ఆ అవకాశం రావాలా?

‘నాకూ అవకాశం ఇచ్చుంటేనా..’ కోరుకున్న హోదా దక్కనపుడు, తోటివాళ్లు విఫలమైనప్పుడు ఆఫీసులో సహజంగానే ఈ మాట వచ్చేస్తుంది కదూ! కానీ ఎప్పుడైనా ఆలోచించారా మిమ్మల్ని దాటి వాళ్లకే ఆ అవకాశం ఎందుకు వచ్చిందో? బహుశా ఈ నైపుణ్యాలు లోపించాయేమో చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు.

Updated : 09 Feb 2023 12:54 IST

‘నాకూ అవకాశం ఇచ్చుంటేనా..’ కోరుకున్న హోదా దక్కనపుడు, తోటివాళ్లు విఫలమైనప్పుడు ఆఫీసులో సహజంగానే ఈ మాట వచ్చేస్తుంది కదూ! కానీ ఎప్పుడైనా ఆలోచించారా మిమ్మల్ని దాటి వాళ్లకే ఆ అవకాశం ఎందుకు వచ్చిందో? బహుశా ఈ నైపుణ్యాలు లోపించాయేమో చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు.

* ముందుకు రావాలి.. ఆనందకరమైన వాతావరణంలో పనిచేయడంలో గొప్పేమీ లేదు. ఒత్తిడిలోనూ పనిచేయగలగాలి, ముగించే సమయంలో పొరపాటూ జరగొచ్చు. ఒక్కోసారి ఉద్యోగానికే ముప్పు అవొచ్చు. ఆ స్థితిలోనూ చేయడానికే ముందుకొచ్చే వారినే సంస్థలు ‘నాయకులు’గా పరిగణిస్తాయి.

* నమ్మకం.. ‘ఇది తనైతే చేయగలదు’ అన్న భరోసా మీ బృందానికి ఇవ్వగలిగారా? దేన్నైనా ఒకసారి తీసుకుంటే పూర్తిచేయగలదు అన్న భరోసా కల్పించినపుడే ముందుకు నడిపించగలరన్న నమ్మకమూ ఏర్పరచగలుగుతారు. ఇక్కడ పని పూర్తిచేయడమే కాదు.. పొరపాట్లకూ తావివ్వకుండా ఉండగలగాలి.

* వాటి సంగతేంటి? ఇల్లు, ఉద్యోగం రెండూ చూసుకోవాలి మనం. అనారోగ్యం, బాధ్యతలతో సతమతం అవుతుండటం సాధారణమే! వాటిని పని దగ్గరికి తీసుకొచ్చినా, ఆ చిరాకులను ఇక్కడ ప్రదర్శించినా మీరు విఫలమైనట్టే. ఎంతసేపూ మీ ఇబ్బందుల గురించే ఆలోచించొద్దు. పక్కవాళ్లవీ తెలుసుకోగలగాలి. అవసరమైతే సాయం చేసేందుకు ముందుకు రావాలి. అప్పుడే మిమ్మల్ని అనుసరించడానికి ఇతరులూ ముందుకొస్తారు.

అయితేనేం.. అన్నిసార్లూ తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోవచ్చు. అవాంతరాలు ఎదురవొచ్చు. మధ్యలోనే వదిలేయడం, తప్పు దొర్లినపుడు ఇతరులపై తోయడం మంచి పద్ధతి కాదు. విజయాన్నే కాదు.. అపజయాన్నీ స్వీకరించడానికి ముందుకు రావాలి.

చేయందించాలి.. పని చేసే చోట ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. కొందరు వేగంగా పూర్తి చేయగలిగితే ఇంకొందరు నెమ్మదిగా చేస్తారు. ఎలా ఉన్నా కలుపుకొంటూ పోవడమే నాయకురాలి లక్షణం. వాళ్లని అవమానించేలా మాట్లాడటం, దూషించడం మంచి పద్ధతి కాదు. వాళ్ల పనితీరు వెనుక కారణాన్ని కనుక్కోవాలి. వేగంగా చేసేలా ప్రోత్సహించాలి. కావాలని చేస్తోంటే మాత్రం కఠినంగా వ్యవహరించాలి. అమ్మలా తోడ్పాటు ఇవ్వడమే కాదు.. సరైన దారిలో నడిచేలా చూడటమూ లీడర్‌ పనే! అయితే అన్నింటికీ ‘బెత్తమే పరిష్కారం’ అన్న ధోరణి మంచిది కాదు. ఈ లక్షణాలన్నీ మీలోనూ ఉన్నాయా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్