వాళ్ల మాటల్లో.. చూపుల్లో.. తేడా గమనిస్తున్నారా?

జీవితంలో మనకు ఎందరో తారసపడుతుంటారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అయితే మనకు తారసపడే కొంతమంది వ్యక్తులతో ఒక్కోసారి మనం ఎక్కువ కాలం ప్రయాణించాల్సి రావచ్చు.

Updated : 27 Dec 2023 14:53 IST

జీవితంలో మనకు ఎందరో తారసపడుతుంటారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అయితే మనకు తారసపడే కొంతమంది వ్యక్తులతో ఒక్కోసారి మనం ఎక్కువ కాలం ప్రయాణించాల్సి రావచ్చు. ఉదాహరణకు కాలేజీలోనో, ఆఫీసులోనో నిత్యం కొంతమందితో ఏదోవిధంగా మాట్లాడుతూనే ఉంటాం. వారితో కలిసి పని చేస్తూనే ఉంటాం.. అయితే ఈ క్రమంలో- కొంతమంది మనతో మంచిగా ఉన్నట్లు నటిస్తూనే, మనల్ని లోబరుచుకోవడానికి, తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.. ఈ క్రమంలో- కాలేజీ అమ్మాయిలకైనా, ఉద్యోగినులకైనా ఎవరు ఎలాంటి వారో ముందుగానే తెలుసుకుని మసలుకోవడం ఎంతో అవసరం...

మంచిగా ఉంటూనే..

కాలేజీలో చదువుకునేటప్పుడు, ఆఫీసులో పని చేసేటప్పుడు ఒకరితో మరొకరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది తమ ఎదుగుదల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం మనతో మంచిగా ఉన్నట్లు నటిస్తూనే మోసం చేస్తుంటారు ఈ క్రమంలో- మన పైన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతుంటారు. అలాగే- మనకు అవసరం లేకున్నా, మనం అడగకపోయినా ఇతరుల రహస్యాలను మనకు మాత్రమే చెబుతున్నట్టుగా నటిస్తుంటారు. దాంతో వారిపై మనకు ఎనలేని నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో మిగిలినవారు ఏం చెప్పినా పట్టించుకోము. క్రమంగా వారికి దూరమవుతాం. ఇలా మనల్ని అందరికీ దూరమయ్యేలా చేసి, మనకెలాంటి అవసరం వచ్చినా వారిపై ఆధారపడేట్టుగా మలచుకుంటారు. ఈ క్రమంలో వారి అవసరాలూ తీర్చుకుంటారు. చివరికి వారి లక్ష్యం నెరవేరాక మనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. కాలేజీ, ఆఫీసులో అనే కాదు.. అన్నిచోట్లా ఇలాంటివాళ్లు కనిపిస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.

ముద్దు పేర్లతో..

సాధారణంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ముద్దుపేర్లతో పిలుస్తుంటారు. కానీ, కొంతమంది ఇతరులను ఆకర్షించడానికి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ముద్దు పేర్లతో పిలిచి మాయ చేస్తుంటారు. ఇలాంటివి కాలేజీలో, ఆఫీసులోనూ జరుగుతుంటాయి. ఇలాంటి వారు మాటల మధ్యలో ముద్దుపేరుతో పిలిచి మిమ్మల్ని పరీక్షిస్తారు. మీ ప్రతిస్పందనలను బట్టి కొద్ది కొద్దిగా దగ్గరవుతారు. దాంతో వారు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారన్న భావన మీలో కలుగుతుంది. ఇలా చేయడానికి వారికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ క్రమంలో మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకోవడానికి వెనుకాడరు. తర్వాత అదే అదనుగా మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇలాంటి వారి ఎత్తుగడలను ముందుగానే గుర్తించి, వారిని దూరం పెట్టాలి.

కంటి చూపుతోనే..

అలాగే మరికొంతమంది కంటి చూపుతోనే లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి వారి కుయుక్తుల గురించి మనం ఏమాత్రం గ్రహించలేకపోవచ్చు. ఈ క్రమంలో మిమ్మల్ని తదేకంగా చూస్తూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి చర్యలకు మీరు ఎలా ప్రతిస్పందిస్తున్నారో ఓసారి పరీక్షించుకుంటారు. వారికి అనుకూలంగా మీరు ప్రవర్తిస్తే.. క్రమంగా మాట్లాడడం మొదలుపెడతారు. ఆ తర్వాత నిదానంగా అసలు స్వరూపం బయటపెడతారు. కాబట్టి, ఎదుటివాళ్ల మాటల్లో, చూపుల్లో ఏమాత్రం కాస్త తేడా కనిపించినా - అలాంటి వాళ్లని దూరంగా ఉంచడం మంచిది.

వాటిని అందరితోనూ పంచుకోవద్దు..

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొంతమంది ఎవరితోనూ పంచుకోకుండానే వారి సమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. కానీ, కొంతమంది ఏ చిన్న సమస్య వచ్చినా సరే, భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఇతరులతో పంచుకుంటారు. ఈ క్రమంలో అవతలి వ్యక్తి మంచివారైతే ఫరవాలేదు కానీ, కొంతమంది అదే అదనుగా లోబరుచుకోవాలని ప్రయత్నిస్తారు. మీ పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వారు ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఏమాత్రం అనుమానంగా అనిపించినా వారిని దూరం పెట్టండి. అలాగే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్