అప్పుడే ఎదుగుతాం..!

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్ని అధిరోహిస్తున్నా జీతభత్యాలు, అవకాశాలు.. వంటి విషయాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల సమస్యలు తప్పడం లేదు. మరి, పని ప్రదేశంలో నెలకొన్న ఇలాంటి పురుషాధిక్య ధోరణి నుంచి బయటపడాలంటే....

Published : 06 Mar 2023 20:37 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్ని అధిరోహిస్తున్నా జీతభత్యాలు, అవకాశాలు.. వంటి విషయాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల సమస్యలు తప్పడం లేదు. మరి, పని ప్రదేశంలో నెలకొన్న ఇలాంటి పురుషాధిక్య ధోరణి నుంచి బయటపడాలంటే కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఆ అంశాలేంటో తెలుసుకుందాం రండి...

వినడమే కాదు.. మాట్లాడండి!

ఆఫీసుల్లో జరిగే మీటింగుల్లో మాట్లాడడానికి, తమ అభిప్రాయాల్ని వెల్లడించడానికి పురుషుల కంటే మహిళలు తక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఓ అధ్యయనం లో తేలింది. అయితే- ఒకవేళ మహిళలు సమావేశాల్లో మాట్లాడినప్పటికీ ఇతరులు మధ్యలో కలగజేసుకుని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారట. మహిళలు చెప్పేది అంత విలువైన విషయం కాదని వారు భావించడమే అందుకు కారణమట. తద్వారా మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారట.

ఈ క్రమంలో- తమ అభిప్రాయాలను విలువైనవిగా గుర్తించి వాటిని ఆఫీసు మీటింగుల్లో నిర్భయంగా, నిస్సందేహంగా వ్యక్తపరచాలని సూచిస్తున్నారు కార్పొరేట్ నిపుణులు. ఇలా మహిళలు తమ అభిప్రాయాల్ని పంచుకోవడం మొదలుపెట్టి దాన్నే కొనసాగించడం వల్ల వినేవారు కూడా మరింత శ్రద్ధ, ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం మరింతగా రెట్టింపవుతుంది.. అది వారు చేసే పనిపై సానుకూల ప్రభావం చూపి వారిని మరింత ముందుకు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.

వారితోనే నేరుగా..

పని ప్రదేశాల్లో అటు బాస్‌తోనైనా, ఇటు ఇతర ఉద్యోగులతోనైనా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటప్పుడు కొందరు ఉద్యోగినులు ఫలానా వారి నుంచి వారికి ఎదురైన సమస్యల్ని ఇతర ఉద్యోగులతో పంచుకోవడం, వారి ప్రవర్తన గురించి అసహనం వ్యక్తం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే దీనికి బదులు మీకు ఎవరితోనైతే సమస్య ఎదురైందో ఆ విషయం గురించి వారితోనే నేరుగా మాట్లాడడం మంచిది. తద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు మీలో ఉన్న ధైర్యం గురించి కూడా వారికి తెలుస్తుంది. మీవైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా ఉంటే మీ ఈ ప్రవర్తన మిమ్మల్ని మరింత ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తుందే తప్ప మీ పురోగతిపై ఎలాంటి ప్రతికూలత చూపదు.

'నాదేం లేదులే' అనద్దు..!

ఒక ప్రాజెక్ట్ పైన పని చేస్తున్నప్పుడు అది విజయవంతం కావడానికి సర్వశక్తులూ ధారపోస్తాం. ఈ క్రమంలో మన ప్రయత్నంలో విజయం సాధించినప్పుడు పైఅధికారులు మన పనిని మెచ్చుకోవడం సహజమే. ఇలాంటి సందర్భాలలో కొంతమంది 'ఇందులో నాదేం లేదు..' అంటూ ఆ ప్రాజెక్ట్ కోసం తాము ఎంతగా కష్టపడిందీ చెప్పుకోరు.

ఇలా చేయడం వల్ల వారే ఆ పనిని పూర్తిచేయడంలో ముఖ్య భూమిక పోషించినప్పటికీ వారి ప్రతిభ, శక్తియుక్తుల గురించి ఇతరులకు తెలియకపోవచ్చు. కాబట్టి మీరు చేసిన పనికి పైఅధికారుల నుంచి అందిన ప్రశంసల్ని హుందాగా స్వీకరించండి. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం, పని పట్ల మక్కువ పెరగడంతో పాటు కెరీర్‌లోనూ పురోగతి సాధించవచ్చు.

మీరే లీడర్!

పని ప్రదేశంలో మహిళలు పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ, తమ సృజనాత్మక ఆలోచనల్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఒక్కోసారి కెరీర్‌లో ఎదగలేకపోతుంటారు. కారణం.. అసమానత. మీరూ ఇలాంటి వారిలో ఒకరా? అయితే బాధపడాల్సిన పనిలేదంటున్నారు కార్పొరేట్ నిపుణులు. మీ అందరికీ ఒక టీమ్ లీడర్ ఉన్నప్పటికీ మీకు మీరే నాయకురాలిగా భావించాలి. మీరు చేసే పనిలో నాణ్యత, మీ సృజనాత్మకతను సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెట్టాలి. ‘ఇది మా స్థాయికి తగ్గది కాదే’ అని మీకు వచ్చిన ఆలోచనల్ని మీలోనే దాచుకోకుండా మీరేం చేయాలనుకుంటున్నారో అందరి ముందు ధైర్యంగా చెప్పగలగాలి. అప్పుడే మీలోని నాయకురాలి గురించి అందరికీ తెలుస్తుంది. ఇలా మీరు చూపిన ధైర్యాన్నే మార్గదర్శకంగా తీసుకొని మరింతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారందరికీ మీరే లీడర్ అవుతారు. తద్వారా మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ కెరీర్‌లో ఉన్నతి సాధిస్తారనడంలో సందేహం లేదు.

అందుకు భయమెందుకు?

మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఎంతటి ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ కొంతమంది తగిన పదోన్నతులు అందుకోలేకపోతుంటారు. తమ ప్రతిభ గురించి ఉన్నతాధికారులతో స్పష్టంగా మాట్లాడకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు కార్పొరేట్ నిపుణులు. 'నేను సమర్థంగా పనిచేస్తున్నాను..' అని మీరు పూర్తి విశ్వాసంగా ఉన్నట్లయితే మీ పనికి తగిన గుర్తింపు లభించట్లేదని మీ పైఅధికారులతో నిర్భయంగా మాట్లాడండి. మీరు చేసే పనికి తగిన జీతం లభించట్లేదని కూడా వారితో చర్చించండి. అప్పుడు వారు మీ ధైర్యాన్ని గ్రహించడంతో పాటు మీ పని గురించి సమీక్షించి మీరు అర్హులైతే మీకు ప్రమోషన్ ఇవ్వడం, జీతభత్యాలు పెంచడం.. వంటివి చేస్తారు. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం, పని పట్ల మక్కువ మరింత పెరుగుతాయి. అలా కాకుండా ఎంత పని చేస్తున్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మీరు మీ ఉద్యోగంలో ఎదగలేరు. ఉన్నత స్థానాల్ని అధిరోహించలేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్