Published : 22/09/2022 21:24 IST

వేడి ఉత్పత్తుల వల్ల జుట్టు పాడైందా?

ధరించిన దుస్తులకు నప్పినట్లుగా జుట్టును స్ట్రెయిట్‌గా, కర్లీగా.. ఇలా ఎలా పడితే అలా చేసుకోవడానికి మార్కెట్లో వివిధ రకాల హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే! అయితే వీటి వల్ల జుట్టు అప్పటికప్పుడు అందంగా కనిపించచ్చు.. కానీ వీటి నుంచి వెలువడే అధిక వేడి కారణంగా కుదుళ్లు, జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. చివర్లు చిట్లిపోవడం, జుట్టు విపరీతంగా పొడిబారిపోవడం, గడ్డి లాగా బరకగా తయారవడం, ఎక్కడికక్కడ తెగిపోవడం.. వంటివన్నీ ఇదే కోవకు చెందుతాయని చెబుతున్నారు. ఇలా వేడి కారణంగా దెబ్బతిన్న జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తెచ్చుకోలేమా? అంటే.. అందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించాలంటున్నారు.

కొబ్బరి నూనె మాస్క్‌తో..!

తేమ కోల్పోయి పొడిబారిన జుట్టును తిరిగి రిపేర్‌ చేయడానికి కొబ్బరినూనె చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇది జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించి వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తుందంటున్నారు. ఇందుకోసం.. కొబ్బరి నూనెతో తయారుచేసిన ఈ హెయిర్‌మాస్క్‌ ప్రయత్నించమంటున్నారు. ఒక టేబుల్‌స్పూన్‌ ఆర్గాన్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక విటమిన్‌ ‘ఇ’ క్యాప్సూల్‌, కొద్దిగా షియా బటర్‌ వేసి.. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల వేడి వల్ల డ్యామేజ్‌ అయిన జుట్టు తిరిగి తేమను సంతరించుకుంటుంది.. ఈ చిట్కా జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలకు దోహదం చేస్తుంది.

మీది కర్లీ హెయిరా?

ఉంగరాల జుట్టున్న వారి వెంట్రుకలు సాధారణంగానే పొడిబారినట్లుగా, గడ్డిలాగా కనిపిస్తాయి. అలాంటి వారు తమ జుట్టుకు హీటింగ్‌ ఉత్పత్తుల్ని వాడితే అది మరింత డ్యామేజ్‌ అవుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎప్సం సాల్ట్‌ చక్కటి ప్రత్యామ్నాయం అని చెబుతోంది ఓ అధ్యయనం. ఇందుకోసం.. కండిషనర్‌, ఎప్సం సాల్ట్‌.. రెండింటినీ సమాన పరిమాణాల్లో తీసుకొని కొద్దిగా వేడిచేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమంతో కుదుళ్లు, జుట్టుపై మునివేళ్లతో మర్దన చేయాలి. ఆపై అరగంట పాటు అలాగే ఉంచుకొని.. చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కా వల్ల పొడిబారిన కుదుళ్లు, జుట్టు తిరిగి తేమను సంతరించుకుంటాయి.

కెఫీన్‌తో రిపేర్!

బ్లో డ్రయర్స్‌, ఇతర హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌ వల్ల జుట్టు చిక్కులు కడుతుంది. ఇలాంటి జుట్టును రిపేర్‌ చేయడం టీతోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా.. కొన్ని తేయాకులు/టీ పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక జుట్టు, కుదుళ్లపై నుంచి పోసి.. ఆపై జుట్టుకు టవల్‌ చుట్టేయాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లటి నీటితో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ టీ మిశ్రమంలోని కెఫీన్‌ జుట్టుకు, కుదుళ్లకు సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. అలాగే వెంట్రుకల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని