అత్తమామల్లో ఒక్కరే ఉంటే..!

పెళ్లైన అమ్మాయికి అత్తిల్లే పుట్టిల్లు. అత్తమామలు, ఆడపడుచులు, తోడికోడళ్లతో ఎంత కలుపుగోలుగా ఉంటే అంత త్వరగా వారితో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. అయితే కొంతమందికి అత్తింట్లో అత్తగారు లేదా మామగారు.. ఇలా సింగిల్‌ పేరెంటే ఉండచ్చు.

Updated : 08 Feb 2024 16:50 IST

పెళ్లైన అమ్మాయికి అత్తిల్లే పుట్టిల్లు. అత్తమామలు, ఆడపడుచులు, తోడికోడళ్లతో ఎంత కలుపుగోలుగా ఉంటే అంత త్వరగా వారితో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. అయితే కొంతమందికి అత్తింట్లో అత్తగారు లేదా మామగారు.. ఇలా సింగిల్‌ పేరెంటే ఉండచ్చు. అప్పటికే వాళ్లు తమ భాగస్వామిని దూరం చేసుకొని లేదంటే వారి నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా గడుపుతుండచ్చు. ఇలాంటి సమయంలో అత్తింట్లోకి అడుగుపెట్టిన కోడలు వారితో కూతురిలా కలిసిపోవాలి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలు, అభద్రతా భావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదే కాదు.. అత్తింట్లో సింగిల్‌ పేరెంట్‌తో అనుబంధం పెంచుకోవాలంటే కోడలిగా మరిన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలికి అత్తమామలిద్దరూ తల్లిదండ్రుల్ని మరిపిస్తారు.. అమ్మానాన్నల్లా ప్రేమ పంచుతారు. అయితే ఇలా ఇద్దరూ కాకుండా అత్తమామల్లో ఎవరో ఒకరు చనిపోవడం లేదంటే ఇద్దరూ విడిపోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండే వాళ్ల బాధ వర్ణనాతీతం! ఈ క్రమంలో వాళ్ల బాగోగులు చూసుకోవడమే కాదు.. కోడలిగా వాళ్లకు ఎమోషనల్‌ సపోర్ట్‌ అందించడమూ ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

‘భాగస్వామి తోడు లేదు.. కొడుకు-కోడలు తమను ఎలా చూసుకుంటారో’నన్న భయం, అభద్రతా భావం ఒంటరిగా ఉండే అత్త/మామల్లో సహజం. వారిలో ఉన్న ఈ భయాన్ని దూరం చేయాలంటే వాళ్లతో కలుపుగోలుగా ఉండాలి. వాళ్ల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ‘మీరు ఒంటరి కాదు.. మీకు మేమున్నామ’న్న భరోసా కల్పించాలి.

మలివయసులో ఒంటరితనం వల్ల వాళ్ల మనసు మనసులో ఉండదు.. వారి మదిలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఈ ఒత్తిడి వల్ల ఒక్కోసారి అనుకోకుండా మిమ్మల్ని ఓ మాట అనొచ్చు. అయినా ఎదురు మాట్లాడకుండా, వారితో గొడవకు దిగకుండా వారి ఎమోషన్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా వాళ్ల కోపం తగ్గాక వాళ్లే మిమ్మల్ని దగ్గరికి పిలుచుకొని క్షమాపణ చెప్పచ్చు.. లేదంటే మరో రూపంలో మీ మనసును శాంతింపజేసే ప్రయత్నం చేయచ్చు. ఇది కూడా ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢం చేసేదే!

కొంతమంది అత్త/మామ ఒంటరిగా ఉన్నా.. సొంతూర్లోనో లేదంటే వేరే ఇంట్లోనో ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారిని తమతో ఉండమని బలవంతం చేయడం సరికాదంటున్నారు నిపుణులు. వాళ్ల నిర్ణయానికి గౌరవమివ్వడంతో పాటు అప్పుడప్పుడూ మీరే వాళ్లుంటున్న ఇంటికి వెళ్లి వారితో గడపడం వల్ల ఒకరినొకరు మిస్సవుతున్నామన్న బాధ ఉండదు. అలాగే ఇద్దరి మధ్య అనుబంధమూ దూరమవకుండా జాగ్రత్తపడచ్చు.

ఇలా విడివిడిగా కాకుండా తమతో పాటు ఉండే ఒంటరి అత్తగారు లేదా మామగారు తమకంటూ కాస్త వ్యక్తిగత సమయం కేటాయించుకునేలా ప్రోత్సహించాలి. అలాగే మీరూ మీ ప్రైవసీకి భంగం కలగకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన పనులు, అభిరుచులపై వారు దృష్టి పెడితే ఇటు మనసు ప్రశాంతంగా ఉంటుంది.. అటు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధమూ పెరుగుతుంది.. అలాగే ఇద్దరిలోనూ స్వీయ ప్రేమ అలవడుతుంది.

ప్రేమగా వండి వార్చడం కూడా ఒంటరి అత్త/మామలతో అనుబంధం దృఢం చేసుకోవడానికి ఓ మార్గమే! ఈ క్రమంలో వారికి నచ్చిన వంటకాలు, స్వీట్లు, పిండి వంటలు.. ఇలా మీకు వీలు చిక్కినప్పుడల్లా వారికి ఏదో ఒకటి చేసి పెట్టచ్చు.. అలాగే వారు ప్రేమతో చేసిన వంటకాల్నీ మీరూ హ్యాపీగా ఆస్వాదిస్తే వారి మనసూ తృప్తి పడుతుంది.

కోడలికి అత్తింట్లో పలు సమస్యలూ ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచీ ఇబ్బందులు రావచ్చు.. ఇలాంటప్పుడు వాటిని మనసులోనే దాచుకుంటే సమస్య తీరదు.. సరికదా కుటుంబ సభ్యులతో దూరం మరింతగా పెరుగుతుంది. కాబట్టి వాటిని మీ అత్త/మామ గార్లతో పంచుకోవడం వల్ల వారు తమ అనుభవంతో ఆ సమస్యకు తగిన పరిష్కారం చూపుతారు.. ఫలితంగా కుటుంబ సభ్యులకు తిరిగి దగ్గరవ్వచ్చు.

వృత్తిపరంగా బిజీగా ఉండడం, ఇతర వ్యక్తిగత కారణాల రీత్యా.. ఒక్కోసారి మీ భాగస్వామి వారి తల్లిదండ్రులకు తగిన సమయం కేటాయించలేకపోతారు. దీంతో వాళ్ల మనసులు బాధపడచ్చు. అందుకే మీ భాగస్వామి ఒంటరి తల్లి లేదా తండ్రికి తగిన సమయం కేటాయించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత కోడలిగా మీదే! ఇది ప్రత్యక్షంగా వారి అనుబంధాన్ని, పరోక్షంగా మీ ఇద్దరి అన్యోన్యతను రెట్టింపు చేస్తుంది.

మలివయసులో ఒంటరితనంతో మానసికంగా సతమతమయ్యే మీ అత్తగారు/మామగారికి ఎమోషనల్‌గానే కాదు.. ఆర్థికంగానూ సహకారం అందించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారి ఆర్థిక అవసరాలు తెలుసుకొని మరీ వాటిని తీర్చడం వల్ల వారి ఒంటరితనాన్ని దూరం చేయడంతో పాటు ఇద్దరి మధ్య అనుబంధమూ బలపడుతుంది.

వెకేషన్‌ అయినా, బయట డిన్నర్‌కి వెళ్లాలన్నా జంటగా లేదంటే పిల్లలతో కలిసి వెళ్తుంటారు చాలామంది. కానీ అప్పుడప్పుడూ ఇంట్లో ఉండే ఒంటరి అత్తగారు/మామగార్లను కూడా మీతో పాటు తీసుకెళ్తే.. వారి మనసుకూ కాస్త ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇది వారితో అనుబంధాన్నీ పెంచుతుంది.

ఇంటి పనుల్లో వారికి చేదోడు వాదోడుగా ఉండడం, వారితో స్నేహపూర్వకంగా మెలగడం వల్ల వారిలో ఉండే ఒంటరి భావనను తొలగించచ్చు.. ఫలితంగా మీ మధ్యా దృఢమైన అనుబంధాన్ని పెంపొందించుకోవచ్చు.

అయితే ఒంటరిగా ఉన్న అత్తగారు/మామగారితో ఇలా ఎంత స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా మెలిగినా.. ఇంకా వారిలో ఆ ఒంటరితనం, అభద్రతా భావం దూరం కాకపోయినా.. వారికి ఓసారి నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించడం మంచిది. ఫలితంగా వారు తిరిగి కోలుకునే అవకాశం కల్పించిన వారవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్