మాంగై.. వెప్పం పూరసం.. వీటి గురించి విన్నారా?

భారతదేశం అనేక సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టిల్లు. అటువంటి భారత సంస్కృతికి అందమైన రంగులద్ది మెరుగులు దిద్దేవి పండగలు. వాటిలో ‘ఉగాది’ ముఖ్యమైంది. తెలుగు సంవత్సరం ప్రారంభానికి సూచకంగా ఈ పండగను జరుపుకొంటారు. అలాగని ఈ పర్వదినం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు.

Published : 09 Apr 2024 13:37 IST

భారతదేశం అనేక సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టిల్లు. అటువంటి భారత సంస్కృతికి అందమైన రంగులద్ది మెరుగులు దిద్దేవి పండగలు. వాటిలో ‘ఉగాది’ ముఖ్యమైంది. తెలుగు సంవత్సరం ప్రారంభానికి సూచకంగా ఈ పండగను జరుపుకొంటారు. అలాగని ఈ పర్వదినం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. పండగ ఒకటే.. పేర్లు వేరు అన్నట్లుగా ఉగాదిని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకొంటారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

తెలుగు రాష్ట్రాల్లో ‘ఉగాది’

చైత్రమాసంలోని తొలి రోజును ఉగాదిగా పిలుచుకునే తెలుగు ప్రజలు ఆ రోజు నుంచే తమకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని భావిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెల్లవారుజామునే తలస్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించాక పంచాంగ శ్రవణం చేస్తారు. పండగ రోజు కొత్త పంచాంగాన్ని బట్టి కొత్త సంవత్సరం వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుంటారు.

కర్ణాటకలోనూ ‘ఉగాది’!

ఉగాది పండగని అత్యంత సంబరంగా నిర్వహించే మరో రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ కూడా ఈ పండగని ‘ఉగాది’ అనే పేరుతోనే పిలుస్తారు. పండగకు వారం ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెడతారు.

ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసుకున్నాక తలస్నానం చేయడం ఇక్కడి ఆచారం. ఆ తరువాత ఘుమఘుమలాడే వంటలను తయారుచేసి అతిథులకు రుచికరమైన విందు ఏర్పాటు చేస్తారు. తెలుగు వారి ఉగాది పచ్చడిలానే కర్ణాటకలో 'బేవుబెల్ల’ తయారుచేస్తారు. మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ప్రతిబింబిస్తూ వేపపువ్వు, బెల్లం, చింతపండు రసం, పచ్చిమామిడి ముక్కల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి పచ్చడి తయారు చేస్తారు. దీంతో పాటు ఒబ్బట్టు, పులిహోర తప్పనిసరిగా చేసుకొనే వంటకాలు.

మహారాష్ట్రలో ‘గుడిపడ్వా’..

మహారాష్ట్రలో ఈ ప్రత్యేక పర్వదినాన్ని ‘గుడిపడ్వా’గా పిలుచుకుంటారు. ఇక్కడి ప్రజలు ఆరోజు ఇంటి ముందు ముగ్గులు వేసి అందులో రంగులు నింపుతారు. ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత.. లేత వేపాకులు, శెనగపప్పు, జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంలా పంచుతారు. వెదురు కర్రకు సిల్క్ వస్త్రాన్ని చుట్టి కర్ర పైభాగంలో రాగి పాత్రను బోర్లించి ఉంచుతారు. ఇలా అలంకరించిన కర్రను ఇంటిముందు వరండాలో లేదా వాకిట్లో నిలబెడతారు. ఇలా చేస్తే ఇంట్లో ఉండే బాధలు, ప్రతికూలతల్ని వెదురు పూర్తిగా నాశనం చేస్తుందని మహారాష్ట్ర ప్రజల విశ్వాసం.

కేరళలో ‘విషు’

మలయాళ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలోని తొలి మాసం పేరు ‘మెదమ్’. ఈ నెలలోని మొదటి రోజే ‘విషు’. తమిళనాడు, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లా ఏప్రిల్ నెలలోనే కేరళ ప్రజలు కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. పండగ రోజు నిద్ర లేచిన వెంటనే తాళపత్రాలు, శుభ్రమైన తెల్లటి వస్త్రం, బంగారు ఆభరణాలు, వరి, కొన్నా అనే చెట్టు పూలు, సగానికి విడదీసిన పనసపండు, కొబ్బరికాయ, కుండలో నింపిన దోసకాయలు.. తదితర వాటిల్లో ఏదో ఒకదాన్ని చూసిన తరువాతే రోజును ప్రారంభిస్తారు.

కుటుంబంలోని పెద్దలు, పిల్లలకు ఆరోజు కొంత డబ్బు లేదా ఏదైనా బహుమతి ఇస్తారు. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వారి నమ్మకం. ఈ పద్ధతిని ‘విషు కైనీతమ్’ అంటారు. ఆడవాళ్లు పనస, గుమ్మడి, పచ్చి మామిడితో వంటలు తయారుచేస్తారు. తెలుగువారికి ఉగాది పచ్చడిలా.. కేరళలో ఆరోజు ‘వెప్పం పూరసం’ (వేపతో చేసే వంటకం), ‘మంపజ పచ్చడి’ (పచ్చి మామిడి సూప్) ప్రత్యేక వంటకాలు.

పశ్చిమ బంగాలో ‘నయా బర్షా’

బెంగాలీ క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని పొహెలా బైసాఖ్ అని, ఈనెలలోని మొదటి రోజును ‘నయా బర్షా’ అని పిలుస్తారు. అంటే కొత్త సంవత్సరం అని అర్థం. ఈ పండగ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు పిండితో రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో స్వస్తిక్ గుర్తు గల కలశం డిజైన్ వేస్తారు. ఇలా వేసిన ముగ్గును ‘అల్పన’ అని పిలుస్తారు. దగ్గర్లోని నదులకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించి, ఇంట్లో లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ రాకూడదని ఇలా చేస్తారు.

వ్యాపారవేత్తలు పండగ రోజు నుంచి వారి వ్యాపార వివరాలను తాజాగా నమోదు చేసుకునేందుకు కొత్త పుస్తకాలు కొంటారు. ఈ పద్ధతిని ‘హాల్‌ఖాతా’ అంటారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాటలు, నృత్యాలతో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. స్త్రీ, పురుషులు బెంగాలీ సంప్రదాయ వస్త్రాలు ధరించి బంధుమిత్రుల ఇంటికి వెళ్లి ‘షువో నొబో బొర్షో’ అంటూ ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

తమిళనాడులో ‘పుతండు’

‘పుతండు’ పేరుతో తమిళనాడులో ఉగాది పండగను జరుపుకొంటూ కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతారు. పుతండుకు ‘వరుష పిరప్పు’ అనే పేరు కూడా ఉంది. పుతండు రోజు తమిళనాడులో బంగారం, వెండి ఆభరణాలు, డ్రైఫ్రూట్స్, పండ్లు, తాజా పువ్వులు, కూరగాయలు, ముడిధాన్యం, కొబ్బరికాయలు, తమలపాకులు.. మొదలైన వాటిలో నిద్రలేవగానే ఏదో ఒకదాన్ని చూసే ఆచారం ఉంది. ఆ తరువాతే రోజును ప్రారంభిస్తారు. దీన్ని ‘కన్ని’ అని పిలుస్తారు. ఇలా చేస్తే ఏడాదంతా సుఖసంతోషాలతో నిండిపోతుందని వారి నమ్మకం.

ఈ ప్రత్యేకమైన రోజున మహిళలు ఇంటిముందు ముగ్గులు వేసి వాటి మధ్యలో దీపం ఆకృతిని వేస్తారు. కొత్త సంవత్సరంలో రానున్న రోజుల్లో చీకటంతా తొలగిపోయి జీవితం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇలా పుతండు నాడు వేసే ముగ్గును ‘కోలం’ అని, మధ్యలో వేసిన దీపాన్ని ‘కుతువిళక్కు’ అని పిలుస్తారు. ఆ తర్వాత తలస్నానాలు చేయడం, గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నాక పంచాంగ శ్రవణం చేయడం పరిపాటి. బెల్లం, పచ్చిమామిడి, వేప పువ్వు కలిపిన ‘మాంగై పచ్చడి’ తమిళనాడు పుతండు ప్రత్యేకం. బంధుమిత్రులకు ‘పుతండు వజ్తుకల్’ అని శుభాకాంక్షలు తెలిపి పండగ రోజంతా సరదాగా గడుపుతారు తమిళులు.

ఇవే కాకుండా.. రాజస్థాన్‌లో తప్నా, సింధ్‌లో ఛెటిచాంద్, పంజాబ్‌లో బైసాఖీ, హిమాచల్ ప్రదేశ్‌లో సెరీ సజ.. పేరుతో ఉగాది జరుపుకొంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా ఇండోనేషియాలో ఉండే హిందువులు ‘న్యేపి’ పేరుతో ఈ పండగను ఘనంగా నిర్వహిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్