస్తవాలను పరిశీలిస్తే.. అవాంఛిత ఫోన్‌ కాల్స్‌ వల్ల మహిళలు ఎంతటి అసౌకర్యానికి గురవుతున్నారో అర్థమవుతుంది.

సర్వేలో ఏం తేలింది?!

దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది మహిళలకు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని.. అందులో 9 శాతం మందిని నిత్యం ఇలాంటి కాల్స్‌ వేధిస్తుంటే.. 52 శాతం మందికి వారానికోసారైనా ఇలాంటి కాల్స్‌ వస్తున్నట్లు తేలింది.

76 శాతం మంది మహిళలు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ రూపంలో అజ్ఞాత వ్యక్తుల నుంచి లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటుంటే.. ఇలా కాల్ చేసే వారిలో నాలుగు శాతం మంది ఆ మహిళలకు పరిచయస్తులే కావడం గమనార్హం. ఇలాంటి కేసులు ఎక్కువగా దిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణేల్లోనే నమోదవుతున్నాయట!

ఇక ఇలాంటి అపరిచిత కాల్స్‌పై సదరు మొబైల్ ఆపరేటర్‌కు ఫిర్యాదు చేయడానికే చాలామంది మహిళలు మొగ్గు చూపుతున్నారట! అలాగే 85 శాతం మంది ఆయా ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేస్తున్నారని, తమకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో కేవలం 12 శాతం మందే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు!

ఈ రోజుల్లో కెరీర్‌, వ్యక్తిగత పనుల రీత్యా అత్యవసర కాల్స్‌ మాట్లాడడానికే చాలామందికి తీరిక దొరకట్లేదు. అలాంటిది ఈ అనవసర కాల్స్‌ వల్ల సమయమూ వృథా అవడంతో పాటు తమ వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లుతోందని మహిళలు వాపోతున్నారు. అయితే ఒకట్రెండుసార్లు తెలియక ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనా.. ఆపై జాగ్రత్తపడాలంటే కొన్ని చిట్కాలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

వ్యక్తిగత మొబైల్‌ నంబర్లను గోప్యంగా ఉంచుకోవాలి. మీకు నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే వాటిని షేర్‌ చేయడం మంచిది.

ఈ మధ్య కొన్ని వెబ్‌సైట్లలో సమాచారం చూడాలన్నా, తెలుసుకోవాలన్నా ముందు మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవాల్సి వస్తోంది. అలాంటప్పుడు గబగబా మీ నంబర్‌ అందులో పొందుపరచకుండా.. ముందు సదరు వెబ్‌సైట్‌ ప్రామాణికమైందేనా అన్న విషయం తెలుసుకోవాలి. ఇందుకోసం ఆయా సంస్థలకు ఫోన్‌ చేయచ్చు.. లేదంటే మీకు తెలిసినవారి ద్వారానైనా ఈ విషయం అడిగి తెలుసుకోవచ్చు.

కొంతమంది ఫోన్ నంబర్‌ను లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటారు. దీనివల్ల కూడా మీ నంబర్‌ హ్యాకయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తపడాలి.

కొంతమంది కొన్ని వెబ్‌సైట్ల నుంచి తమకు కావాల్సిన సమాచారాన్ని లేదంటే సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి తమ ఫోన్ నంబర్లను ఎంటర్ చేస్తుంటారు. దీనివల్ల మీకు తెలియకుండానే మీ ఫోన్‌ నంబర్‌ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అది ప్రామాణికమైన వెబ్‌సైట్‌ అయితే సరే.. లేదంటే ఏదో ఒక సమయంలో వాళ్ల నుంచి మీకు వేధింపులు తప్పవు.

అపరిచిత కాల్స్‌, మార్కెటింగ్‌ కంపెనీల నుంచి అనవసర కాల్స్‌, సందేశాలు రాకుండా అడ్డుకోవాలంటే.. ముందు మీరు ‘National Do Not Call Registry’ లో మీ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.

మొబైల్‌కు వచ్చిన అపరిచిత సందేశాల్ని, వెబ్‌సైట్‌ లింక్స్‌ని ఆతృతతో ఓపెన్‌ చేసి చూడడం అస్సలు కరక్ట్‌ కాదు. దీనివల్ల మీ నంబర్‌ హ్యాకయ్యే ప్రమాదం ఎక్కువ.

కొంతమందికి తరచూ ఒకే నంబర్‌ నుంచి అపరిచిత కాల్స్‌, సందేశాలు రావడం.. వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటే.. కాల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్లాక్‌ చేయచ్చు.

అపరిచిత కాల్స్‌కి స్పందించకుండా ఉండాలంటే.. కొన్ని కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్స్‌ ఇందుకు ఉపయోగపడతాయి.

అపరిచిత వ్యక్తులు పదే పదే ఫోన్‌ చేసి వేధిస్తున్నట్లయితే వాళ్ల మాటలు రికార్డ్‌ చేసుకోవడానికి కొన్ని ఫోన్లలో ఆటోమేటిక్‌గా వాయిస్‌ రికార్డ్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా.. కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నా సరిపోతుంది. ఈ ఆధారంతో మీరు వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్